ఐఏఎస్‌లే దిక్కు
రాజంపేట, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో జిల్లాలో ఐఎఎస్‌ల పాలనే దిక్కైంది. ఐఏఎస్ హోదా కలిగిన కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ నిర్మల, రాజంపేట జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తమ కార్యాలయాలకు పరిమితం అయ్యారు. 72 శాఖలకు చెందిన సుమారు 4 వేల మంది అధికారులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దీంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలబడిపోగా, పాలన స్తంభించింది. పరిపాలనలో కీలక భూమిక పోషించే డిప్యూటీ కలెక్టర్లు శుక్రవారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లిపోయారు.
అదనపు జాయింట్ కలెక్టరు మొదలుకుని ఆర్డీఓలు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు విధులను బహిష్కరించి సమ్మెలో అగ్రభాగాన నిలిచారు. దీంతో వారి కింద పని చేసే ఉద్యోగులు, సిబ్బంది సైతం అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఐఏఎస్‌ల వద్ద పని చేసే డ్రైవర్లు, ధపేదార్లు, క్యాంపు క్లర్కులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐఏఎస్‌ల వరకు ఇబ్బంది లేకుండా పోయింది. లేకుంటే వారు కూడా సమ్మె సెగతో సేవలకు దూరమైయ్యే వారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్ తర్వాతి క్యాడర్లోని కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు సమ్మెకు మద్దతు తెలిపారు.
చౌక డిపోల్లో రేషన్ సరఫరాపై ప్రభావం
జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలోకి వెళ్లడంతో దీని ప్రభావం రేషన్ పంపిణీపై పడనుంది. వచ్చే నెల నుంచి స్టోర్లతో నిత్యావసర సరుకులు అందడం అనుమానమే. ఇప్పటి వరకు చౌక డిపో డీలర్లు డీడీలు కట్టకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రతి నెలా 18 నుంచి డీడీలు చెల్లించిన తర్వాత స్టోర్లలో 30లోగా నిత్యాసర సరుకులను పంపిణీ చేసేవారు. జిల్లాలో 19 స్టాక్ పాయింట్లు ఉండగా, ఇప్పటి వరకు డీలర్లకు సరుకులు సరఫరా చేసే వారే కరువయ్యారు.
సమైక్య గర్జనకు సన్నాహాలు
సమైక్యాంధ్రకు మద్దత్తుగా సమైక్య గర్జనకు జిల్లా కేంద్రంలో సన్నహాలు చేస్తున్నాం. అది కూడా వచ్చే శనివారం నిర్వహించేందుకు యోచిస్తున్నాం. ఈ మేరకు సోమవారం సమావేశం జరగనుంది. సమైక్యాంధ్ర కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువడేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది.
- ఈశ్వరయ్య, అధ్యక్షుడు,
జిల్లా అధికారుల సంఘం,