ఐసీసీ టెస్టు జట్టులో రోహిత్, పంత్, అశ్విన్.. కోహ్లికి దక్కని చోటు
ఐసీసీ టెస్టు జట్టు 2021లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌లు స్థానం సంపాదించగా.. ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లికి మాత్రం స్థానం దక్కలేదు.గతేడాది తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపిన కేన్ విలియమ్సన్కు కెప్టెన్‌గా అవకాశం దక్కగా... అదే మ్యాచ్‌లో బౌలింగ్‌లో మెరిసిన కైల్ జేమీసన్‌కు జట్టులో చోటు లభించింది.
డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న దిముత్ కరుణరత్నే(శ్రీలంక) రెండో ఓపెనర్‌గా.. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మిడిలార్డర్లో.. పాకిస్తాన్ నుంచి పవాద్ ఆలమ్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీలు చోటు దక్కించుకున్నారు. కాగా ఇప్పటికే ప్రకటించిన ఐసీసీ వన్డే, టి20 జట్టులో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.
ఐసీసీ పురుషుల టెస్టు జట్టు 2021: దిముత్ కరుణరత్నే (శ్రీలంక), రోహిత్ శర్మ (భారత్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్, న్యూజిలాండ్), మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), ఫవాద్ ఆలం (పాకిస్తాన్), రిషబ్ పంత్ ( భారత్), రవిచంద్రన్ అశ్విన్ (భారత్), కైల్ జేమీసన్ (న్యూజిలాండ్), షాహిన్ షా ఆఫ్రిది (పాకిస్థాన్), హసన్ అలీ (పాకిస్థాన్)
►ఇక ఐసీసీ టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న రోహిత్ గతేడాది క్యాలెండర్ ఇయర్లో 47.68 సగటుతో 906 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. రోహిత్ సాధించిన రెండు సెంచరీల్లో ఒకటి స్వదేశంలో(చెన్నైలో), మరొకటి విదేశంలో(ఓవల్) వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లో ఇంగ్లండ్ ప్రత్యర్థి కావడం విశేషం.
►టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. గతేడాది కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. 12 టెస్టుల్లో 748 పరుగులు సాధించిన పంత్‌కు ఒక సెంచరీ ఉంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇక కీపర్‌గా 23 ఇన్నింగ్స్‌లో 39 డిస్మిసల్స్(స్టంపింగ్స్, క్యాచ్) చేశాడు.
►టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతేడాది టెస్టుల్లో విశేషంగా రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 54 వికెట్లు తీసిన అశ్విన్.. స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేగాక బ్యాట్‌తోను 355 పరుగులు చేసిన అశ్విన్ ఖాతాలో ఒక టెస్టు సెంచరీ ఉండడం విశేషం.