ICPS officers
-
ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..
అనంతపురం సెంట్రల్/చిలమత్తూరు: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. అనాథ శిశువుగా శిశుగృహకు చేరుకున్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అసలేం జరిగిందంటే... సరిగ్గా ఐదునెలల క్రితం (జూన్ 7న) చిలమత్తూరులో ముళ్లపొదల మధ్యన నవజాత మగ శిశువు లభ్యమైంది. స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించారు. శిశువును వెంటనే కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అనంతపురంలోని శిశుగృహకు చేర్చారు. ఉత్కంఠకు తెర పెనుకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన దంపతులు బతుకు తెరువు కోసం చిలమత్తూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెకు ప్రసవమైంది. ఆ సమయంలో ఆమె మతిస్థిమితం లేక నవజాత శిశువును వదిలేసి ఇంటికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం విషయం తెలుసుకున్న భర్త వెంటనే చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే శిశువును శిశుగృహకు అప్పగించినట్లు పోలీసులు తెలపడంతో అనంతపురం చేరుకుని ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాడు. అయితే తమ బిడ్డేననే ఆధారాలు చూపలేకపోవడంతో శిశువు అప్పగింతకు అధికారులు అంగీకరించలేదు. దీంతో తండ్రి జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థను ఆశ్రయించాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిశువుకు ఐసీడీఎస్ అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక గురువారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. అందులో శిశువు తల్లిదండ్రులు వారేనని రుజువైంది. దీంతో తల్లిదండ్రులకు గురువారం సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మి సమక్షంలో ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి అప్పగించారు. శిశుగృహ సిబ్బందికి అభినందన తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన తరుణంలో ముళ్లపొదల మధ్య నుంచి నేరుగా తమ చెంతకు చేరుకున్న శిశువును శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు బిడ్డ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న తరుణంలో శిశుగృహ సిబ్బంది కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారిని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మీ, సభ్యులు ఓబుళపతి, కామేశ్వరి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి తదితరులు అభినందించారు. తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ శ్రీలక్ష్మీ, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వరి, చంద్రకళ, చిలమత్తూరు పోలీసులు పాల్గొన్నారు. (చదవండి: వరద గుప్పిట్లో అనంతపురం) -
‘అమ్మా’నవీయం..
భద్రాచలంటౌన్: అయ్యో పాపం..పసివాడు. నాలుగేళ్ల పిల్లాడు. కానీ..ఆ తల్లి ఎంత కోపంతో ఉందో..ఏ బాధలో చేసిందో కానీ..కర్కశంగా వాతలు పెట్టింది. తాను కన్న బిడ్డే అయినా..ఎందుకో ఆ క్షణంలో మానవత్వం మరిచింది. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన పల్లపు లంకమ్మ తన నాలుగేళ్ల కుమారుడు రఘురాం మట్టి తింటున్నాడని వాతలు పెట్టింది. ఈమె భర్త ఈ ఏడాది అక్టోబర్‌లో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండట్లేదు. ఆరేళ్ల కూతురితో పాటు ఈ బాబును సాకేందుకు ఆదాయం లేక, అటు భర్త మరణం తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని..కోపాన్ని పిల్లలపై చూపుతుంటుందని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) కౌన్సిలర్ యశోద తెలిపారు. ఈ క్రమంలో శనివారం పిల్లాడు రఘురాం మట్టి తింటున్నాడని కోపంతో గరిటెను కాల్చి ఎడమ బుగ్గ మీద, రెండు చేతుల మీద కాల్చింది. బాబు శరీరం కమిలి తల్లడిల్లుతుండడంతో స్థానికులు అంగన్వాడీ టీచర్ మాధవికి విషయం తెలిపారు. ఐసీడీఎస్ కౌన్సిలర్ యశోద, పోలీస్ వారు సోమవారం లంకమ్మ ఇంటికి వెళ్లి..కౌన్సెలింగ్ నిర్వహించి, బాలుడిని ఖమ్మంలోని చైల్డ్ కేర్‌లో ఉంచుతామని తెలిపారు. ఆ తల్లిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
బాలల కడుపు మార్చారు...
- పస్తులుంచిన ఐసీపీఎస్ అధికారులు - ఉదయం నుంచి బిస్కట్లతోనే సరి.. మంకమ్మతోట: కార్మికులుగా మారిన వారిని అక్కున చేర్చుకుని సంక్షేమానికి కృషిచేయాల్సిన ఐసీపీఎస్ అధికారులు బాలలను శనివారం పస్తులుంచి పరేషాన్ చేశారు. కార్ఖానాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో బందీలుగా ఉండి పనిచేస్తున్న వారికి విముక్తి కల్గిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న సమగ్ర బాలల సంరక్షణ పథకం ఆధ్వర్యంలో దాడులు ముమ్మరం చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనులు చేస్తూ సంస్థకు కనిపించిన బాలలను తీసుకొస్తున్నారు. వివిధ పనులు చేస్తూ, భిక్షాటన చేస్తూ, వీధుల్లో చెత్తకాగితాలు ఏరుకుంటూ కనిపించిన 480 మంది బాలలను ఈ నెల గుర్తించారు. శనివారం సిరిసిల్ల నుంచి ఆరుగురు బాలబాలికలు, హుజూరాబాద్ 14, పెద్దపల్లి 7, జగిత్యాల 7, కరీంనగర్లో 13మంది బాలకార్మికులుగా గుర్తించి సీడూబ్ల్యూసీ చైర్పర్సన్ కొమురయ్య ఎదుట హాజరుపర్చేందుకు సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ బాలలను ఉదయం 9 గంటలకు గుర్తించి తరలించారు. వీరిని కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి మహిళా పోలీసు కానిస్టేబుల్‌ను సెక్యూరిటీగా ఉంచారు. ఉదయం నుంచి టీ, టిఫిన్, భోజనం వంటివి ఏమీ పెట్టకుండా బిస్కట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కడుపులో తిప్పినట్లు అయి బెంచీలపై పడుకున్నారు. తమ పిల్లలను అధికారులు తీసుకువెళ్లారనే సమాచారం తెలుసుకుని శాఖ కార్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులు ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నట్లు బాధితులు తెలిపారు. ఒక పూట బడి కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. చుట్టపు చూపుగా నేపాల్ నుంచి వచ్చిన అబ్బాయి సునీల్(12)ను వీధిలో కనిపించగానే తీసుకువ చ్చారని, మధ్యాహ్నం భోజనం సమయంలో తీసుకువచ్చి ఇప్పటివరకు ఆహారం ఏమీ ఇవ్వలేదని కమల అనే మహిళా ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చిన అధికారులు రెండుసార్లు బిస్కట్లు మాత్రమే ఇచ్చారని ఆరెపల్లికి చెందిన బాలిక రష్మి(13), సుగ్లాంపల్లికి చెందిన అనిల్(11), వేములవాడకు చెందిన దుర్గేష్ తెలిపారు. ఈ విషయంపై సీడబ్ల్యూసీ చైర్పర్సన్ కొమురయ్య, ఐసీపీఎస్ జిల్లా కోఆర్డినేటర్ పర్వీన్‌ను వివరణ కోరగా.. బిస్కట్లు, మంచినీరు ఇచ్చామని, టిఫిన్, భోజనం వంటివి పెట్టలేదని తెలిపారు. పిల్లలకు ఆహారం అందించేంత బిల్లు తమ వద్ద లేదని పేర్కొన్నారు.