- పస్తులుంచిన ఐసీపీఎస్ అధికారులు
- ఉదయం నుంచి బిస్కట్లతోనే సరి..
మంకమ్మతోట: కార్మికులుగా మారిన వారిని అక్కున చేర్చుకుని సంక్షేమానికి కృషిచేయాల్సిన ఐసీపీఎస్ అధికారులు బాలలను శనివారం పస్తులుంచి పరేషాన్ చేశారు. కార్ఖానాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో బందీలుగా ఉండి పనిచేస్తున్న వారికి విముక్తి కల్గిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న సమగ్ర బాలల సంరక్షణ పథకం ఆధ్వర్యంలో దాడులు ముమ్మరం చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనులు చేస్తూ సంస్థకు కనిపించిన బాలలను తీసుకొస్తున్నారు. వివిధ పనులు చేస్తూ, భిక్షాటన చేస్తూ, వీధుల్లో చెత్తకాగితాలు ఏరుకుంటూ కనిపించిన 480 మంది బాలలను ఈ నెల గుర్తించారు.
శనివారం సిరిసిల్ల నుంచి ఆరుగురు బాలబాలికలు, హుజూరాబాద్ 14, పెద్దపల్లి 7, జగిత్యాల 7, కరీంనగర్‌లో 13మంది బాలకార్మికులుగా గుర్తించి సీడూబ్ల్యూసీ చైర్‌పర్సన్ కొమురయ్య ఎదుట హాజరుపర్చేందుకు సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ బాలలను ఉదయం 9 గంటలకు గుర్తించి తరలించారు. వీరిని కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి మహిళా పోలీసు కానిస్టేబుల్‌ను సెక్యూరిటీగా ఉంచారు. ఉదయం నుంచి టీ, టిఫిన్, భోజనం వంటివి ఏమీ పెట్టకుండా బిస్కట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కడుపులో తిప్పినట్లు అయి బెంచీలపై పడుకున్నారు. తమ పిల్లలను అధికారులు తీసుకువెళ్లారనే సమాచారం తెలుసుకుని శాఖ కార్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులు ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నట్లు బాధితులు తెలిపారు.
ఒక పూట బడి కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. చుట్టపు చూపుగా నేపాల్ నుంచి వచ్చిన అబ్బాయి సునీల్(12)ను వీధిలో కనిపించగానే తీసుకువ చ్చారని, మధ్యాహ్నం భోజనం సమయంలో తీసుకువచ్చి ఇప్పటివరకు ఆహారం ఏమీ ఇవ్వలేదని కమల అనే మహిళా ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చిన అధికారులు రెండుసార్లు బిస్కట్లు మాత్రమే ఇచ్చారని ఆరెపల్లికి చెందిన బాలిక రష్మి(13), సుగ్లాంపల్లికి చెందిన అనిల్(11), వేములవాడకు చెందిన దుర్గేష్ తెలిపారు. ఈ విషయంపై సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ కొమురయ్య, ఐసీపీఎస్ జిల్లా కోఆర్డినేటర్ పర్వీన్‌ను వివరణ కోరగా.. బిస్కట్లు, మంచినీరు ఇచ్చామని, టిఫిన్, భోజనం వంటివి పెట్టలేదని తెలిపారు. పిల్లలకు ఆహారం అందించేంత బిల్లు తమ వద్ద లేదని పేర్కొన్నారు.
బాలల కడుపు మార్చారు...
Published Sun, Feb 1 2015 9:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM
Advertisement
Advertisement