దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో డాక్టర్ శివప్రసాద్, ఎమ్‌వీ శివకుమార్‌రెడ్డి
‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయంచేసే చేతులు మిన్న’.. ఓ అధికారి ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆ యువకులను ఉన్నతస్థాయికి చేర్చింది. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు ఒక అధికారి ఇచ్చిన చేయూత వారి జీవితాలను మార్చేసింది. ఒకరు డాక్టరు అయితే మరో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కాగా.. ఇంకొకరు íసీఏ ఫైనల్ చదువుతున్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఈ పేద విద్యార్థుల విజయగాథ ఏమిటంటే..
బీవీ రాఘవరెడ్డి
1998లో కర్నూలుకు చెందిన నిరుపేద తల్లిదండ్రులు తమ కుమారుడు శివప్రసాద్‌ను 8వ తరగతిలోనే చదువు మాన్పించి స్థానిక జిన్నింగ్ మిల్లులో సంచులు కుట్టే పనిలో పెట్టారు. తనిఖీ నిమిత్తం ఆ మిల్లుకు వెళ్లిన ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి ఆ కుర్రాడితో కాసేపు మాట్లాడాక అతనికి చదువుపై ఉన్న ఇష్టాన్ని గుర్తించారు. శివప్రసాద్ తండ్రిని ఒప్పించి.. తానే స్కూలులో చేర్పించి ఆర్థికసాయం అందిస్తూ వచ్చాడు. టెన్త్, ఇంటర్‌లో మంచి మార్కులు సంపాదించిన శివప్రసాద్ ఆ తర్వాత మెడిసిన్ సీటు సాధించాడు. అనంతరం జనరల్ మెడిసిన్‌లో పీజీ, క్లినికల్ ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు కర్నూలు విశ్వభారతి మెడికల్ కళాశాలలో మెడికల్ ఆంకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.
గుంటూరుకు చెందిన జనార్థన్‌దీ ఇలాంటి కథే. చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనికి వెళ్తున్న ఆ కుర్రాణ్ణి శివకుమార్‌రెడ్డి చేరదీసి ఇంటర్‌లో చేర్పించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పుణ్యమా అని కోర్సు పూర్తయ్యాక ఫోన్‌పేలో ఉద్యోగం సంపాదించాడు.
ఇక ఏటుకూరుకు చెందిన యలవర్తి శివకుమార్ కూడా వీరిలాగే గుంటూరులోనే బాలకార్మికుడిగా పనిచేస్తుండగా శివకుమార్‌రెడ్డికి తారసపడ్డాడు. అతనికి చదువుపై ఆసక్తి ఉందని తెలిసి సీఏ ఇంటర్‌లో చేర్పించారు. అతను ఇప్పుడు సీఏ ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. శివకుమార్ అన్న విజయకుమార్‌కు సైతం చేయూతనివ్వటంతో అతనూ ఫీజు రీయింబర్స్‌మెంటుతో బీటెక్ పూర్తిచేసి టీసీఎస్‌లో రూ.22 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.
పేద పిల్లల చదువుకు చేయూత
వివిధ కారణాలతో కొందరు పిల్లలు చిన్న వయసులోనే చదువుకు దూరమవుతున్నారు. నా విధి నిర్వహణలో భాగంగా ఫ్యాక్టరీల్లో బాల కార్మికులను గుర్తించి వారిని ఇంటికి పంపడంతో సరిపెట్టకుండా చదువు వైపు మళ్లిస్తున్నాను. నాలుగు కుటుంబాల్లో వెలుగు రావటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అదే స్ఫూర్తితో నంద్యాలలోని నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ‘ఆపద్బంధు సేవాసమితి’ని ప్రారంభించి పేద పిల్లల చదువుకు చేయూతనిస్తున్నాం.
– ఎంవీ శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
విజయ్‌కుమార్‌కు వచ్చిన టీసీఎస్ ఆఫర్ లెటర్
నేను సైతం..
నేను టెన్త్ చదువుతున్నప్పుడు గుంటూరులోనే ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడ్ని. అప్పుడు తనిఖీకొచ్చిన ఇన్స్‌పెక్టర్ శివకుమార్‌రెడ్డి నన్ను ప్రోత్సహించి సాయంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు తోడ్పాటుతో ఇంజనీరింగ్ పూర్తిచేశా. ప్రస్తుతం ఫోన్‌పేలో పనిచేస్తున్నాను. సార్ చూపిన బాటలో విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాను.
– గుంజి జనార్థన్‌రావు, బిజినెస్ డెవలెప్‌మెంట్ అసోసియేట్, ఫోన్‌పే
ఆ స్ఫూర్తి మరువలేనిది..
పేద కుటుంబం కావటంతో చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనిచేసేవాణ్ని. 2008లో సార్ తనిఖీకి వచ్చినపుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పనిమానేసి చదువుపై శ్రద్ధపెట్టాలని చెప్పి ఆర్థికసాయం చేశారు. టెన్త్‌లో మంచి మార్కులొస్తే కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ ఘటన మర్చిపోలేను. నేను ఈస్థాయికి చేరుకోవడానికి సార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం.
– యలవర్తి శివకుమార్, సీఏ ఫైనల్
Comments
Please login to add a commentAdd a comment