సాక్షి, హిందూపురం: ‘అమ్మా... నేనూ బడికి పోతానమ్మా.. నాన్నకు చెప్పు.. నన్ను బడికి పిలుచుకెళ్లమని’ అంటూ ప్రాధేయపడుతున్న ఆ బాలుడి మాటలు విన్న కన్నతల్లికి కంట నీరు ఆగలేదు. అందరిలా తాను కూడా ఆడుకోవాలని, చదువుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్న కుమారుడిని చూస్తూ నిరుపేద తల్లిదండ్రులు అసహాయ స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు.
ఏం జరిగింది?..
హిందూపురంలోని మేళాపురం ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్, నూర్జహాన్ దంపతుల ఏకైక కుమారుడు హర్షాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటిపైన కోతులు చేరుకుని అపరిశుభ్రం చేస్తున్నాయంటూ వాటిని అదిలించేందుకు కర్ర తీసుకుని మిద్దెపైకి హర్షాద్ వెళ్లాడు. ఆ సమయంలో కోతులను అదలిస్తూ ఇంటి పైభాగంలో వెళుతున్న హైటెన్షన్ (33కేవీ) విద్యుత్ వైర్ల ప్రభావం కారణంగా షాక్‌కు గురయ్యాడు. దీంతో మెడ నుంచి కుడి వైపు శరీరం మొత్తం కాలిపోయింది.
ఉన్నదంతా అమ్మి..
లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రఫీక్ పెద్ద ఆస్తి పరుడేమీ కాదు. వృత్తిలో భాగంగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అడపాదడపా కొంత మొత్తం పొదుపు చేసుకున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురైన కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వైద్య చికిత్సకు పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ఉన్న కొద్దిపాటి బంగారు నగలూ కర్పూరంలా కరిగిపోయాయి.
దాదాపు రూ. 5లక్షలకు పైగా ఖర్చు పెట్టి కుమారుడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మెడ నుంచి నడుము వరకూ కుడివైపు శరీరం పూర్తిగా కాలిపోయి ముడతలు పడింది. కుడి చేతిలోని నాలుగు వేళ్లూ తొలగించారు. శరీరంలో నీటి శాతం తగ్గింది. గొంతు వద్ద నరాలు గట్టిపడ్డాయి. శరీరంలో రక్తప్రసరణతో పాటు నరాల వ్యవస్థ మెరుగు పడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు.
ఇందు కోసం రూ. 30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే వారానికి ఒకసారి బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లి వచ్చేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తం సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతోందని, ఎవరైనా మానవతావాదులు స్పందించి తమ బిడ్డను మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు.
దాతలు సాయం చేయదలిస్తే...
పేరు: షేక్ మహమ్మద్ రఫీక్
బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఖాతా నంబర్ : 3878 101 6511
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : టఆఐN 0004696
ఫోన్ పే నంబర్ : 76709 34214
(చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం)
Comments
Please login to add a commentAdd a comment