donars help
-
అమ్మా.. నేనూ బడికి పోతా!
సాక్షి, హిందూపురం: ‘అమ్మా... నేనూ బడికి పోతానమ్మా.. నాన్నకు చెప్పు.. నన్ను బడికి పిలుచుకెళ్లమని’ అంటూ ప్రాధేయపడుతున్న ఆ బాలుడి మాటలు విన్న కన్నతల్లికి కంట నీరు ఆగలేదు. అందరిలా తాను కూడా ఆడుకోవాలని, చదువుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్న కుమారుడిని చూస్తూ నిరుపేద తల్లిదండ్రులు అసహాయ స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. ఏం జరిగింది?.. హిందూపురంలోని మేళాపురం ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్, నూర్జహాన్ దంపతుల ఏకైక కుమారుడు హర్షాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటిపైన కోతులు చేరుకుని అపరిశుభ్రం చేస్తున్నాయంటూ వాటిని అదిలించేందుకు కర్ర తీసుకుని మిద్దెపైకి హర్షాద్ వెళ్లాడు. ఆ సమయంలో కోతులను అదలిస్తూ ఇంటి పైభాగంలో వెళుతున్న హైటెన్షన్ (33కేవీ) విద్యుత్ వైర్ల ప్రభావం కారణంగా షాక్‌కు గురయ్యాడు. దీంతో మెడ నుంచి కుడి వైపు శరీరం మొత్తం కాలిపోయింది. ఉన్నదంతా అమ్మి.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రఫీక్ పెద్ద ఆస్తి పరుడేమీ కాదు. వృత్తిలో భాగంగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అడపాదడపా కొంత మొత్తం పొదుపు చేసుకున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురైన కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వైద్య చికిత్సకు పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ఉన్న కొద్దిపాటి బంగారు నగలూ కర్పూరంలా కరిగిపోయాయి. దాదాపు రూ. 5లక్షలకు పైగా ఖర్చు పెట్టి కుమారుడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మెడ నుంచి నడుము వరకూ కుడివైపు శరీరం పూర్తిగా కాలిపోయి ముడతలు పడింది. కుడి చేతిలోని నాలుగు వేళ్లూ తొలగించారు. శరీరంలో నీటి శాతం తగ్గింది. గొంతు వద్ద నరాలు గట్టిపడ్డాయి. శరీరంలో రక్తప్రసరణతో పాటు నరాల వ్యవస్థ మెరుగు పడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు. ఇందు కోసం రూ. 30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే వారానికి ఒకసారి బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లి వచ్చేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తం సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతోందని, ఎవరైనా మానవతావాదులు స్పందించి తమ బిడ్డను మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయదలిస్తే... పేరు: షేక్ మహమ్మద్ రఫీక్ బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ : 3878 101 6511 ఐఎఫ్ఎస్సీ కోడ్ : టఆఐN 0004696 ఫోన్ పే నంబర్ : 76709 34214 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
చేయందిస్తే..చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్‌గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది. 2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్‌లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది. డిసెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ షాట్ ఫుట్‌లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్‌గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు. (చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు) -
రెండు కిడ్నీలు ఫెయిల్.. ఆదుకుంటే చదువుకుంటా
చండూరు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. పెద్ద చదువులు చదివి ఉన్నత ఉ ద్యోగం చేయాలన్న ఆ విద్యార్థిని కోరికకు అనారోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన దోనాల భూపాల్‌రెడ్డి, ప్రేమలత దంపతులు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చండూరు పట్టణానికి వలస వచ్చారు. బ్యాంక్ రుణం సహాయంతో ఇక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకున్నారు. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, కుమారుడు చదువుకుంటున్నాడు. కాగా రెండో కుమార్తె గాయత్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంపాలైంది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.18 లక్షలకు పైగా ఖర్చు చేసిన తర్వాత గాయత్రి రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు మందులకు ఖర్చవుతుందని, పాల వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికే సరిపోతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మందులు తెచ్చేందుకు అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక రెండు నెలలుగా మందులు వాడడం లేదని, దీంతో గాయత్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిడ్నీల మార్పిడికి లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెబుతుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అనారోగ్యంతోనే డిగ్రీ పూర్తి నడవలేని స్థితిలో ఉండి కూడా గాయత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ పూర్తి చేసింది. వారంలో రెండు, మూడు రోజులు బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చేది. తీవ్ర జ్వరం ఉన్నా సరే పరీక్షలు రాసి మొదటి ర్యాంకులో పాస్ అయ్యింది. ఉన్నత చదువులు చదువుతా నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా. డబ్బులు లేక ఇటీవల మందులు కూడా వాడడం మానేశా. అక్క పెళ్లికి చేసిన అప్పు అలానే ఉండటంతో అమ్మానాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ్ముడు చదువు మానేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం చేస్తే మా కుటుంబ కష్టాల నుంచి బయటపడుతుంది. - గాయత్రి -
చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం
సామర్లకోట (పెద్దాపురం) : స్థానిక మెహర్ కాంప్లెక్స్‌లో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అమర్తి దుర్గాప్రసాద్ (7), లక్ష్మి (4) మార్త (2)ను ఆదుకోవడానికి అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. అమర్తి వెంకట్, చిన్న దంపతులకు జన్మించిన ఈ ముగ్గురు పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వారి పరిస్థితిపై ‘ దాతలే వీరిని ఆదుకోవాలి’ అనే శీర్షికతో ఫిబ్రవరి 2వ తేదీన సాక్షి దినపత్రికలో కథనం ప్రచురతమైంది. దాన్ని చదివిన అనేక మంది సాయం చేస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం కాకినాడకు చెందిన సమాఖ్య చారిటబుల్ సొసైటీ నుంచి రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని ఆ సంస్థ ప్రతినిధి అచ్యుత్.. పిల్లల తల్లిదండ్రులకు అందజేశారు. ఒక్కొక్క చిన్నారికి ఆపరేషన్‌కు రూ.30 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం సరిపోక.. దాతల కోసం సాక్షి దినపత్రికను తల్లిదండ్రులు ఆశ్రయించారు. కనీసం ఒక పిల్లవాడినైనా దక్కించుకోవాలనే ఆశతో ఉన్నామని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.4.60 లక్షలు ఆర్థికసాయం అందిందని వెంకట్ ‘సాక్షి’కి తెలిపారు. కాకినాడకు చెందిన కె.మహేష్ అనే విద్యార్థి విశాఖపట్నంలో చదువుకుంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని వెబ్ న్యూస్‌లో చదివి సమాఖ్య చారిటబుల్ ట్రస్టుకు తెలియజేశారని, దాంతో సంస్థ సభ్యులు విచారణ చేసి ఆదివారం ఈ సాయం అందించారన్నారు. -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
పొదలకూరు : చీకూ, చింత లేకుండా హాయిగా సాగిపోతున్న ఆ కుటుం బానికి ఊహించని రీతి లో పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంటి పెద్ద తీవ్ర అనారోగ్యానికి గురవడం, చికిత్సకు లక్షల రూపాయలు అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో విలవిలలాడిపోతోంది. ప్రభుత్వంతో పాటు దాతల సాయం కోరుకుంటోంది. పొదలకూరులోని విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన పసుపులేటి ప్రసాద్‌బాబు (33) విద్యుత్ గృహోపకణ వస్తువుల మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ప్రసన్న, కుమార్తెలు రాజశ్రీ(4), నిత్యశ్రీ(2) ఉన్నారు. ఉన్నంతలో ఆనందంగా జీవిస్తుండగా పిడుగులాంటి విషయం వీరికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రసాద్‌బాబు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. లివర్ పాడైందని వైద్యులు తేల్చారు. ఎందుకైనా మంచిదని చెన్నైలోని మరో ఆస్పత్రిలో సంప్రదించారు. అక్కడా అదే విషయం నిర్ధారించారు. ఎవరైనా లివర్ దానం చేస్తే ఆపరేషన్ ఖర్చు రూ.30 లక్షలు అవుతుందని, లేదంటే రూ.50 లక్షలు వరకు అవసరమవుతుందని తెలిపారు. ఇంత మొత్తం ఖర్చు చేసే స్తోమత లేక కుటుంబసభ్యులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని ప్రసాద్‌బాబు ఇలాంటి ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చిందోనని కన్నీరుమున్నీరవుతున్నారు. నా భర్తను కాపాడండి ఎంతో భవిష్యత్తు ఉన్న తన భర్త ప్రసాద్‌బాబు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని, వెంటనే లివర్ ట్రాన్స్ప్లంటేషన్ చేయించకుంటే జీవించే పరిస్థితి లేదని, ప్రభుత్వం, దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రసన్న వేడుకుంటోంది. సోమవారం ఆమె విలేకరులకు తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని కన్నీటి పర్యంతమై వివరించింది.