సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్‌గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది.
2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్‌లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది.
డిసెంబర్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ షాట్ ఫుట్‌లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది.
అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్‌గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు.
(చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు)
Comments
Please login to add a commentAdd a comment