పేద కుటుంబానికి పెద్ద కష్టం
పేద కుటుంబానికి పెద్ద కష్టం
Published Tue, Aug 23 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
పొదలకూరు : చీకూ, చింత లేకుండా హాయిగా సాగిపోతున్న ఆ కుటుం బానికి ఊహించని రీతి లో పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంటి పెద్ద తీవ్ర అనారోగ్యానికి గురవడం, చికిత్సకు లక్షల రూపాయలు అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో విలవిలలాడిపోతోంది. ప్రభుత్వంతో పాటు దాతల సాయం కోరుకుంటోంది. పొదలకూరులోని విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన పసుపులేటి ప్రసాద్‌బాబు (33) విద్యుత్ గృహోపకణ వస్తువుల మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ప్రసన్న, కుమార్తెలు రాజశ్రీ(4), నిత్యశ్రీ(2) ఉన్నారు. ఉన్నంతలో ఆనందంగా జీవిస్తుండగా పిడుగులాంటి విషయం వీరికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రసాద్‌బాబు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. లివర్ పాడైందని వైద్యులు తేల్చారు. ఎందుకైనా మంచిదని చెన్నైలోని మరో ఆస్పత్రిలో సంప్రదించారు. అక్కడా అదే విషయం నిర్ధారించారు. ఎవరైనా లివర్ దానం చేస్తే ఆపరేషన్ ఖర్చు రూ.30 లక్షలు అవుతుందని, లేదంటే రూ.50 లక్షలు వరకు అవసరమవుతుందని తెలిపారు. ఇంత మొత్తం ఖర్చు చేసే స్తోమత లేక కుటుంబసభ్యులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని ప్రసాద్‌బాబు ఇలాంటి ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చిందోనని కన్నీరుమున్నీరవుతున్నారు.
నా భర్తను కాపాడండి
ఎంతో భవిష్యత్తు ఉన్న తన భర్త ప్రసాద్‌బాబు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని, వెంటనే లివర్ ట్రాన్స్‌ప్లంటేషన్ చేయించకుంటే జీవించే పరిస్థితి లేదని, ప్రభుత్వం, దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రసన్న వేడుకుంటోంది. సోమవారం ఆమె విలేకరులకు తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని కన్నీటి పర్యంతమై వివరించింది.
Advertisement