Liver transplant surgery
-
సీఎం జగన్ పాదాలకు నమస్కరిస్తున్నా.. 12 గంటల్లోనే రూ.10లక్షలు
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యువకుడు ఆళ్లగడ్డ మౌలాలి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తాను ప్రతిపాదన పంపిన వెంటనే రూ.10లక్షలు మంజూరు చేస్తూ (ఎల్ఓసీ) ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదాలకు నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఎల్ఓసీని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు, తమ పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు హనీఫ్, షా హుసేన్తోపాటు నూరి, కౌన్సిలర్లు జిలాని బాషా, కమాల్, యెల్లాల మహ్మద్ గౌస్, వడ్ల ఖలీల్, ఇర్ఫాన్ బాషా తదితరులు సమస్యను తన దృష్టికి తేవడంతో తన కార్యాలయం నుంచి గురువారం సీఎం కార్యాలయానికి లేఖను పంపి ఫోన్ చేసినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం 12 గంటల్లోనే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారని, బాధితుడు మౌలాలి హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడన్నారు. మౌలాలికి అతని భార్య లివర్ ఇస్తోందని చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే మిగతా రూ.10లక్షల్లో తన వంతుగా సొంత డబ్బు రూ.3 లక్షలు ఇస్తున్నానని, మిగతా రూ.7లక్షలను పార్టీ నాయకులు అందిస్తున్నారని తెలిపారు. పెద్దమనసుతో స్పందించి 12 గంటల్లోనే రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి మానవత్వాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం పట్టణానికి చెందిన కరీముల్లా లివర్ ప్లాంటేషన్ కోసం సీఎం రూ.25 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులతోపాటు షాపీర్ ఆలి పాల్గొన్నారు. -
బాలిక లివర్ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు, హరూన్ గ్రూప్ సంస్థల ఎండీ ఎస్బి అహ్మద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్ షబానా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తన లివర్‌ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. -
సోనూసూద్ హామీ: రెండు రోజుల్లో వారంతా ఢిల్లీకి..
ముంబై: లాక్డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒకరు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్. ఇక వలస కూలీలు, కార్మికులను వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్ పేరే వినిపిస్తుంది.కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విమానం ఈ రోజు(శుక్రవారం) మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది. (సోనూ సూద్ దాతృత్వం: మరో విమానం) విదేశీ బాలలకు సోనూసూద్ సాయం కాలేయం మార్పిడి చికిత్స కోసం ఫిలిప్పీన్స్ నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన 39 మంది చిన్నారుల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ పిల్లలందరూ 1–5 ఏళ్ల వారే. వీరంతా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి న్యూఢిల్లీలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ప్రయాణం కుదరడం లేదన్న సంగతి సోను దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన ఆయన.. వచ్చే రెండ్రోజుల్లో వీరిని ఢిల్లీకి తీసుకువస్తామని, వీరి విలువైన ప్రాణాలు కాపాడాల్సి ఉందని ట్వీట్ చేశారు. (నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్ ఇస్తాను) Let’s save these precious lives. Will get them to India in the next two days. Lining up for these 39 angels. Pack their bags. ✈️ https://t.co/oY700MN4B2 — sonu sood (@SonuSood) August 13, 2020 -
మరణమా?.. హెచ్ఐవీతోనా?
జోహన్నెస్‌బర్గ్: ఓ వైపు ప్రాణాలు నిలబెట్టాలి.. మరో వైపు హెచ్ఐవీ సోకే ముప్పు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హెచ్ఐవీ సోకిన తల్లి కాలేయాన్ని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బిడ్డకి మార్పిడిచేసి దక్షిణాఫ్రికా వైద్యులు విజయం సాధించారు. ‘చావా? హెచ్ఐవీతోనే ఎల్లకాలం జీవించడమా? అన్న సందిగ్ధంలో వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైద్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ శస్త్రచికిత్స నుంచి తల్లీబిడ్డలు కోలుకున్నారు. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. తల్లి నుంచి హెచ్ఐవీ ఆమె బిడ్డకు సోకిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఆ వైరస్ లేని మరో వ్యక్తికి కాలేయాన్ని మార్పిడి చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే దాతల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్స్ డొనాల్డ్ గోర్డాన్ మెడికల్ సెంటర్ వైద్యులు ‘ఎయిడ్స్’ అనే జర్నల్‌లో గురువారం రాసిన వ్యాసంలో ఈ వివరాలున్నాయి. కాలేయ మార్పిడికి ముందు చిన్నారికి అందించిన ఔషధాలు.. ఆమెకు ఎయిడ్స్ సోకే ముప్పును నివారించి ఉండొచ్చని, అయినా కొంత కాలం గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బిడ్డకు తల్లి నుంచి హెచ్ఐవీ సోకే ముప్పు ఉందని భావించడంతో, కాలేయాన్ని మార్పిడి చేయడంపై ఎంతో మథనపడ్డామని పేర్కొన్నారు. సంక్రమిక వ్యాధుల నివారణ నిపుణులతో వరుస పరీక్షలు చేయించగా బిడ్డకు వైరస్ సోకినట్లు తేలలేదని తెలిపారు. ఒకవేళ ఆ చిన్నారి హెచ్ఐవీ బారిన పడినా కూడా..విస్తృ్తతంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఔషధాల సాయంతో సాధారణ జీవితం గడిపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
పొదలకూరు : చీకూ, చింత లేకుండా హాయిగా సాగిపోతున్న ఆ కుటుం బానికి ఊహించని రీతి లో పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంటి పెద్ద తీవ్ర అనారోగ్యానికి గురవడం, చికిత్సకు లక్షల రూపాయలు అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో విలవిలలాడిపోతోంది. ప్రభుత్వంతో పాటు దాతల సాయం కోరుకుంటోంది. పొదలకూరులోని విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన పసుపులేటి ప్రసాద్‌బాబు (33) విద్యుత్ గృహోపకణ వస్తువుల మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ప్రసన్న, కుమార్తెలు రాజశ్రీ(4), నిత్యశ్రీ(2) ఉన్నారు. ఉన్నంతలో ఆనందంగా జీవిస్తుండగా పిడుగులాంటి విషయం వీరికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రసాద్‌బాబు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. లివర్ పాడైందని వైద్యులు తేల్చారు. ఎందుకైనా మంచిదని చెన్నైలోని మరో ఆస్పత్రిలో సంప్రదించారు. అక్కడా అదే విషయం నిర్ధారించారు. ఎవరైనా లివర్ దానం చేస్తే ఆపరేషన్ ఖర్చు రూ.30 లక్షలు అవుతుందని, లేదంటే రూ.50 లక్షలు వరకు అవసరమవుతుందని తెలిపారు. ఇంత మొత్తం ఖర్చు చేసే స్తోమత లేక కుటుంబసభ్యులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని ప్రసాద్‌బాబు ఇలాంటి ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చిందోనని కన్నీరుమున్నీరవుతున్నారు. నా భర్తను కాపాడండి ఎంతో భవిష్యత్తు ఉన్న తన భర్త ప్రసాద్‌బాబు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని, వెంటనే లివర్ ట్రాన్స్ప్లంటేషన్ చేయించకుంటే జీవించే పరిస్థితి లేదని, ప్రభుత్వం, దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రసన్న వేడుకుంటోంది. సోమవారం ఆమె విలేకరులకు తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని కన్నీటి పర్యంతమై వివరించింది. -
‘కాలేయ మార్పిడి’లో తెలంగాణ ఆదర్శం
- ఉస్మానియా ఆస్పత్రిలో తక్కువ ఖర్చుకు చేయడంపై దేశవ్యాప్త చర్చ - ఈ నెల 24-26 తేదీల్లో జరిగే బెంగళూరు జాతీయ సదస్సులో ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ కాలేయ సదస్సులో ఈ అంశం ప్రముఖంగా చర్చకు రానుంది. చెన్నైకి చెందిన ప్రముఖ స్టాన్లీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యులు తెలంగాణలో తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అదెలా సాధ్యమైందో అధ్యయనం చేశారు. దీనిపై ప్రత్యేకంగా ఒక డాక్యుమెంట్‌ను రూపొందించారు. స్టాన్లీ మెడికల్ కాలేజీ వైద్యులు బెంగళూరులో జరిగే కాలేయ సంబంధిత సదస్సులో ‘ఉస్మానియా ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి’ అనే అంశంపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ చేయనున్నారు. ఉస్మానియాలో ఇప్పటివరకు నాలుగు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఒక్కోదానికి రూ. 10.50 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. సహజంగా కాలేయ మార్పిడి చికిత్స చేయాలంటే రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు కానుంది. నాలుగో వంతు ఖర్చుకే దీన్ని చేయడం ఎలా సాధ్యపడిందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ‘ఇది దేశంలోనే ఆదర్శం. ఇంత తక్కువ ఖర్చుకు కాలేయ మార్పిడి చేయడం అమోఘం’ అని స్టాన్లీ వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తిచేసిన సంగతి విదితమే. -
ఇది ఒక సంజయ నిజవిజయం!
ఆ టీనేజీ పిల్లాడు... ఆ కాలేజీ కుర్రాడు... ఇప్పుడు అందరిలాగే ఫేస్‌బుక్‌ను ఛేజ్ చేస్తుంటాడు. బాల్‌ను టార్గెట్గోల్లో పడేలా బాస్కెట్వీల్ మధ్యకు విసిరేస్తుంటాడు. ఇవ్వాళ్ల అతడు విసిరే బాల్...బాస్కెట్ వీల్ మధ్యకు ఎంత సుతారంగా జారుతుందో... సరిగ్గా 16 ఏళ్ల క్రితం మొత్తం పదహారు మంది (ఇద్దరు సర్జన్లతో పాటు 14 మంది ఆపరేషన్ థియేటర్లోని కేర్ గివర్స్) అంతే సుతారంగా ఆపరేషన్ జరిగేలా చూసేందుకు మొత్తం 16 సార్లు ట్రయల్ నిర్వహించారు. ఎందుకంటే ఆ పారామెడికల్ సిబ్బంది ఆపరేషన్ టైమ్‌లో ఎలాంటి తప్పూ చేయకూడదనే ఉద్దేశంతో. సర్జన్లు దక్షత కనబరచారు. లక్ష్యం నెరవేర్చారు. పద్దెనిమిది నెలల పిల్లాడికి చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇప్పుడు పద్దెనిమిదో ఏట ఆ పిల్లాడు ఆ స్ఫూర్తితో ఓ బాల్‌ను బాస్కెట్లోకి జారిపోయేంత సుతారంగా మెడికల్ కాలేజీలోకి తన ప్రవేశం జరగాలని పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఈ కుర్రాడి పేరు శక్తి సంజయ్ కందస్వామి. అతడు పద్దెనిమిది నెలల బాలుడిగా ఉన్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. అదీ... పదహారేళ్ల క్రితం... ఓ పద్దెనిమిది నెలల చిన్నారి ఒళ్లంతా పచ్చగా మెరిసిపోతోంది. కానీ పచ్చగా మెరిసేదంతా బంగారం కాదు. బంగారం లాంటి ఆ బంగారుతండ్రి ప్రాణాలను ఒడిసి పట్టుకోవాలంటే ఆ పచ్చదనాన్ని తొలగించాలి. అలా చేయాలంటే అతడికి కాలేయ మార్పిడి చేయాలి. అతడు పుట్టిన రెణ్ణెల్ల తర్వాత కాలేయానికీ, పేగుకూ ఉన్న చిన్న కనెక్షన్ తొలగిస్తే పోయే సమస్య కాస్తా... ఆ పని చేయనందుకు పెరిగి పెద్దదైంది. గోటితో పోయేది కాస్తా ప్రాణాలకు చేటు తెచ్చి ‘గాటు’ వరకూ వచ్చింది. ఆ గాటుకు మారో పేరు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అంటే మాటలు కాదు. ముందుగా జరిగింది కారుణ్య మార్పిడి. అంటే... పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు రోగీ, అతడి తండ్రి పట్ల కారుణ్యం పెంచేలా! ఆ తర్వాత నిపుణులంతా ఒకచోట చేరారు. అనుభవాలు పంచేలా!! ఈ నైపుణ్య మార్పిడీ, ఆ కారుణ్య మార్పిడీ... కలివిడిగా కడు వడిగా సాఫల్యదిశవైపు అడుగిడి నేడా కుర్రాణ్ణి తడబడకుండా అనేక రంగాల్లో ఆసక్తి చూపే ఆదర్శ విద్యార్థిగా నిలబెట్టాయి. అంతేకాదు... తనకు ప్రాణదానం చేసిన డాక్టర్ల నైపుణ్యాన్ని, తాను సాధించే దిశగా స్ఫూర్తిమంతం చేశాయి. పుస్తకాలతో రశ్మిమంతమై తానూ ఆ దిశగా శక్తిమంతం కావడానికి ఇప్పుడు కృతనిశ్చయంతో ఉన్నాడు. దృఢ నిశ్చలంగా చదువుతున్నాడు. అతడలా డాక్టరీయే చదవాలని అనుకోడానికి ఓ కారణం ఉంది. ఫ్లాష్‌బ్యాక్‌కు ఫ్యాష్‌బ్యాక్ అది కాంచీపురంలోని డాక్టర్ ఎమ్మార్ రాజశేఖర్ ఇల్లు. ఆయన షికాగో యూనివర్సిటీలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా పనిచేసి కాంచీపురానికి వచ్చారు. ఆయనను కలిసిన శక్తి సంజయ్ మేనత్త పద్దెనిమిది నెలల తన మేనల్లుడి దురవస్థను ఆయనకు వివరించారు. కాబట్టే కుర్రాణ్ణి కాపాడాలని పట్టుపట్టారు. ఢిల్లీలో తాను పనిచేసే ఇంద్రప్రస్థ ఆసుపత్రికి పిల్లాణ్ణి తీసుకురమ్మని కోరారు. వెంటనే సంజయ్ తల్లిదండ్రులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ డాక్టర్ రాజశేఖర్‌కు మరో సర్జన్ అరవింద్ సింగ్ సోయిన్ జతగూడారు. హెపటాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబాల్ వాళ్లకు తోడయ్యారు. త్రివిక్రములూ తమ నైపుణ్యాలను రవి అనే షికాగో పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్ట్ మేధస్సుతో కలబోసి, పనిచేసి తమ శస్త్రాలను జబ్బుపై ఎక్కుపెట్టారు. బిలియరీ అస్ట్రీషియా అనే ఆ జబ్బుకు చెక్ పెట్టారు. అక్కడ ఓ ఆపరేషన్ థియేటర్లో తండ్రి ఛాతీ నుంచి నాలుగో వంతు కాలేయం తొలగింది. పక్కనే ఉన్న మరో ఆపరేషన్ థియేటర్లోని కొడుకు మేనిలో అది అమరింది. ఒక జీవి తలపైనుంచి మృత్యువు నీడ తొలగి, బతుకు వెలుగులో ప్రసరించింది. నవంబరు 15, 1998న పద్నాలుగు గంటల పాటు జరిగిన ఆ ఆపరేషన్ 18 నెలల వయసులో ఉన్న చిన్నారికి జరిగిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ఆ తర్వాతి ఎన్నో విజయాలకు నాంది అయ్యింది. కాంచీపురంలోని తమ ‘పట్టు’ హస్తినాపురంలోనూ సడలక వడలక నిజవిజయం దక్కినందుకు పరస్పరం భుజం తట్టుకున్నారా డాక్టర్లు. దేశంలో అత్యంత విజయవంతంగా జరిగిన తొలి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ అది. ఇప్పుడు... కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటి ఇంద్రప్రస్థ ఆసుపత్రి హెపటాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబాల్ ఇప్పుడు అపోలో గ్రూపు ఆసుపత్రుల మెడికల్ డెరైక్టర్. అప్పటి సర్జన్ అరవింద్ సింగ్ సోయిన్ ఇప్పుడు గుర్గామ్ లోని లివర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేదాంతా మెడిసిటీ చైర్మన్ అండ్ చీఫ్ సర్జన్. అలాగే అప్పటి శక్తి సంజయ్ కందస్వామి ఇప్పుడు పదకొండో తరగతి చదువుతున్నాడు... ఎట్టిపరిస్థితుల్లో డాక్టర్ అందునా సర్జన్ మాత్రమే కావాలని తలపోసే ఈ విద్యార్థి ఆటల్లో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడుతూ, పెయింటింగ్స్ వేస్తూ, ఫేస్బుక్ చూస్తూ, నోట్‌బుక్స్ రాస్తూ హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతడి ఆశ ఒక్కటే... ఇప్పటికీ ఏటా 2,500 మంది పిల్లలు కాలేయ దాతల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి చావు నీడ నుంచి బయటపడి జీవితాన్ని తానెలా ఆస్వాదిస్తున్నాడో... తానూ ఒక సర్జన్‌గా మారి అలాగే అనేక మందిని మృత్యుముఖం నుంచి తప్పించాలన్నదే అతడి కోరిక. తనలాగే వాళ్లూ తమ జీవితాలను ఆస్వాదించేలా చేయాలన్నది ఈ సంజయుడి అజేయ నిజ సంకల్పం. అది నెరవేరాలనే అందరి ఆకాంక్ష. ఎందరిదో శుభాకాంక్ష.