ఇది ఒక సంజయ నిజవిజయం!
ఆ టీనేజీ పిల్లాడు... ఆ కాలేజీ కుర్రాడు... ఇప్పుడు అందరిలాగే ఫేస్‌బుక్‌ను ఛేజ్ చేస్తుంటాడు. బాల్‌ను టార్గెట్‌గోల్‌లో పడేలా బాస్కెట్‌వీల్ మధ్యకు విసిరేస్తుంటాడు. ఇవ్వాళ్ల అతడు విసిరే బాల్...బాస్కెట్ వీల్ మధ్యకు ఎంత సుతారంగా జారుతుందో... సరిగ్గా 16 ఏళ్ల క్రితం మొత్తం పదహారు మంది (ఇద్దరు సర్జన్లతో పాటు 14 మంది ఆపరేషన్ థియేటర్‌లోని కేర్ గివర్స్) అంతే సుతారంగా ఆపరేషన్ జరిగేలా చూసేందుకు మొత్తం 16 సార్లు ట్రయల్ నిర్వహించారు. ఎందుకంటే ఆ పారామెడికల్ సిబ్బంది ఆపరేషన్ టైమ్‌లో ఎలాంటి తప్పూ చేయకూడదనే ఉద్దేశంతో. సర్జన్లు దక్షత కనబరచారు. లక్ష్యం నెరవేర్చారు. పద్దెనిమిది నెలల పిల్లాడికి చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇప్పుడు పద్దెనిమిదో ఏట ఆ పిల్లాడు ఆ స్ఫూర్తితో ఓ బాల్‌ను బాస్కెట్‌లోకి జారిపోయేంత సుతారంగా మెడికల్ కాలేజీలోకి తన ప్రవేశం జరగాలని పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఈ కుర్రాడి పేరు శక్తి సంజయ్ కందస్వామి. అతడు పద్దెనిమిది నెలల బాలుడిగా ఉన్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. అదీ...
పదహారేళ్ల క్రితం...
ఓ పద్దెనిమిది నెలల చిన్నారి ఒళ్లంతా పచ్చగా మెరిసిపోతోంది. కానీ పచ్చగా మెరిసేదంతా బంగారం కాదు. బంగారం లాంటి ఆ బంగారుతండ్రి ప్రాణాలను ఒడిసి పట్టుకోవాలంటే ఆ పచ్చదనాన్ని తొలగించాలి. అలా చేయాలంటే అతడికి కాలేయ మార్పిడి చేయాలి. అతడు పుట్టిన రెణ్ణెల్ల తర్వాత కాలేయానికీ, పేగుకూ ఉన్న చిన్న కనెక్షన్ తొలగిస్తే పోయే సమస్య కాస్తా... ఆ పని చేయనందుకు పెరిగి పెద్దదైంది. గోటితో పోయేది కాస్తా ప్రాణాలకు చేటు తెచ్చి ‘గాటు’ వరకూ వచ్చింది. ఆ గాటుకు మారో పేరు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అంటే మాటలు కాదు.
ముందుగా జరిగింది కారుణ్య మార్పిడి. అంటే... పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు రోగీ, అతడి తండ్రి పట్ల కారుణ్యం పెంచేలా! ఆ తర్వాత నిపుణులంతా ఒకచోట చేరారు. అనుభవాలు పంచేలా!! ఈ నైపుణ్య మార్పిడీ, ఆ కారుణ్య మార్పిడీ... కలివిడిగా కడు వడిగా సాఫల్యదిశవైపు అడుగిడి నేడా కుర్రాణ్ణి తడబడకుండా అనేక రంగాల్లో ఆసక్తి చూపే ఆదర్శ విద్యార్థిగా నిలబెట్టాయి. అంతేకాదు... తనకు ప్రాణదానం చేసిన డాక్టర్ల నైపుణ్యాన్ని, తాను సాధించే దిశగా స్ఫూర్తిమంతం చేశాయి. పుస్తకాలతో రశ్మిమంతమై తానూ ఆ దిశగా శక్తిమంతం కావడానికి ఇప్పుడు కృతనిశ్చయంతో ఉన్నాడు. దృఢ నిశ్చలంగా చదువుతున్నాడు. అతడలా డాక్టరీయే చదవాలని అనుకోడానికి ఓ కారణం ఉంది.
ఫ్లాష్‌బ్యాక్‌కు ఫ్యాష్‌బ్యాక్
అది కాంచీపురంలోని డాక్టర్ ఎమ్మార్ రాజశేఖర్ ఇల్లు. ఆయన షికాగో యూనివర్సిటీలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా పనిచేసి కాంచీపురానికి వచ్చారు. ఆయనను కలిసిన శక్తి సంజయ్ మేనత్త పద్దెనిమిది నెలల తన మేనల్లుడి దురవస్థను ఆయనకు వివరించారు. కాబట్టే కుర్రాణ్ణి కాపాడాలని పట్టుపట్టారు. ఢిల్లీలో తాను పనిచేసే ఇంద్రప్రస్థ ఆసుపత్రికి పిల్లాణ్ణి తీసుకురమ్మని కోరారు. వెంటనే సంజయ్ తల్లిదండ్రులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ డాక్టర్ రాజశేఖర్‌కు మరో సర్జన్ అరవింద్ సింగ్ సోయిన్ జతగూడారు. హెపటాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబాల్ వాళ్లకు తోడయ్యారు. త్రివిక్రములూ తమ నైపుణ్యాలను రవి అనే షికాగో పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్ట్ మేధస్సుతో కలబోసి, పనిచేసి తమ శస్త్రాలను జబ్బుపై ఎక్కుపెట్టారు.
బిలియరీ అస్ట్రీషియా అనే ఆ జబ్బుకు చెక్ పెట్టారు. అక్కడ ఓ ఆపరేషన్ థియేటర్‌లో తండ్రి ఛాతీ నుంచి నాలుగో వంతు కాలేయం తొలగింది. పక్కనే ఉన్న మరో ఆపరేషన్ థియేటర్‌లోని కొడుకు మేనిలో అది అమరింది. ఒక జీవి తలపైనుంచి మృత్యువు నీడ తొలగి, బతుకు వెలుగులో ప్రసరించింది. నవంబరు 15, 1998న పద్నాలుగు గంటల పాటు జరిగిన ఆ ఆపరేషన్ 18 నెలల వయసులో ఉన్న చిన్నారికి జరిగిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ఆ తర్వాతి ఎన్నో విజయాలకు నాంది అయ్యింది. కాంచీపురంలోని తమ ‘పట్టు’ హస్తినాపురంలోనూ సడలక వడలక నిజవిజయం దక్కినందుకు పరస్పరం భుజం తట్టుకున్నారా డాక్టర్లు. దేశంలో అత్యంత విజయవంతంగా జరిగిన తొలి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ అది.
ఇప్పుడు...
కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటి ఇంద్రప్రస్థ ఆసుపత్రి హెపటాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబాల్ ఇప్పుడు అపోలో గ్రూపు ఆసుపత్రుల మెడికల్ డెరైక్టర్. అప్పటి సర్జన్ అరవింద్ సింగ్ సోయిన్ ఇప్పుడు గుర్‌గామ్ లోని లివర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేదాంతా మెడిసిటీ చైర్మన్ అండ్ చీఫ్ సర్జన్. అలాగే అప్పటి శక్తి సంజయ్ కందస్వామి ఇప్పుడు పదకొండో తరగతి చదువుతున్నాడు... ఎట్టిపరిస్థితుల్లో డాక్టర్ అందునా సర్జన్ మాత్రమే కావాలని తలపోసే ఈ విద్యార్థి ఆటల్లో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడుతూ, పెయింటింగ్స్ వేస్తూ, ఫేస్‌బుక్ చూస్తూ, నోట్‌బుక్స్ రాస్తూ హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
అతడి ఆశ ఒక్కటే... ఇప్పటికీ ఏటా 2,500 మంది పిల్లలు కాలేయ దాతల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి చావు నీడ నుంచి బయటపడి జీవితాన్ని తానెలా ఆస్వాదిస్తున్నాడో... తానూ ఒక సర్జన్‌గా మారి అలాగే అనేక మందిని మృత్యుముఖం నుంచి తప్పించాలన్నదే అతడి కోరిక. తనలాగే వాళ్లూ తమ జీవితాలను ఆస్వాదించేలా చేయాలన్నది ఈ సంజయుడి అజేయ నిజ సంకల్పం. అది నెరవేరాలనే అందరి ఆకాంక్ష. ఎందరిదో శుభాకాంక్ష.