releaved
-
TS: ‘ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు రూ.30 వేల వేతనం’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవైన 698 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు రాష్ట్రంలో ఇంకా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వారికి నెలకు రూ.30 వేల తాత్కాలిక జీతం చెల్లించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. మార్చి 31న ఏపీ ప్రభుత్వం వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఏప్రిల్ 17–19 మధ్యకాలంలో వారు తెలంగాణ రాష్ట్ర ట్రెజరీ కార్యాలయం డైరెక్టర్‌కు జాయినింగ్ రిపోర్టు సమర్పించారు. కోవిడ్–19 వల్ల వారికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేకపోయారు. పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేశాక, ఇప్పుడు తీసుకోనున్న తాత్కాలిక జీతాన్ని అసలు జీతాలతో సర్దుబాటు చేయనున్నారు. చదవండి: అత్యాచార, పోక్సో కేసుల్లో ఖైదీలకు బెయిల్ ఇవ్వకూడదు -
రిలీవ్ కావాలని ఒత్తిడి చేస్తున్నారు..!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పదోన్నతి పొందిన తర్వాత విధుల నుంచి రిలీవ్ అయ్యేందుకు తనకు 15 రోజులు సమయం ఉన్నా తన పోస్టులో నియమితులైన వైద్యుడు, వెంటనే తప్పుకుని ఛార్జి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఈఎస్ఐ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ టి. సరళ సోమవారం మాచవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ కార్యాలయ సిబ్బంది ముందు అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ ఈఎస్ఐ ఆస్పత్రిలో డెప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్)గా ఉన్న డాక్టర్ టి. సరళ గత ఏడాది మే నెల నుంచి విజయవాడలో ఈఎస్ఐ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా డెప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈఎస్ఐలో డెప్యూటీ సివిల్ సర్జన్స్‌కు సివిల్ సర్జన్‌గా పదోన్నతులు ఇచ్చారు. దీంతో ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో డీసీఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ జగదీప్‌గాంధీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది విజయవాడ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో డాక్టర్ టి. సరళకు కూడా పదోన్నతి రావడంలో ఆమెకు విశాఖపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. చార్జి ఇవ్వకుండా కార్యాలయానికి ఎలా వస్తారు కాగా పదోన్నతి పొందిన మరుసటి రోజునే డాక్టర్ జగదీప్‌గాంధీ జాయింట్ డైరెక్టర్‌గా చేరుతూ డైరెక్టరేట్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. కాగా ఆ స్థానంలో ఉన్న డాక్టర్ టి. సరళ తాను రిలీవ్ అయ్యేందుకు పదిహేను రోజుల సమయం ఉండటంతో అప్పటివరకూ అక్కడే కొనసాగాలని భావించారు. అయితే తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఉండటానికి వీల్లేదని వేధిస్తూ, సిబ్బంది ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ మీడియా ఎదుట సరళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చార్జి ఇవ్వకుండా ఎలా తన కార్యాలయానికి వస్తారంటూ ప్రశ్నించారు. తాను డెప్యూటేషన్‌పై ఉన్నందున, జేడీగా డాక్టర్ జయదీప్ చేరినా జీతం విషయంలో ఇబ్బంది ఏమి ఉండదని చెప్పినా వినకుండా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మహిళా వైద్యురాలి నుంచి పిర్యాదు స్వీకరించిన మాచవరం పోలీసులు ప్రాథమిక విచారణ చేయనున్నట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడలేదు: డాక్టర్ జగదీప్ గాంధీ తాను మహిళా వైద్యురాలిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని డాక్టర్ జగదీప్ గాంధీ తెలిపారు. పదోన్నతి వచ్చిన తర్వాత రెగ్యులర్ జాయింట్ డైరెక్టర్‌గా డైరెక్టరేట్ కార్యాలయంలో రిపోర్టు చేశానన్నారు. అనంతరం కార్యాలయానికి రాగా అప్పటి వరకు ఇన్చార్జి జేడీగా ఉన్న డాక్టర్ సరళ తనకు ఛార్జి ఇవ్వనన్నారు. అయినా నేనేమీ అనలేదని చెప్పారు. అనంతరం స్టాప్ మీటింగ్ పెట్టగా ఇద్దరూ ఉంటే మేము ఎవరి ఆదేశాలు పాటించాలని ప్రశ్నించారన్నారు. తాను రెగ్యులర్‌గా ఈ పోస్టులో నియమితులయ్యానని, డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పడంతో సిబ్బంది ఫోన్ చేసి నిర్ధారించుకున్నారన్నారు. అంతేకాని, తాను ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు పాల్పడలేదని వివరించారు. -
బాలల కడుపు మార్చారు...
- పస్తులుంచిన ఐసీపీఎస్ అధికారులు - ఉదయం నుంచి బిస్కట్లతోనే సరి.. మంకమ్మతోట: కార్మికులుగా మారిన వారిని అక్కున చేర్చుకుని సంక్షేమానికి కృషిచేయాల్సిన ఐసీపీఎస్ అధికారులు బాలలను శనివారం పస్తులుంచి పరేషాన్ చేశారు. కార్ఖానాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో బందీలుగా ఉండి పనిచేస్తున్న వారికి విముక్తి కల్గిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న సమగ్ర బాలల సంరక్షణ పథకం ఆధ్వర్యంలో దాడులు ముమ్మరం చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనులు చేస్తూ సంస్థకు కనిపించిన బాలలను తీసుకొస్తున్నారు. వివిధ పనులు చేస్తూ, భిక్షాటన చేస్తూ, వీధుల్లో చెత్తకాగితాలు ఏరుకుంటూ కనిపించిన 480 మంది బాలలను ఈ నెల గుర్తించారు. శనివారం సిరిసిల్ల నుంచి ఆరుగురు బాలబాలికలు, హుజూరాబాద్ 14, పెద్దపల్లి 7, జగిత్యాల 7, కరీంనగర్లో 13మంది బాలకార్మికులుగా గుర్తించి సీడూబ్ల్యూసీ చైర్పర్సన్ కొమురయ్య ఎదుట హాజరుపర్చేందుకు సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ బాలలను ఉదయం 9 గంటలకు గుర్తించి తరలించారు. వీరిని కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి మహిళా పోలీసు కానిస్టేబుల్‌ను సెక్యూరిటీగా ఉంచారు. ఉదయం నుంచి టీ, టిఫిన్, భోజనం వంటివి ఏమీ పెట్టకుండా బిస్కట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కడుపులో తిప్పినట్లు అయి బెంచీలపై పడుకున్నారు. తమ పిల్లలను అధికారులు తీసుకువెళ్లారనే సమాచారం తెలుసుకుని శాఖ కార్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులు ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నట్లు బాధితులు తెలిపారు. ఒక పూట బడి కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. చుట్టపు చూపుగా నేపాల్ నుంచి వచ్చిన అబ్బాయి సునీల్(12)ను వీధిలో కనిపించగానే తీసుకువ చ్చారని, మధ్యాహ్నం భోజనం సమయంలో తీసుకువచ్చి ఇప్పటివరకు ఆహారం ఏమీ ఇవ్వలేదని కమల అనే మహిళా ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చిన అధికారులు రెండుసార్లు బిస్కట్లు మాత్రమే ఇచ్చారని ఆరెపల్లికి చెందిన బాలిక రష్మి(13), సుగ్లాంపల్లికి చెందిన అనిల్(11), వేములవాడకు చెందిన దుర్గేష్ తెలిపారు. ఈ విషయంపై సీడబ్ల్యూసీ చైర్పర్సన్ కొమురయ్య, ఐసీపీఎస్ జిల్లా కోఆర్డినేటర్ పర్వీన్‌ను వివరణ కోరగా.. బిస్కట్లు, మంచినీరు ఇచ్చామని, టిఫిన్, భోజనం వంటివి పెట్టలేదని తెలిపారు. పిల్లలకు ఆహారం అందించేంత బిల్లు తమ వద్ద లేదని పేర్కొన్నారు.