కర్ఫ్యూ ఎత్తివేతకు మరింత సమయం: ఐజీ తిరుమలరావు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పట్టణంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో కర్ఫ్యూ ఎత్తివేతకు మరింత సమయం పడుతుందని ఆంధ్రా రీజియన్ ఐజీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. సడలింపు సమయంలో కూడా 144వ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పట్టణంలో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండడం వల్లే సడలింపు సమయం పెంచుతున్నట్టు చెప్పారు. డీఐజీ ఉమాపతి, ఎస్పీ కార్తికేయతో కలిసి పట్టణంలో శుక్రవారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతోనే కర్ఫ్యూ విధించామన్నారు. ప్రజలు సహకరిస్తే కొద్ది రోజుల్లోనే కర్ఫ్యూ ఎత్తేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రిపూట యధావిధిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. అరెస్ట్ ల విషయంలో ఆధారాలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అల్లర్లను ముందస్తుగా అంచనా వేయడంలో, విధ్వంసాలను అడ్డుకోవడంలో విఫలం కావడంతోనే ముగ్గురు సీఐలపై వేటు పడిందన్నారు. ఇప్పటి వరకు ఆస్తుల ధ్వంసానికి సంబంధించి 11 కేసులు, లూటీకి సంబంధించి రెండు కేసుల్లో 168 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరో 47 పెద్ద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మరికొన్ని చిన్న కేసులు కూడా నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
కేంద్ర బలగాల కవాతు... పట్టణంలోని పురవీధుల్లో కేంద్ర బలగాలు శుక్రవారం కవాతు నిర్వహించాయి. శాంతి ర్యాలీ పేరిట ఈ బృందాలు తమ ఆయుధాలతో కలియతిరిగాయి. పట్టణంలో పోలీసు చర్యలు ఉన్నాయని వివరించేందుకు వజ్రా వాహనం ముందు పెట్టి కర్ఫ్యూ గురించి వివరించడంతో పాటు ఆ వెనుక కేంద్ర బలగాలు సాగాయి. మూడు లాంతర్ల జంక్షన్లో ప్రారంభమైన ర్యాలీ అంబటి సత్రం, పల్లెవీధి, కొత్తపేట, రింగ్ రోడ్డు మీదుగా దాసన్నపేట రైతు బజారు మీదుగా కోట జంక్షన్‌కు చేరింది. మరో బృందం గంట స్తంభం మీదుగా కన్యకాపరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాల్లో కలియ తిరిగాయి.