illegal bills
-
'సర్వశిక్షా అభియాన్' అంతా కనికట్టు
స్వరశిక్షా అభియాన్.. అదో మాయా ప్రపంచం. ఇక్కడ అంతా ఇంద్రజాలికులే. స్కూల్ అదనపు తరగతి గదులు ఉండవు. కానీ రికార్డుల్లో పక్కా కట్టడాలు నిర్మించినట్టు ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగం పనులు నిర్వహించరు. కానీ అన్ని పూర్తయినట్లు రికార్డుల్లో ఉంటాయి. పూర్తి చేసిన ప్రతి పనికి ఉండాల్సిన ఎంబుక్‌లు ఒక్కటీ కనిపించవు. ఇదంతా చదువులు చెప్పే సర్వశిక్షా అభియాన్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి బాగోతం. అవినీతి పరాకాష్టకు చేరడంతో సీఎంఓకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు ఆదేశించారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్‌ను విచారణకు జిల్లాకు రానున్నారు. సర్వశిక్షా అభియాన్‌లో అలజడి రేగింది. సుమారు రూ.3 కోట్ల మేర భారీగా స్వాహా చేసినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్‌లో చేపట్టే పనులకు లెక్కా పత్రం సక్రమంగా ఉండవు. అక్కడ కొందరు సిబ్బంది అందిన మేర దండుకోవటానికి అలవాటు çపడ్డారు. గతంలో ఏసీబీ కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా యథావిధిగా కొనసాగిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 2012 నుంచి 2015 వరకు సుమారు రూ.10 కోట్లకు పైగా విలువైన పనులు సర్వశిక్షా అభియాన్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించింది. ముఖ్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు నిర్వహించారు. అయితే ఇందులో ముఖ్యంగా అదనపు తరగతి గదుల నిర్మాణంలో రూ.1.42 కోట్ల మేర స్వాహాకు గురైనట్లు సమాచారం. 2012–13 వార్షిక సంవత్సరంలో రూ.62.20 లక్షలు, 2013–14లో రూ.11.87 లక్షలు, 2014–15లో రూ.68.17 లక్షలు మొత్తం రూ.1.42 కోట్లు అదనపు తరగతి గదులు నిర్మించకుండా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు చేసే ప్రతి పనిని ఎంబుక్ నమోదు తప్పనిసరి. కానీ ఇక్కడ అసలు ఎంబుక్ కూడా లేని పరిస్థితి. దీనిపై గతంలో కలెక్టర్ విచారణకు ఆదేశించి నివేదిక పంపమని కోరినా అధికారులు నేటికీ పంపలేదు. జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 456 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.59 కోట్లు ని«ధులు మంజూరయ్యాయి. వీటిలో 70 శాతం అంటే రూ.79.80 లక్షలు మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా మిగిలిన 30 శాతం మెత్తం రూ. 23.94 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ ఆఫీసర్ పేరుతో కెనరా బ్యాంక్‌లో ఉన్న ఖాతాకు జమ చేశారు. అక్కడి నుంచి ఇందులో రూ.79.80 లక్షల మొత్తం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గూడూరు, కావలితో పాటు ఇతరుల ఖాతాలకు జమ చేశారు. ఈ మొత్తంతో చేసిన పనులకు సంబంధించిన ఎంబుక్ నమోదు కానీ, వర్క్ ఆర్డర్ కానీ, జేటీఓ వెరిఫికేషన్ కానీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పాసింగ్ ఆర్డర్ కానీ ఏమీ లేకుండా రూ. 40 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సివిల్ పనులకు సంబంధించి మొత్తం రూ.4.58 కోట్లు నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మొత్తం నిధులు మంజూరు ఇందులో రూ.4.05 కోట్లు విలువైన పనులు మాత్రమే చేశారు. మిగిలిన రూ. 53 లక్షలు పనులు చేయకుండా స్వాహాకు రంగం సిద్ధం చేశారు. అయితే దీనిపై దూమారం రేగడంతో ఆ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. ఇక నిర్మాణాల నాణ్యత పరిశీలించల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను ప్రెవేట్ ఏజెన్సీకి అప్పగించి వారికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఇలా ప్రతి పనిలో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. వీటిపై కార్యాలయంలో సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొందరు సీఎంను కలిసి దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంఓ విచారణకు ఆదేశించింది. సోమవారం సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ నెల్లూరులో పర్యటించి కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. -
వైద్యశాలలా, వధ్యశాలలా?
ఆస్పత్రి దుకాణాల బిల్లులో కల్లబొల్లి అంకెలను శిక్షించే సరైన చట్టాలు ఇంకా రాలేదు. రోగులు 1,737 శాతం ఎక్కువ ధర ఎందుకు చెల్లించాలి? ఆస్పత్రి వారు ఆ డబ్బు తిరిగి ఇస్తే సమస్య తీరుతుందా? ఎందరు రోగులు విపరీత బిల్లుల దెబ్బ తిన్నారో పరిశోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన లేదా? ఏడేళ్ల ఆద్య డెంగ్యూ వ్యాధి సోకి గుర్గావ్లో అత్యాధునిక వైద్యశాల పాలయింది. చికిత్స నరకప్రాయం. మెదడు ఆగిపోయింది. చనిపోయిందో లేదో చెప్పరు. బతుకు మీద ఆశలు కనబడవు. ఆస్పత్రినుంచి తమను వెళ్లిపోనీయాలని కోరారు. ‘‘పోతే పోండి కాని ‘డాక్టర్లు వద్దన్నా మేమే వినకుండా వెళ్లాం’ అని రాసి సంతకం చేయండి’’ అన్నారు యజమానులు. తీసుకుపోవడానికి అంబులెన్స్ ఇవ్వమంటే ఇవ్వమన్నారు. వెంటిలేటర్ తీయడం కుదరదన్నారు. ప్రయివేటు అంబులెన్స్ తెచ్చుకుంటే అందులో చేర్చిన తరువాత వెంటిలేటర్ తొలగిస్తామన్నారు. ఆవిధంగా తొలగించగానే ఆ అమ్మాయి చని పోయింది. కాని ఆ మరణ ధృవీకరణ ఇవ్వం పొమ్మన్నారు. కేవలం మరణ పత్రంకోసం మరో వైద్యశాలకు వెళ్లక తప్పలేదు. అదొక నరకం. తీరా వెళ్లిపోతుంటే ఆగండాగండి... ఆ పాప వేసుకున్న గౌను మాది. దాని ధర చెల్లించండి అన్నారు. శరీరం ఉబ్బిపోవడం వల్ల సొంత గౌను పట్టక హాస్పటల్ వారి గౌను తీసుకొనక తప్పలేదు. అది విప్పడం కుదరదు కనుక అడిగినంత డబ్బు ఇవ్వక తప్పలేదు. నిశ్శబ్దంగా పాప మరణిస్తూ ఉంటే వారి కుటుంబం రోదిస్తూ ఉంటే, యాజమాన్యం బిల్లులు రచించింది. అవి గుండె గుభిల్లు బిల్లులు. వైద్యశాల వారు వాడినట్టు చెప్పుకునే వస్తువుల వివరాలు ఇవి. మొత్తం 661 సిరంజిలు 1,546 జతల గ్లౌజులు వాడారట. అంటే ఆస్పత్రిలో ఉన్న ప్రతిగంటలో రెండు మూడు ఇంజక్షన్లు ఇచ్చారట. అయిదు జతల గ్లౌజులు మార్చారట. మందులపై 108 శాతం, చికిత్సలో వినియోగించిన ఒక్కో వస్తువుకు 1,737 శాతం ఎక్కువ ధరలు వేశారని పరిశోధనలో తేలింది. చట్టప్రకారం గరిష్టధరకన్న బిల్లు మించరాదు. ఇది కాక మరో 3 లక్షలు కూడా ఇవ్వాలన్నారు. ఎందుకో చెప్పరు. ఆద్యవలె మరో ఏడేళ్ల బాలుడు సూర్యప్రతాప్‌ను కూడా చనిపోయిన తరువాత, తల్లిదండ్రులచేతికి ఇటువంటి భారీ బిల్లు ఇచ్చారు. రు. 15.88 లక్షల రూపాయలు చెల్లించక తప్పలేదు. చికిత్సకు, వస్తువులు వాడారనడానికి రుజువులు రికార్డులు లేవు. అసలు ధర ఎంత, వేసిందెంత ఎందుకు అనే వివరాలు రాయలేదు, చెప్పలేదు. వీరి రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) జలగ వలె నెత్తురిచ్చినట్టే ఇచ్చి బిల్లురూపంలో తాగేస్తుంది. అర్ధరాత్రి ఇనుపకడ్డీలతో బాదే బందిపోట్లు గునపపు పోట్లు ఇస్తే వీరి బిల్లులు గుండె పోట్లు ఇస్తాయి. డిసెంబర్ 2017న ఫోర్టిస్ మెమోరియల్ రీసర్చ్ సంస్థ వారి రక్తనిధి లైసెన్సును వారం పాటు సస్సెండు చేశారు. మేదాంత ఆస్పత్రి వారి ఫార్మసీ లైసెన్స్‌ను ఏప్రిల్ 5, 2018న ఏడు రోజులు సస్సెండు చేశారు. ఈ వార్త వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీఐ వైద్య రంగంపై సీఐసీ ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడం తప్ప మరే చర్య కనిపించదు. దున్నపోతు మీద దోమ వాలడం ఓ శిక్షా? చికిత్స పేరుతో కొనసాగే హింసను ఈ చట్టం అరికట్టగలదా? హాస్పిటళ్లను వైద్యశాఖ నియంత్రించగలదా? ఆస్పత్రి దుకాణాల బిల్లులో కల్లబొల్లి అంకెలను శిక్షించే సరైన చట్టాలు ఇంకా రాలేదు. రోగులు 1,737 శాతం ఎక్కువ ధర ఎందుకు చెల్లించాలి? ఆస్పత్రి వారు ఆ డబ్బు తిరిగి ఇస్తే సమస్య తీరుతుందా? ఎందరు రోగులు విపరీత బిల్లుల దెబ్బ తిన్నారో పరిశోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన లేదా? అందరికీ డబ్బు వాపస్ ఇప్పించలేరా? వీరిపై సర్కారు చర్యలు తీసుకోకపోతే బాధితులకు కోర్టుకు పోవడం ఒక్కటే మార్గం. కింది కోర్టుతో మొదలై సుప్రీంకోర్టుదాకా అనేకసార్లు వెళ్లగల సంపన్న దవాఖాన వ్యాపారసంస్థలతో సామాన్యుడు సరితూగడం సాధ్యం కాదు. ఎవరైనా విమర్శిస్తే కోట్లరూపాయల పరువు నష్టం దావాలు వేస్తారు. క్రిమినల్ కేసులు కూడా వేస్తాయి. ఈ తెల్ల కోట్లు నల్లకోట్ల రక్షణతో కోర్టు కేసులు నడిపితే రక్షించుకునే స్తోమత రోగులకు, విమర్శకులకు ఉంటుందా? ‘‘వారితో పోరాడడం మాకు సాధ్యం కాదు. మేం చెల్లించిన డబ్బు 15.88 లక్షల రూపాయలు మాకు తిరిగి ఇస్తామంటే రాజీ పడ్డాం. మాకు మరో కూతురు ఉంది. మా కుటుంబం బతకాలి. పెద్ద అమ్మాయి చికిత్సకు చేసిన అప్పులు ఇంకా తీరలేదు, చిన్న అమ్మాయిని చదివించడానికి బోలెడంత డబ్బుకావాలి. కోర్టు ఖర్చులు భరిస్తూ పది పదిహేనేళ్లు ఎదురు చూడడం కష్టం. కనుక వారిచ్చిన డబ్బు తీసుకున్నాం’’ అని లాభార్జనా దురాశకు బలైన పిల్లల తల్లిదండ్రులు విలేకరులకు వివరించారు. వ్యాపార పక్షపాత ప్రభుత్వ అవినీతి మీద, సరైన చట్టం చేయలేని శాసనవ్యవస్థ బలహీనతమీద, విపరీత విలంబ న్యాయప్రహసనం మీద ఈమాటలు విస్ఫులింగాలు. రాజ్యాంగం మూడు వ్యవస్థలకున్న ఏలికల బలాబలాలపైన సునిశిత విమర్శనాస్త్రాలు. చట్టవ్యతిరేక ఔషధ బిల్లులు వేసి, అధిక ధరకు రక్తం అమ్మిన నేరాలకు శిక్షలు జరిమానాలు విధించే చట్టాలు ఎందుకు చేయరు? నరుల ఆరోగ్యాన్ని సంపదను హరించే వీటినుంచి సామాన్యులను రక్షించేదెవరు? చట్టాలు బలవంతులపై బలంగా, బలహీనులపై ఉదారంగా ఉండాలన్నది న్యాయసూత్రం. కానీ బలవంతుల ముందు అసమర్థంగా, బలహీనులపైన క్రూరంగా చట్టం ఉంటుందా? క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టానికి క్షయరోగం ఉందా? ఈ ఆస్పత్రుల చట్టానికి రాచపుండును కోసే శస్త్ర చికిత్స అవసరమేమో పరిశీలించాలి. ప్రభుత్వం ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతే కారణాలేమిటో తెలపాలి. ఆద్య, సూర్యప్రతాప్ వంటి బాధితుల్ని ఎవరు ఆదుకుంటారు? ఈ చట్టంలో రోగులకు చికిత్స పత్రాలు వివరంగా ఎప్పటికప్పుడు ఇవ్వాలనే స్పష్టమైన నిబంధన గానీ, ఇవ్వకపోతే హాస్పటళ్లపైన ఎవరు ఏ చర్యలు ఎప్పుడు తీసుకుంటారో తెలిపే నియమాలు కానీ లేవు. కనీస ప్రమాణాలు పాటించాలంటారు. అన్ని అంశాలు అందులోనే ఉన్నాయని, ప్రత్యేకంగా మరే నియమం అవసరం లేదనీ అంటారు. ఒక అస్పష్ట నియమం కింద బలహీనమైన వాక్యాల రూపంలో ఈ నీతి వాక్యాలు ఉంటే అమలు చేయడం సాధ్యమా? ఎప్పటికప్పుడు రోగులకు చికిత్స వివరాలు ధృవీకరించిన పత్రాల రూపంలో ఇవ్వాలని లేదా జరిమానాలు శిక్షలు ఉంటాయని కఠినమైన రోగి రక్షణ చట్టాలు ఎందుకు చేయడం లేదు? పాటించని సలహాలతో కూడిన చట్టాలు పనిచేస్తాయా? (ఏప్రిల్ 7, 2018న కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేసిన సెమినార్లో రచయిత సమర్పించిన పత్రంలో ఒక భాగం). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
ఇష్టారాజ్యం
ఎస్ఈ సంతకం లేకుండానే రూ.2 కోట్ల బిల్లు అనంతపురం న్యూసిటీ : పాలకవర్గం అండదండలతో నగరపాలక సంస్థ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి పనులు చేసేస్తున్నారు. ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులకు సంబంధించి 20 మీటర్ల పైపులకు రూ 2.15 కోట్లు బిల్‌ను ఎస్ఈ సంతకం లేకుండానే చేయడం గర్హనీయం. ఆగమేఘాలపై బిల్ చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఏపీఎండీపీ) నుంచి రూ. 191 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో మొదటి ఫేజ్ కింద రూ. 137 కోట్లతో పైప్‌లైన్ ఏర్పాటు పనులకు ఏపీఎండీపీ టెండర్లకు పిలిచింది. అందుకు సంబంధించి రూ 7.50 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌ను ద ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ కీలక అధికారి ఈ మొత్తాన్ని పంచుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. రెండ్రోజుల క్రితం 20 మీటర్ల పైపులకు రూ 2.15 కోట్లు బిల్ చేశారు. ఎస్ఈ సంతకమేదీ..? నగరపాలక సంస్థ ఏ అభివృద్ధి పనులు జరిగినా ఎస్ఈ, సంబంధిత డీఈ సంతకం తప్పనిసరి. కానీ వారి సంతకాలు లేకుండానే ఈఈ రామ్మోహన్ రెడ్డి బిల్ డ్రా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు కమిషనర్ చల్లా ఓబులేసు సైతం సంతకం చేశారు. రూ కోట్ల వ్యవహారంలో ఎందుకు అధికారులు ఇంత ఆత్రుత చూపించారో అర్థం కావడం లేదు. వాస్తవంగా ఎస్ఈ, డీఈ సంతకం లేకుంటే ఇంజనీరింగ్ చీఫ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండానే బిల్ డ్రా చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈఅండ్‌సీ అనుమతులు తీసుకోకుండా బిల్ డ్రా చేయడం దుమారం రేపుతోంది. ఎస్ఈ సురేంద్రబాబు పుష్కరాల విధులకు వెళ్లారు. ఆయన లేని సమయంలో బిల్ చేశారు. ఇటీవల జరిగిన అభివృద్ధి పనుల్లో కొందరు అధికారులు వ్యవహరించిన తీరును ఎస్ఈ తప్పుబట్టారు. దీంతో ఆయన్ను పుష్కర విధులకు పంపినట్లు తెల్సింది. జీఓ ప్రకారమే చేశా : – రామ్మోహన్‌రెడ్డి (ఇన్చార్జ్ కమిషనర్, ఈఈ) ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులకు సంబంధించి రూ 2.15 కోట్ల బిల్ డ్రా చేసిన మాట వాస్తవమే. జీఓ 654/2012 ప్రకారం ఈఈ సంతకంతోనే డ్రా చేయవచ్చు. ఎస్ఈ అందుబాటులో లేనందు వల్ల బిల్ చేశాం. అయినా ఏం ఫర్వాలేదు.