ఇష్టారాజ్యం
ఎస్‌ఈ సంతకం లేకుండానే రూ.2 కోట్ల బిల్లు
అనంతపురం న్యూసిటీ : పాలకవర్గం అండదండలతో నగరపాలక సంస్థ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి పనులు చేసేస్తున్నారు. ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులకు సంబంధించి 20 మీటర్ల పైపులకు రూ 2.15 కోట్లు బిల్‌ను ఎస్‌ఈ సంతకం లేకుండానే చేయడం గర్హనీయం. ఆగమేఘాలపై బిల్ చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఏపీఎండీపీ) నుంచి రూ. 191 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే.
గత ఏడాది నవంబర్‌లో మొదటి ఫేజ్ కింద రూ. 137 కోట్లతో పైప్‌లైన్ ఏర్పాటు పనులకు ఏపీఎండీపీ టెండర్లకు పిలిచింది. అందుకు సంబంధించి రూ 7.50 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌ను ద ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ కీలక అధికారి ఈ మొత్తాన్ని పంచుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. రెండ్రోజుల క్రితం 20 మీటర్ల పైపులకు రూ 2.15 కోట్లు బిల్ చేశారు.
ఎస్‌ఈ సంతకమేదీ..?
నగరపాలక సంస్థ ఏ అభివృద్ధి పనులు జరిగినా ఎస్‌ఈ, సంబంధిత డీఈ సంతకం తప్పనిసరి. కానీ వారి సంతకాలు లేకుండానే ఈఈ రామ్మోహన్ రెడ్డి బిల్ డ్రా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు కమిషనర్ చల్లా ఓబులేసు సైతం సంతకం చేశారు. రూ కోట్ల వ్యవహారంలో ఎందుకు అధికారులు ఇంత ఆత్రుత చూపించారో అర్థం కావడం లేదు. వాస్తవంగా ఎస్‌ఈ, డీఈ సంతకం లేకుంటే ఇంజనీరింగ్ చీఫ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండానే బిల్ డ్రా చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈఅండ్‌సీ అనుమతులు తీసుకోకుండా బిల్ డ్రా చేయడం దుమారం రేపుతోంది. ఎస్‌ఈ సురేంద్రబాబు పుష్కరాల విధులకు వెళ్లారు. ఆయన లేని సమయంలో బిల్ చేశారు. ఇటీవల జరిగిన అభివృద్ధి పనుల్లో కొందరు అధికారులు వ్యవహరించిన తీరును ఎస్‌ఈ తప్పుబట్టారు. దీంతో ఆయన్ను పుష్కర విధులకు పంపినట్లు తెల్సింది.
జీఓ ప్రకారమే చేశా : – రామ్మోహన్‌రెడ్డి (ఇన్‌చార్జ్ కమిషనర్, ఈఈ)
ఏపీఎండీపీ పైప్‌లైన్ పనులకు సంబంధించి రూ 2.15 కోట్ల బిల్ డ్రా చేసిన మాట వాస్తవమే. జీఓ 654/2012 ప్రకారం ఈఈ సంతకంతోనే డ్రా చేయవచ్చు. ఎస్‌ఈ అందుబాటులో లేనందు వల్ల బిల్ చేశాం. అయినా ఏం ఫర్వాలేదు.