బది‘లీలలు’ | transfer drama in muncipal corporation | Sakshi
Sakshi News home page

బది‘లీలలు’

Published Thu, Feb 9 2017 10:55 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

బది‘లీలలు’ - Sakshi

బది‘లీలలు’

– బదిలీల్లో అధికారుల చేతివాటం
– పరోక్షంగా ప్రోత్సహిస్తున్న పాలకులు
–  వేధింపులు భరించలేక కార్మికురాలి ఆత్మహత్యాయత్నం


అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థలో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి పాలకవర్గంలోని కొందరు నేతలు, అధికారుల తీరుతో రోజుకో అడ్డుగోలు బాగోతం వెలుగు చూస్తోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే నగరపాలక సంస్థలో బది‘లీలలు’ వ్యవహారం. బదిలీపై వెళ్లే ఉద్యోగులు, ప్రజారోగ్యధికారులకు ముడుపులు సమర్పించుకోవాల్సిందే. లేనిపక్షంలో వారు వెళ్లే ప్రాంతాలను మార్చడం, లేకపోతే వారే రావాలనే ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఈ నెల 8న నగరపాలక సంస్థలోని విధులు నిర్వర్తించే రేవతి అనే పారిశుద్ధ్య కార్మికురాలు శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అధికారుల అడ్డగోలు వ్యవహారాలకు అద్దం పడుతోంది. రేవతిలా ఇబ్బంది పడే కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కలెక్టర్‌ కోన శశిధర్‌ స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదని నగరపాలక వర్గాలంటున్నాయి.

శానిటరీ ఇన్‌స్పెక్టర్ల చేతివాటం
నగరపాలక సంస్థలో 209 మంది రెగ్యులర్‌ కార్మికులు, కాంట్రాక్టు పద్ధతిన ప్రజారోగ్య విభాగంలో 409, ఇంజనీరింగ్‌ విభాగంలో 309 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి స్థానంలో మరొకరు పని చేయడానికి వీల్లేదు. ఇక్కడ మాత్రం మానవతా దృక్పథం అన్న కారణం చూపి అనారోగ్యంతో ఉన్న ఉద్యోగి స్థానంలో వారింట్లో ఎవరో ఒకరు వచ్చి పని చేసేలా అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నెలసరి మామూళ్లు మాట్లాడుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.  

రేవతి ఏమన్నారంటే.. సార్‌ మా నాన్న చనిపోతే కార్మికురాలిగా ఉద్యోగంలో చేరాను. మొదట్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రకు రూ.20 వేలు ఇచ్చా. నా భర్త చిన్నపాటి పనులు చేసుకుంటున్నాడు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు పని చేసేందుకు బదిలీ వర్కర్‌గా లక్ష్మీదేవిని ఉంచాను. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర బదిలీ వర్కర్‌ను రావద్దని తరచూ చెబుతున్నారు. ఈ నెల 26న సస్పెండ్‌ చేశానని ఏమైనా ఉంటే కమిషనర్‌తో మాట్లాడుకోమని చెప్పారు. నాకు ఏమైనా జరిగితే నా పిల్లలు సాయినిఖిల్, సాయిఅఖిల్‌ అనాథలవుతారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర ఏమన్నారంటే.. రేవతి గత మూడేళ్లుగా బదిలీ వర్కర్‌ను పెట్టుకుని విధులకు రావడం లేదు. ఆ వర్కర్‌కు రూ.4500 ఇచ్చి పని చేయించుకుంటోంది. గత నెలలో నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాలకులు బదిలీలు ఆపాలని చెప్పారు. బదిలీలు వద్దని రెగ్యులర్‌ ఉద్యోగురావాలని ఆదేశాలు జారీ చేశా. అప్పటి నుంచి ఆమె మస్టర్‌కు రాలేదు. ఇక ఆమె నుంచి డబ్బులు డిమాండ్‌ చేశాననడంతో వాస్తవం లేదు. దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement