ఆగని దందా | corrption in muncipal corporation | Sakshi
Sakshi News home page

ఆగని దందా

Published Fri, Jan 20 2017 12:08 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

ఆగని దందా - Sakshi

ఆగని దందా

- అనంత కార్పొరేషన్‌లో అడ్డగోలు వ్యవహారం
– కమిషనర్‌లు మారినా ఆగని అవినీతి
– అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారుల తప్పటడుగులు
– రూ.72 కోట్ల పనుల్లో 50 శాతం మేర దొంగ బిల్లులు?
– ససాక్ష్యాలతో పత్రికల్లో కథనాలు వస్తున్నా పట్టించుకోని విజిలెన్స్, జిల్లా యంత్రాంగం
– కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారిని నియమిస్తేనే నియంత్రణ!


ఇంతకుముందు..
- అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలోని 32వ డివిజన్‌లో రూ.9 లక్షలతో సిమెంట్‌ రోడ్డుకు టెండర్‌ పిలిచారు. టెండర్‌ ఖరారు కాకముందే ఓ కాంట్రాక్టర్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో బిల్లులు ఆపేశారు.
- 36వ డివిజన్‌లో దాదాపు రూ.33 లక్షలతో ప్రహరీకి టెండర్‌ పిలిచారు. ఖరారు కాకముందే కాంట్రాక్టర్‌ గోడ కట్టేశారు. దీనిపై ‘సాక్షి’లో వార్తలొచ్చినా అధికారులు బిల్లులు చేసేందుకు సిద్ధమయ్యారు.
-  41వ డివిజన్‌లో రూ.6 లక్షలతో గ్రావెల్‌రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు.  టెండర్ల గడువు ఉండగానే ఓ కాంట్రాక్టర్‌ పనులకు ఉపక్రమించారు.
- ఇవీ చల్లా ఓబులేసు కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు.
––––––––––––––––––––––––––––––––––––––––
ఇప్పుడు..
- శ్రీనగర్‌ కాలనీ పార్కు వద్ద 2015లో నితిన్‌సాయి కన్‌స్ట్రక‌్షన్స్‌ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ టెండర్‌లోనే రోడ్డు నిర్మాణం తర్వాత రోడ్డు పక్కలో గ్రావెల్‌ వేశారు. ఇప్పుడు తిరిగి అదే గ్రావెల్‌పై మరోసారి వేసి రూ.4.49 లక్షలు బిల్లుపెట్టారు. అంతటితో ఆగకుండా అదే పనికి మరో బిల్లు రూ.4.50 లక్షలు పెట్టి మొత్తం రూ.9లక్షలు ఆరగించారు.
- గుత్తిరోడ్డు, బెంగళూరు రోడ్డుతో పాటు చాలా చోట్ల రోడ్డుపక్కలో మట్టిని చదును చేసినట్లు చూపి చేయని పనులకు కూడా రూ.లక్షల బిల్లులు పెట్టారు.
        – ఇవీ ప్రస్తుత కమిషనర్‌ సురేంద్రబాబు హయాంలో సాగుతున్న లీలలు.

(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
        అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్లు మారుతున్నా పాలనాశైలి, ఆలోచనా దృక్పథం మాత్రం మారడం లేదు. వీరిపై ఇద్దరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణమనేది బహిరంగ రహస్యం. పాలకవర్గం ఏర్పడిన రెండున్నరేళ్లలో రూ.72 కోట్ల పనులు చేసినట్లు లెక్కల చిట్టా చూపుతున్న పాలకవర్గం.. అందులో 50 శాతం పనులు కూడా క్షేత్రస్థాయిలో చేయలేకపోయింది. నగర పాలన ఎలా సాగుతోందో దీన్నిబట్టే తెలుస్తోంది. అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలపై పత్రికల్లో ససాక్ష్యాలతో కథనాలు వస్తున్నా విజిలెన్స్‌ అధికారులు గానీ, జిల్లా యంత్రాంగం గానీ దృష్టి పెట్టడం లేదు. బాధ్యత తీసుకోవాల్సిన మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు కూడా కార్పొరేషన్‌ వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పాలకవర్గం ‘ఆడిందే ఆట...పాడిందే పాట’ అన్నట్లు పరిస్థితి తయారైంది.

‘కలసికట్టు’గా దూకుడు పెంచారు!
    పాలకవర్గం ఏర్పడిన కొత్తలో మేయర్‌ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య విభేదాలు పొడచూపాయి. అప్పట్లో కార్పొరేషన్‌ పనులకు ఎమ్మెల్యే అడ్డుచెప్పడం, ఎమ్మెల్యే సిఫార్సులను మేయర్‌ తిరస్కరించడం జరిగేది! అప్పటి కమిషనర్‌ నాగవేణి కూడా ఉన్నంతలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వర్తించారు. ఆపై మేయర్, ఎమ్మెల్యే రాజీ పడ్డారు. వీరి ఒత్తిళ్లు తలొగ్గలేక నాగవేణి బదిలీపై వెళ్లిపోయారు. తర్వాత aచల్లా ఓబులేసును కమిషనర్‌గా తెచ్చుకున్నారు. బాధ్యతలు తీసుకున్న కొత్తలో ఓబులేసు మాటలు, హడావుడి చూసి కార్పొరేషన్‌ కాస్తయినా గాడిన పడుతుందని అంతా భావించారు. కాలక్రమేణా ఆయన టెండర్లతో పనిలేకుండా, వాస్తవాలతో సంబంధం లేకుండా  బిల్లులు చేశారు. ఆయన హయాంలో రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలున్నాయి. అప్పట్లో వీటిపై కథనాలొచ్చాయి. అయినప్పటికీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోలేదు. అక్రమాలపై కొందరు కార్పొరేటర్లు ఓ ప్రజాప్రతినిధిని నిలదీసి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామంటే.. ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. విజిలెన్స్‌లోని కీలక అధికారి నాకు బంధువే!’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా విజిలెన్స్‌ కూడా కార్పొరేషన్‌ అవకతవకలపై దృష్టి పెట్టలేదు.  చివరకు ప్రజలకు అత్యవసరమైన శానిటేషన్, మంచినీరు లాంటి అత్యవసర సేవలను విస్మరించినా ఎవరూ పట్టించుకోలేదు. పారిశుద్ధ్యం దెబ్బతిని ఇద్దరు పిల్లలు డెంగీతో చనిపోయారు. ఈ క్రమంలో ఓబులేసు ‘అనంత’ నుంచి వెళ్లిపోయారు.

సురేంద్రబాబు కూడా ..
    ఈఈగా ఉన్న సురేంద్రబాబు ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా.. ఇప్పుడు కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ)గా ఉన్నారు. మొదట్లో ఈయన కూడా శాఖాపరమైన  పనులు, బాక్స్‌టెండర్లపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆచరణలో మాత్రం చేతులెత్తేశారు. ఈయనే ఈఈ కావడంతో పనులను టెక్నికల్‌గానూ మంజూరు చేయాలి. చేయని పనులు చేసినట్లుగా చూపడంతో పాటు ఒకే పనికి రెండు బిల్లులు పెడుతున్నా మంజూరు చేస్తున్నారు. ఇందుకు కారణం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే అని ఏకంగా విలేకరుల సమావేశంలోనే వెల్లడించారంటే ‘అధికార పార్టీ దోపిడీ’ ఏస్థాయిలో నడుస్తోందో, అధికారులపై ఎలా స్వారీ చేస్తున్నారో అర్థమవుతోంది. అధికారపార్టీ కార్పొరేటర్లు కూడా అందినంత దండుకోవడమే లక్ష్యంగా దొంగ బిల్లులు తీసుకెళ్లి అధికారుల ముందు ఉంచుతున్నారు. పాస్‌ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ చర్యలతో కొందరు అధికారులు ఇబ్బంది పడుతుంటే.. ఇంకొందరు ఈ ముసుగులో వీలైనంత పుచ్చుకుని పనికానిచ్చేస్తున్నారు.  పాలకవర్గం, విజిలెన్స్, జిల్లా యంత్రాంగం పనితీరుపై ఇటు ప్రతిపక్షాలతో పాటు నగర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాలకవర్గం వ్యవహారశైలి చూస్తుంటే  అప్పులో ఊబిలోకి దించి దివాళా తీయించే ప్రమాదముందని, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గని ఓ ఐఏఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమిస్తే మినహా దీనికి అడ్డుకట్ట పడదని  ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement