జోరుగా బొగ్గు దందా!
కొండపాక:అక్రమ బొగ్గు దందా మళ్లీ పడగ విప్పింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ అక్రమ వ్యాపారం మళ్లీ యథేచ్ఛగా కొనసాగుతోంది. బొగ్గు అక్రమ దందా వల్ల పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లుతోంది. దళారుల హస్తలాఘవంతో నాసిరకం బొగ్గును వినియోగించడం వల్ల బాయిలర్ల ద్వారా సరియైన మోతాదులో స్టీం ఉత్పత్తి కాక తీవ్ర నష్టం వాటిల్లుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బొగ్గు వ్యాపారంపై గతంలో మండలానికి చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఉన్నతాధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి కఠినంగా వ్యవహరించారు. దీంతో బొగ్గు దందా కొంతకాలం నిలిచిపోయినా విషయం పాతబడడం, అప్పుడున్న అధికార వ్యవస్థ మారడంతో మళ్లీ ఊపందుకుంది. మరోవైపు అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
కొండపాక మండలంలోని రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న లకుడారం, తిమ్మారెడ్డిపల్లి, దుద్దెడ, కుకునూర్‌పల్లి గ్రామాలు బొగ్గు అక్రమ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. ఈ గ్రామాల్లో రాత్రి వేళ భారీ ఎత్తున బొగ్గు వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలకు వెళ్లే లక్షల రూపాయల విలువైన బొగ్గు దళారుల పాలవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడం.. ఈ వ్యాపారం కాసులు కురిపిస్తుండడంతో దళారులు అనతికాలంలోనే లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్నేళ్ల కిందట దుద్దెడలో ఒకటి, రెండు కేంద్రాలతో ప్రారంభమైన ఈ వ్యాపారం అనతికాలంలోనే పలు గ్రామాలకు విస్తరించి సుమారు 30 దుకాణాల వరకు విస్తరించింది.
దోపీడీ జరుగుతున్నది ఇలా...
మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరి ఖనీ, చందాపూర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ పారిశ్రామిక వాడకు నిత్యం వందలాది లారీల బొగ్గు సరాఫరా అవుతోంది. దళారుల మాయాజాలం వల్ల ఈ బొగ్గులో కొంతభాగ ం అక్రమార్కుల పాలవుతోంది. మార్గమధ్యంలో అక్రమంగా వెలసిన బొగ్గు దుకాణాల్లో డ్రైవర్లు రూ. 350 నుంచి 400లకు క్వింటాలు చొప్పున అర టన్ను నుంచి రెండు టన్నుల వరకు నాణ్యమైన బొగ్గును అమ్ముతారు. అనంతరం తూకంలో వ్యత్యాసం రాకుండా దుకాణాల్లో ఉండే నాసిరకం బొగ్గు పొడినిగానీ, నీటిని చల్లడం ద్వారా సరిచేస్తారు. దళారులు అలా తీసిన బొగ్గును క్వింటాలుకు రూ. 600 వరకు ఇటుక బట్టీల నిర్మాణాలకు, ఇతర చిన్న చిన్న పరిశ్రమలకు విక్రయిస్తారు.
బొగ్గు వ్యాపారులు డ్రైవర్లకు అడ్వాన్సుల రూంలో కొంత డబ్బు ముట్టజెప్పి తమ వైపు తిప్పుకుంటారు. గతంలో కిరాయి ట్రాక్టర్లతో బొగ్గును తరలించిన దళారులు నేడు సొంత లారీలతో గాజుల రామారం, గండిమైసమ్మ ప్రాంతంలోని పరిశ్రమలకు తరలిస్తూ లాభాలు గడిస్తుండటం గమనార్హం.మండల పరిధిలో 20కి పైగా ఉన్న బొగ్గు దుకాణాల్లో ప్రతీరోజూ రాత్రికి రాత్రే సుమారు 50 టన్నులకుపైగా బొగ్గును డంపు చేస్తున్నారు. తెల్లవారేసరికి ఆ బొగ్గును వ్యాపారులు లోడ్ చేసి అమ్ముతున్నారు. చీకటి మాటునే రోజుకు లక్షల విలువైన, పరిశ్రమలకు చెందిన బొగ్గు చేతులు మారుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా బొగ్గు లారీల రాకపోకల వల్ల గ్రామాలకు వెళ్లే రోడ్లు ఛిద్రమవుతున్నాయనీ, ఈ విషయంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.