ఇమామ్, మౌజన్లకు వేతనాలేవి బాబూ!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా ఒక్కటీ అమలు చేయలేదు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచుతానని హామీ ఇచ్చి, అసలు ఉన్న వేతనాన్ని కూడా నిలిపివేయడం ముస్లిం మైనార్టీలను నివ్వెరపరుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే గౌరవ వేతనాలను రెట్టింపు చేసి క్రమం తప్పకుండా ఇచ్చారని, ఆయన సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే ఆరు నెలల గౌరవ వేతనం కలిపి మొత్తం రూ.45 కోట్లకు పైగా అందించి ఉండేవారని రాష్ట్రంలోని ఇమామ్లు, మౌజన్లు చెబుతున్నారు. ఇదే కాదు.. ఆదాయం లేని మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తానని బాబు ఇచ్చిన హామీ కూడా నీటి మాటే అయ్యింది. రాష్ట్రంలోని ఆదాయం లేని 6 వేల మసీదులకు నెలకు రూ.5 వేలు నిర్వహణ సాయం అందించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు, విజయవాడ వద్ద హజ్ హౌస్ నిర్మాణం, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం, ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం వంటి హామీలను ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయకుండా మోసకారితనాన్ని ప్రదర్శిస్తున్నారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. 2014లో ముస్లిం మైనార్టీలను మోసగించిన బాబు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించి, నిలువునా మోసగించారని ముస్లిం సంఘాలు మండిపడితున్నాయి. రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేకంగా వడ్డీలేని ఇస్లాం బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తానని నాడు హామీ ఇచ్చి, ఐదేళ్లపాటు దాని ఊసే ఎత్తలేదు. ఈ ఎన్నికల్లోను అదే హామీ ఇచ్చి, మరోసారి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2014లో హజ్ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్హౌస్లు నిరి్మస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని, వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి, పరిరక్షిస్తామని చెప్పి, ఒక్కటీ అమలు చేయలేదు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధికి రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి, అరకొరగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.జగన్ పాలనలోనే ముస్లింలకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు చెల్లించింది. ముస్లిం మైనార్టీలకు వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితిని కల్పించారు. చంద్రబాబు గత పాలనలో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, అనేక మంది ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెట్టి అన్యాయంగా వేధించారు. ముస్లిం యువతపై నాటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన దేశంద్రోహం వంటి అక్రమ కేసులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎత్తివేయడమే కాకుండా నవరత్నాలతోపాటు అనేక రకాల పథకాల ద్వారా అండగా నిలిచింది. ముస్లిం మైనార్టీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందించింది. ఐదేళ్ల కాలంలో కేవలం వైఎస్సార్ చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించింది. ప్రతి నెలా ఒకటో తేదీన సాయమందించాలి మసీదుల నిర్వహణకు నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందిస్తానని, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం పెంచి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడిచినా హమీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీన మసీదుల నిర్వహణకు, ఇమామ్, మౌజన్లకు ఆర్థిక సాయం అందించాలి. –షేక్ నూరుల్లా హజరత్, ఉప్పలమర్రి మసీద్ ఇమామ్, నెల్లూరు జిల్లాఇమామ్లకు గౌరవ వేతనం పెంచి అందించాలి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇమామ్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేలు నుంచి రూ.10 వేలకు, మౌజన్ల వేతనాన్ని రూ. 3 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, అందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం రూ.300.68 కోట్లు, కోవిడ్ ప్రత్యేక సాయం రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.400.68 కోట్లు అందించి భరోసా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కనీసం వేతనం కూడా ఇవ్వడంలేదు. ముస్లిం సమాజానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జేఏసీ