గల్ఫ్ జైల్లో భర్త... బతుకు చెరలో భార్య | Survival in captivity in the Gulf of husband and wife in jail | Sakshi
Sakshi News home page

గల్ఫ్ జైల్లో భర్త... బతుకు చెరలో భార్య

Published Sat, Dec 20 2014 12:15 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్ జైల్లో భర్త...  బతుకు చెరలో భార్య - Sakshi

గల్ఫ్ జైల్లో భర్త... బతుకు చెరలో భార్య

వలసల వ్యథలు
 

ఆశల ఎడారి... గల్ఫ్... చిత్తూరు జిల్లా వాసి ఇమామ్‌సాబ్‌ను ప్రాణంలేని కట్టెలా ఎలా మార్చిందో నిన్నటి ‘ఫ్యామిలీ’లో తెలుసుకున్నాం. ఇవాళ మరో వలస వ్యథ. ఆ వ్యథ పేరు భూదేవి.
 
భూదేవికి గల్ఫ్ ఇంకోరకమైన గాయం చేసింది. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలోని మాకూర్ శంకర్‌తో ఆమెకు పెళ్లయింది. ఇటు అమ్మానాన్న, అటు అత్తామామ ఎవరూ లేరు. అయినా నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం చాలు అనుకున్నారు ఆ ఇద్దరు. పొలంపుట్రా ఏమీ లేదు.. ఎన్ని రోజులని ఇట్లా కూలీనాలీ చేసుకొని బతుకుతం.. అప్పోసొప్పో చేసి నాలుగైదేండ్లు గల్ఫ్‌కి పొయ్యొస్తే నాలుగురాళ్లు సంపాదించికొని రావొచ్చు అని ఆశపడ్డాడు శంకర్. ఏజెంట్ సహాయంతో యూఏఈ దేశంలోని ‘ఫుజీరా’ ఎమిరేట్‌కి వెళ్లాడు. మేస్త్రీ పనికి కుదిరాడు. ఈయన గల్ఫ్ వెళ్లేటప్పటికి భూదేవి ఆర్నెల్ల గర్భవతి. కొడుకు పుట్టినా ఆ మాట ఫోన్లోనే విని ఆనంద పడ్డాడు కానీ చూడ్డానికి రాలేదు. ఒక్క యేడాది పనిచేసి ఆ డబ్బులు తీసుకెళ్లి, అట్లాగే కొడుకునీ చూసి వద్దామనుకున్నాడు. అట్లా నాలుగేళ్లు గడిచాయి.
 
ఇంతలోనే...: శంకర్ పనిచేసే చోటే ఓ రాజస్థాన్ కార్మికుడూ పనిచేస్తున్నాడు లేబర్‌గా. ఓ రోజు పనిచేస్తుండగా హఠాత్తుగా భవనం మీద నుంచి జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు ఆ రాజస్థాన్ కార్మికుడు. అతను పనిచేస్తున్న సమయంలో పక్కనే శంకరూ ఉన్నాడు. దాంతో శంకరే అతనిని తోసి ఉండాడని భావించిన ఫుజేరా చట్టం అతనిని నేరస్థుడిని చేసి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషాదానికి ఇప్పుడు ఆరేళ్లు. శంకర్ కొడుకు రాజుకి పదేళ్లు. ఇప్పటికీ తండ్రి  మొహం కొడుకు ఎరుగడు, కొడుకు మొహం తండ్రికి తెలియదు. ఆ అనుబంధాన్ని ఫోన్లో ఆస్వాదించడమే!
 
మెర్సీ పిటీషన్..: శంకర్ జైల్లోంచి బయటకు రావాలంటే షరియత్ లా ప్రకారం చనిపోయిన రాజస్థానీ కార్మికుడి భార్య శంకర్‌కు క్షమాభిక్ష పెట్టాలి. అందుకు ఆమె అడిగిన పైకాన్ని శంకర్ కుటుంబం ఆమెకు చెల్లించాలి. క్షమాభిక్ష పెట్టడానికి ఆ కార్మికుడి భార్య ఒప్పుకుంది. అయితే బదులుగా 5 లక్షల రూపాయలు, అయిదు ఎకరాల పొలం ఇమ్మని అడిగింది. ఏ పూటకు ఆ పూట పనిచేసుకునే భూదేవి అంత డబ్బుని ఇచ్చే పరిస్థితిలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ రాష్ట్రంతో మాట్లాడి సయోధ్యను కుదర్చొచ్చు. ఆమె అడిగిన డబ్బును తెలంగాణ ప్రభుత్వం ఇస్తే శంకర్ బయటకు రావచ్చు.  ఎలాగైనా తన భర్తను విడిపించే ఏర్పాటు చేయమని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించింది భూదేవి. ఆ ప్రయత్నాలు జరగుతున్నాయి. ‘‘మగ తోడు లేక పదేళ్ల కొడుకుని పట్టుకొని నా భర్త కోసం కొట్లాడుతున్నా. గల్ఫ్ పొయ్యి పదేళ్లయితుంది. ఇప్పటిదాకా ఇంటి మొఖం చూడలే.. కొడుకు పుట్టిండు అయినారాలే. ఎట్లున్నడో తెలివదు. నా భర్తను విడిపించమని మొక్కని కాళ్లు లేవు’’ అంటోంది కన్నీళ్లతో భూదేవి. ‘చిన్నగున్నప్పుడు ఫోన్లో మాట్లాడిన నాన్నతో. ఇదివరదాంకా చూడలేదు. మా నాన్నను చూడబుద్దయితుంది. మనమే పోదామమ్మా.. అని అడిగితే దేశంకాని దేశం అది. మనకు పోరాదు అంటది కానీ ఎక్కడున్నడో చెప్పదు’ అంటాడు పదేళ్ల రాజు అమాయకంగా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement