ప్రాణమున్న కట్టె ఇమామ్! | Imam living wood | Sakshi
Sakshi News home page

ప్రాణమున్న కట్టె ఇమామ్!

Published Thu, Dec 18 2014 11:15 PM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

ప్రాణమున్న కట్టె ఇమామ్! - Sakshi

ప్రాణమున్న కట్టె ఇమామ్!

అరబిక్ కడలి అందమెంతో.. తెలుగు వలసలకు అది సృష్టిస్తున్న అగాధమూ అంతే!  ఆ ఉప్పు ఊట ఇక్కడ అప్పుల మూటను పెంచుతోంది! అమాయకులను ఆ జైళ్లల్లో ఖైదు చేస్తోంది.. శవాల పెట్టెల్ని మోసుకొస్తోంది.. గల్ఫ్.. ఆశల ఎడారి! దాహం తీర్చని ఒయాసిస్సుల దరి! ఈ మంచిచెడులకు వేదికైంది నిన్న హైదరాబాద్‌లో జరిగిన  ‘ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే’! ఆ సందర్భంగా చర్చకొచ్చిన కొన్ని వలస జీవితాల వ్యథలు...
 
ఈయన పేరు లోమ్డా ఇమామ్‌సాబ్.. వయసు అరవై ఏళ్లు! ఊరు.. చిత్తూరు జిల్లా, మాండ్యం! ప్రత్యేకత.. ఆ గుండె తట్టుకోలేనంత వ్యథ!
 లోమ్డా ఇమామ్‌సాబ్ తన భార్య చనిపోతే తనకన్నా వయసులో చాలా చిన్నదైన బీబీని పెళ్లిచేసుకున్నాడు. పిల్లల్లేరు. ఆ బాధను పోగొట్టుకోవడానికి తమ్ముడి కూతురిని దత్తత తీసుకున్నాడు. ఇమామ్, బీబీ ఇద్దరూ కూలికి వెళితేకానీ ఆ ముగ్గురి కడుపు నిండదు. దున్నడానికి భిగడు పొలం లేదు, ఉండడానికి గజం జాగాలేదు. ఎట్లాగో అట్లా రెక్కల కష్టానికి కొంత అప్పూ చేర్చి చివరకింత సొంత చూరైతే కప్పుకున్నారు. కానీ ఆ అప్పే భయపెట్టసాగింది వాళ్లను. దాంట్లోంచి బయటపడేంత సంపాదన మాండ్యంలో అయితే దొరకదు. అప్పటికే ఊర్లోంచి బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు పోయిన చాలామంది ఆడవాళ్ల  గురించి తెలుసు బీబీకి. అక్కడ పనికెళితే జీతం బాగానే వస్తుందని కూడా. ఒక్క రెండుమూడేళ్లు ఆ కష్టాన్ని కాదనుకుంటే ఎంతోకొంత డబ్బును చేత బట్టుకోవచ్చని ఆశపడ్డారు మొగుడూపెళ్లాం. ధైర్యం చేసింది బీబీ. ఇమామూ వద్దనలేదు. మస్కట్‌కి ప్రయాణమైంది. ఇది 2010 నాటి సంగతి!
 
రెండు నెల్లకే..

 
గల్ఫ్ కురిపించే కాసుల గురించి కలలు కన్నంత సేపు పట్టలేదు బీబీకి అవి కల్లలు అని తేలడానికి. అక్కడ ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. ఆ కష్టం భరించగలిగింది కాదు. అయినా ఓపిక పట్టింది. కానీ ముప్పైఏళ్ల పైనున్న బీబీకి  తమింట్లో చకచకా పనిచేసే సత్తువ లేదని ఆ షేక్ కుటుంబం ఆమెను తిరిగి ఇండియాకు పంపించే ఏర్పాటు చేసింది. మస్కట్‌కి వచ్చిన రెండునెలలకే ఇండియాకు తిరుగు ప్రయాణమైంది బీబీ. ఖతర్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కించాడు యజమాని. దోహాలో దిగి చెన్నైకి కనెక్టింగ్ ఫ్లయిట్ ఎక్కాలి. కంగారులో దోహా ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ సహా పాస్‌పోర్ట్‌నూ పోగొట్టుకుంది బీబీ. ఆ రెండూలేని ఆమెను దోహాలోనే ఆపేసి అక్కడి ఇండియన్ ఎంబసీకి కబురుపెట్టారు ఫలానా భారతీయురాలు పాస్‌పోర్ట్ పోగొట్టుకొని దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఉందని. తనని సొంత దేశానికి వెళ్లనీయకుండా ఆపేసిన ఆ హడావిడికి బెదిరిపోయింది బీబీ. ఇంక ఎప్పటికీ వెళ్లనీయకుండా అక్కడే బందీగా ఉంచేస్తారేమోనని భయపడిపోయింది. ఆ భయం ఆమె గుండెను పట్టేసింది. ఉన్నచోటనే కుప్పకూలి పోయింది. కొన్ని గంటల తర్వాత వచ్చి చూసిన ఇండియన్ ఎంబసీ అధికారులకు బీబీ విగతజీవిగా కనిపించింది. ఉన్నపళంగా ఇండియా తరలించారు. శవపేటికలో వచ్చిన భార్యను చూసిన ఇమామ్ బోరుమన్నాడు. ఉన్న ఆసరా పోయేసరికి ప్రాణమున్న కట్టెలా మారాడు.
 
రెండేళ్లయినా...

 
మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో బీబీ తీసుకున్న బోర్డింగ్ పాస్‌ను చెక్ చేస్తే ఆమె టికెట్ వివరాలు, పాస్‌పోర్ట్ సంగతి తెలిసేది దోహా ఎయిర్‌పోర్ట్ అధికారులకు. కానీ అలా చేయకుండా ఆమెను భయపెట్టి ప్రాణంపోవడానికి కారకులయ్యారు. ఇటు ఇండియన్ ఎంబసీ చాలా ఆలస్యంగా స్పందించి ఆ పాపంలో పాలు పంచుకుంది. ఈ రెండిటి చర్యల మీద తీవ్రంగా స్పందించింది మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఖతర్ ఎయిర్‌వేసేనే రద్దు చేయాలని పిల్ వేసింది. భయపడిన ఖతర్ ప్రభుత్వం ఇమామ్‌కు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతాలో జమైంది. ఇది జరిగి రెండేళ్లు. ఇప్పటికీ ఆ డబ్బు ఇమామ్ చేతికి అందలేదు. ‘‘నా భార్య పోయి నాలుగేళ్లవుతోంది. గల్ఫ్‌కు పోయి  రెండుమూడేళ్లుండి ఎంతోకొంత సంపాదించుకొని వస్తే ఉన్న అప్పులు తీర్తయి అనుకున్నం. అప్పులు తీరడమేమో బీబీనే పోయింది. ఆ బాధ ఎవరు తీరుస్తరు. ఆమె పేరుమీద వచ్చిన డబ్బుల్నీ ఇవ్వట్లేదు గవర్నమెంటు. దానికోసం మళ్లీ కోర్టులో కేసు. ఇదేం అన్యాయం?’’ అంటాడు ఇమామ్ కన్నీళ్లు పెట్టుకుంటూ! ఇమామ్ పేదరికమెలాంటిదంటే .. భార్య శవం వచ్చిన చెక్క పేటికే ఆయన ఇంటికి తలుపుగా మారినంత!  ఇది ఒక్క ఇమామ్ కథే కాదు.. తెలుగు రాష్ట్రాల గల్ఫ్ వలసజీవులందరివీ! ఒక్కొక్కరిదీ ఒక్కో వేదన!  కడప, కరీంనగర్, తూర్పుగోదావరి, నిజామాబాద్.. ఇట్లా ఏ జిల్లా దీనికి అతీతం కాదు!  ఈ పాపం ఎవరిది? ఉపాధి అవకాశాలు చూపించలేని మన దేశానిదా? డబ్బుల ఎండమావులను సృష్టిస్తున్న గల్ఫ్ ఎడారిదా? వలస మానవ నైజం అని సరిపెట్టుకొని వాళ్ల క్షేమం పట్ల దృష్టిపెట్టని ఎంబసీదా? పాలనకు ప్రజాశ్రేయస్సును జతచేర్చలేని ప్రభుత్వాలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కార్యరూపంలో దొరకాల్సిన అవసరం ఉంది!
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement