International Migrants Day
-
ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది ఎన్ఆర్ఐలు
విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస వెళ్లేలా ‘నెట్టివేయబడే’ పరిస్థితులు కొన్నైతే, వున్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ‘ఆకర్షణీయంగా’ ఉండడం మరొక కారణం. చదవండి:డాక్టర్ ఫస్ట్ లేడీ అంటే తప్పేంటి!? పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వలస వెళ్లడాన్ని ‘అంతర్గత వలసలు’ అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటారు. ప్రవాసులకు రాయితీలు కల్పిస్తూ వారిని ప్రాత్సహిస్తే అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండాలి. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృదేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్న, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీదవుంది. – రఘుపతిరావు గడప మొబైల్ : 99634 99282 -
‘గల్ఫ్ కార్మికులపై ప్రభుత్వాల చిన్నచూపు’
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేసియా, ఈజిప్టు, లిబియా, సిరియా, టర్కీ లాంటి 49 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించి అమలు చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశం గానీ, గల్ఫ్ దేశాలు గానీ ఈ తీర్మానాన్ని 27 ఏళ్లయినా ఆమోదించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్పీన్స్, భారత దేశంలో కేరళ రాష్ట్రం అత్యుత్తమ వలస విధానాలతో ప్రవాసులకు పలు సౌకర్యాలు కల్పిన్నాయి. వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉన్నది. మానవ వలస అనేది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్వస్థలాల నుంచి వేరేచోటికి తరలివెళ్లే వారి సంఖ్య 45.36 కోట్లు. ఇది క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా కోటి 40 లక్షల మంది ఉన్న చోటు వదిలి వేరే చోట్లకు తరలిపోతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. 1979లో అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం వచ్చింది. వేతనాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు మెరుగుపరచడం, శ్రమ దోపిడీని నిరోధించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు. అత్యధిక విదేశీ మారకం పొందుతున్న భారత్ ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో మూడు కోట్ల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2015లో ప్రపంచంలోనే అత్యధికంగా 68.91 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశం పొందింది. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులు తమ కష్టార్జితాన్ని తమ సొంత కుటుంబాలకే పంపుతున్నారు కానీ.. ఆ రూపంలో వాళ్ళు స్వదేశానికి అపారమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న పది లక్షల మంది తెలంగాణ వాసులు నెలకు ఒక వెయ్యి కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని పంపిస్తున్నారు. ఇలా మనదేశానికి పంపిస్తున్న విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. కార్మిక శక్తిని ఎగుమతి చేసి, ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గల్ఫ్‌లో 85 లక్షల మంది భారతీయులు భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్ ఉన్నాయి. తెలంగాణలోని పాత జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు హైదరాబాద్ పాత నగరం నుంచి ఎక్కువగా వలస పోతున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సుల్తానేట్ అఫ్ ఒమన్, బహరేన్, కువైట్, ఖతార్, సింగపూర్ మలేసియా తదితర దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్‌తో సహా 18 ఈసీఎన్ఆర్ (ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డు) దేశాలలో 85 లక్షల మంది భారతీయులున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన కార్మికులు 10 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా. గల్ఫ్ కార్మికులపై ప్రభుత్వాల చిన్నచూపు కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) తెస్తామన్న తెలంగాణ ప్రభుత్వ హామీ అటకెక్కింది. అమెరికా, యూరప్ దేశాలలోని విద్యావంతులైన, ధనవంతులైన ప్రవాస భారతీయులకు తగిన గౌరవం దక్కుతుండగా, గల్ఫ్ ఎన్నారైలు వివక్షకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాలలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. అక్కడ ఏ సంక్షోభం వచ్చినా ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నేరుగా మన పల్లెలపై, ప్రవాసీ కుటుంబాలపై కనిపిస్తున్నది. ఇలాంటి సందర్భాలలో మనవారు ఉద్యోగాలు కోల్పోయి అర్ధంతరంగా ఇంటికి చేరుతున్నారు. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి.. మనవారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ముందస్తు ప్రణాళికలు ఉండవు. ఏజెంట్ల మోసాలు, యజమానుల హింసలు, జీతాలు ఇవ్వకపోవడం, దుర్భర పరిస్థితులలో అక్కడ చిక్కున్నవారిని రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ లేదు. ప్రవాసుల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించడం వలన పలు సామాజిక పథకాలకు అర్హత కోల్పోతున్నారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న మనవారికి న్యాయ సహాయం కావాలి. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారి కోసం పునరావాసం, పునరేకీకరణ కార్యక్రమాలు చేపట్టాలి. మంద భీంరెడ్డి గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు -
ప్రాణమున్న కట్టె ఇమామ్!
అరబిక్ కడలి అందమెంతో.. తెలుగు వలసలకు అది సృష్టిస్తున్న అగాధమూ అంతే! ఆ ఉప్పు ఊట ఇక్కడ అప్పుల మూటను పెంచుతోంది! అమాయకులను ఆ జైళ్లల్లో ఖైదు చేస్తోంది.. శవాల పెట్టెల్ని మోసుకొస్తోంది.. గల్ఫ్.. ఆశల ఎడారి! దాహం తీర్చని ఒయాసిస్సుల దరి! ఈ మంచిచెడులకు వేదికైంది నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే’! ఆ సందర్భంగా చర్చకొచ్చిన కొన్ని వలస జీవితాల వ్యథలు... ఈయన పేరు లోమ్డా ఇమామ్‌సాబ్.. వయసు అరవై ఏళ్లు! ఊరు.. చిత్తూరు జిల్లా, మాండ్యం! ప్రత్యేకత.. ఆ గుండె తట్టుకోలేనంత వ్యథ! లోమ్డా ఇమామ్‌సాబ్ తన భార్య చనిపోతే తనకన్నా వయసులో చాలా చిన్నదైన బీబీని పెళ్లిచేసుకున్నాడు. పిల్లల్లేరు. ఆ బాధను పోగొట్టుకోవడానికి తమ్ముడి కూతురిని దత్తత తీసుకున్నాడు. ఇమామ్, బీబీ ఇద్దరూ కూలికి వెళితేకానీ ఆ ముగ్గురి కడుపు నిండదు. దున్నడానికి భిగడు పొలం లేదు, ఉండడానికి గజం జాగాలేదు. ఎట్లాగో అట్లా రెక్కల కష్టానికి కొంత అప్పూ చేర్చి చివరకింత సొంత చూరైతే కప్పుకున్నారు. కానీ ఆ అప్పే భయపెట్టసాగింది వాళ్లను. దాంట్లోంచి బయటపడేంత సంపాదన మాండ్యంలో అయితే దొరకదు. అప్పటికే ఊర్లోంచి బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు పోయిన చాలామంది ఆడవాళ్ల గురించి తెలుసు బీబీకి. అక్కడ పనికెళితే జీతం బాగానే వస్తుందని కూడా. ఒక్క రెండుమూడేళ్లు ఆ కష్టాన్ని కాదనుకుంటే ఎంతోకొంత డబ్బును చేత బట్టుకోవచ్చని ఆశపడ్డారు మొగుడూపెళ్లాం. ధైర్యం చేసింది బీబీ. ఇమామూ వద్దనలేదు. మస్కట్‌కి ప్రయాణమైంది. ఇది 2010 నాటి సంగతి! రెండు నెల్లకే.. గల్ఫ్ కురిపించే కాసుల గురించి కలలు కన్నంత సేపు పట్టలేదు బీబీకి అవి కల్లలు అని తేలడానికి. అక్కడ ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. ఆ కష్టం భరించగలిగింది కాదు. అయినా ఓపిక పట్టింది. కానీ ముప్పైఏళ్ల పైనున్న బీబీకి తమింట్లో చకచకా పనిచేసే సత్తువ లేదని ఆ షేక్ కుటుంబం ఆమెను తిరిగి ఇండియాకు పంపించే ఏర్పాటు చేసింది. మస్కట్‌కి వచ్చిన రెండునెలలకే ఇండియాకు తిరుగు ప్రయాణమైంది బీబీ. ఖతర్ ఎయిర్వేస్ విమానం ఎక్కించాడు యజమాని. దోహాలో దిగి చెన్నైకి కనెక్టింగ్ ఫ్లయిట్ ఎక్కాలి. కంగారులో దోహా ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ సహా పాస్‌పోర్ట్‌నూ పోగొట్టుకుంది బీబీ. ఆ రెండూలేని ఆమెను దోహాలోనే ఆపేసి అక్కడి ఇండియన్ ఎంబసీకి కబురుపెట్టారు ఫలానా భారతీయురాలు పాస్‌పోర్ట్ పోగొట్టుకొని దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఉందని. తనని సొంత దేశానికి వెళ్లనీయకుండా ఆపేసిన ఆ హడావిడికి బెదిరిపోయింది బీబీ. ఇంక ఎప్పటికీ వెళ్లనీయకుండా అక్కడే బందీగా ఉంచేస్తారేమోనని భయపడిపోయింది. ఆ భయం ఆమె గుండెను పట్టేసింది. ఉన్నచోటనే కుప్పకూలి పోయింది. కొన్ని గంటల తర్వాత వచ్చి చూసిన ఇండియన్ ఎంబసీ అధికారులకు బీబీ విగతజీవిగా కనిపించింది. ఉన్నపళంగా ఇండియా తరలించారు. శవపేటికలో వచ్చిన భార్యను చూసిన ఇమామ్ బోరుమన్నాడు. ఉన్న ఆసరా పోయేసరికి ప్రాణమున్న కట్టెలా మారాడు. రెండేళ్లయినా... మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో బీబీ తీసుకున్న బోర్డింగ్ పాస్‌ను చెక్ చేస్తే ఆమె టికెట్ వివరాలు, పాస్‌పోర్ట్ సంగతి తెలిసేది దోహా ఎయిర్పోర్ట్ అధికారులకు. కానీ అలా చేయకుండా ఆమెను భయపెట్టి ప్రాణంపోవడానికి కారకులయ్యారు. ఇటు ఇండియన్ ఎంబసీ చాలా ఆలస్యంగా స్పందించి ఆ పాపంలో పాలు పంచుకుంది. ఈ రెండిటి చర్యల మీద తీవ్రంగా స్పందించింది మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఖతర్ ఎయిర్వేసేనే రద్దు చేయాలని పిల్ వేసింది. భయపడిన ఖతర్ ప్రభుత్వం ఇమామ్‌కు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతాలో జమైంది. ఇది జరిగి రెండేళ్లు. ఇప్పటికీ ఆ డబ్బు ఇమామ్ చేతికి అందలేదు. ‘‘నా భార్య పోయి నాలుగేళ్లవుతోంది. గల్ఫ్‌కు పోయి రెండుమూడేళ్లుండి ఎంతోకొంత సంపాదించుకొని వస్తే ఉన్న అప్పులు తీర్తయి అనుకున్నం. అప్పులు తీరడమేమో బీబీనే పోయింది. ఆ బాధ ఎవరు తీరుస్తరు. ఆమె పేరుమీద వచ్చిన డబ్బుల్నీ ఇవ్వట్లేదు గవర్నమెంటు. దానికోసం మళ్లీ కోర్టులో కేసు. ఇదేం అన్యాయం?’’ అంటాడు ఇమామ్ కన్నీళ్లు పెట్టుకుంటూ! ఇమామ్ పేదరికమెలాంటిదంటే .. భార్య శవం వచ్చిన చెక్క పేటికే ఆయన ఇంటికి తలుపుగా మారినంత! ఇది ఒక్క ఇమామ్ కథే కాదు.. తెలుగు రాష్ట్రాల గల్ఫ్ వలసజీవులందరివీ! ఒక్కొక్కరిదీ ఒక్కో వేదన! కడప, కరీంనగర్, తూర్పుగోదావరి, నిజామాబాద్.. ఇట్లా ఏ జిల్లా దీనికి అతీతం కాదు! ఈ పాపం ఎవరిది? ఉపాధి అవకాశాలు చూపించలేని మన దేశానిదా? డబ్బుల ఎండమావులను సృష్టిస్తున్న గల్ఫ్ ఎడారిదా? వలస మానవ నైజం అని సరిపెట్టుకొని వాళ్ల క్షేమం పట్ల దృష్టిపెట్టని ఎంబసీదా? పాలనకు ప్రజాశ్రేయస్సును జతచేర్చలేని ప్రభుత్వాలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కార్యరూపంలో దొరకాల్సిన అవసరం ఉంది!