కెనడా ఇమ్మిగ్రేషన్ సైట్ క్రాష్?
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ శ్వేతసౌథం రేసులో దూసుకుపోతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ట్రంప్ టోర్నడో ఎఫెక్ట్ కెనడా ప్రధాన ఇమ్మిగ్రేషన్ సైట్ ను భారీగా తాకినట్టు తెలుస్తోంది. www.cic.gc.ca/ కెనడా సైట్ ను మంగళవారం రాత్రి చెక్ చేసినపుడు ఎర్రర్ మెసేజ్ వస్తోందని, రాయిటర్స్ నివేదించింది. అమెరికా, కెనడా, ఆసియా యూజర్లకు ఇంటర్నెల్ సర్వీస్ ఎర్రర్ అనే సందేశం కనిపిస్తోందని తెలిపింది దీనిపై స్పందించడానికి సంబంధిత అధికారులు తక్షణం అందుబాటులో లేరని పేర్కొంది. బహుశా దేశ ఉద్యోగాలపై ట్రంప్ వ్యాఖ్యలతో చాలామంది కెనడా వైపు చూడనున్నారనే అంచనాలతో ఈ పరిణామం సంభవించినట్టు వ్యాఖ్యానించింది. అటు వెబ్ సైట్ క్రాష్ పై ట్విట్టర్ లో కూడా కమెంట్లు వెల్లువెత్తాయి.
కాగా వైట్ హౌస్ ట్రంప్ కు స్వాధీనం అయితే తాము కెనడా పారిపోతామని గతంలోనే చాలామంది ట్విట్టర్ లో చలోక్తులు విసిరారు. అలాగే గత ఫిబ్రవరిలో ట్రంప్ ఎన్నుకోబడితే చాలామంది అమెరికన్లు కెనడా అట్లాంటిక్ తీరంలోని కేప్ బ్రెటన్ ద్వీపానికి శరణార్థులుగా పారిపోతారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.