అప్పు చేసి పప్పు కూడు
కొవ్వూరు :ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో భోజన సదుపాయకర్తలైన (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) మహిళలు అష్టకష్టాలు పడుతూ పథకాన్ని నెట్టుకొస్తున్నారు. అప్పులు చేసి వంటలు వండి విద్యార్థులకు వడ్డిస్తున్న ఆ మహిళల గోడు పట్టించుకునే నాథులే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 3,260 పాఠశాలల్లో 3,35,506 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 1నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు వెచ్చిస్తుండగా, 9, 10 తరగతుల విద్యార్థులకు పూర్తిగా రాష్ట్ర ప్రభు త్వ నిధులతోనే ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు.
ఇందుకోసం జిల్లాలో ప్రతి నెలా రూ.2.20 కోట్ల మేర ఖర్చవుతోంది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు ఈ ఏడాది ఆగస్టు వరకు బిల్లులు చెల్లిం చారు. కొన్ని మండలాల్లో స్వల్పంగా నిధులు మిగలడంతో అక్కడక్కడా కొన్ని పాఠశాలలకు కొంతమేర సెప్టెం బర్ నెలకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. నాలుగు నెలలుగా వంట ఖర్చులు, సదుపాయకర్తలకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో వంట చేస్తున్న మహిళలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నా యి. చిన్నారులలో పౌష్టిహాకార లోపం నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, 14ఏళ్ల లోపు చిన్నారులకు నిర్బంధ ప్రాథమిక విద్య అందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల వుతోంది. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ పథకం నిర్వహణపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. డిసెంబర్‌తో నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో సదుపాయకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం నిధులొచ్చినా..
కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు మంగళవారం విడుదలైనట్టు అధికారులు చెబుతున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చే 25 శాతం నిధులతోపాటు 9, 10 తరగతి విద్యార్థులకు సంబంధించి సెప్టెంబర్ వరకు సుమారు రూ.90 లక్షల మేర బకాయిలు విడుదల కాలేదు.
గౌరవ వేతనం అరకొరే
జిల్లాలోని పాఠశాలల్లో ఈ పథకం అమలుకు 6,733 మంది మహిళలను ప్రభుత్వం సదుపాయకర్తలుగా నియమిం చింది. వారికి గౌరవ వేతనం కింద సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ వరకు రూ.2.02 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1.55 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మరో వారం రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. ఈనెల గౌరవ వేతనం కలిపితే ఇంకా రూ.1.14 కోట్లు రావాల్సి ఉంటుంది.