ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..?
ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? అయితే మీ కోరిక నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బ్యాటింగ్ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో-ఆసియా క్రికెట్ కప్‌ను పునఃప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది. వివిధ కారణాల చేత 2007లో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరన్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ కనుక ఏసీసీ ప్రతిపాదనకు ఓకే చెబితే రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది లాంటి ప్రపంచస్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు.
కాగా, ఈ టోర్నీ తొలిసారి 2005లో జరిగింది. నాడు షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఆసియా ఎలెవెన్ తరఫున భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల ఆటగాళ్లు ఆడగా.. ఆఫ్రికా ఎలెవెన్ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాల క్రికెటర్లు ఆడారు.
చదవండి: పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..