జిన్నా హౌస్‌పై సిగపట్లు!
భారత్–పాక్‌ల మధ్య కొనసాగుతున్న వివాదాల్లోకి తాజాగా జిన్నా హౌస్ వచ్చి చేరింది. ముంబైలోని జిన్నా హౌస్ తమదంటే తమదంటూ భారత్, పాకిస్తాన్‌లు వాదిస్తున్నాయి. ఆ హౌస్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని, ఉన్నత స్థాయి అధికార సమావేశాలకు, విందులకు అనువుగా తీర్చిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించడం తాజా వివాదానికి తెర తీసింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ మాదిరిగా జిన్నా హౌస్‌ను అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ బీజేపీ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధాకు ఈ నెల 5న రాసిన లేఖలో సుష్మా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధీనంలో ఉంది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు దాన్ని విదేశాంగ శాఖకు బదలాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని సుష్మా పేర్కొన్నారు. జిన్నా హౌస్ తమ సొంతమని భారత్ స్పష్టంగా చెబుతుంటే.. అది తమదని, దాన్ని సొంతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని పాక్ అంటోంది. గతంలో కూడా జిన్నాహౌస్ తమకివ్వాలని, అందులో పాక్ దౌత్య కార్యాలయం పెడతామని పాక్ చెబుతోంది. అయితే జిన్నా హౌస్ భారత ఆస్తి అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ స్పష్టం చేశారు. పాక్‌కు దీనిపై ఎలాంటి హక్కు లేదని, ఒకవేళ హక్కు కోసం ప్రయత్నిస్తే తామూ పోరాడుతామని పేర్కొన్నారు. మరోవైపు జిన్నా హౌస్‌పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ అన్నారు.
పాక్ కర్తార్‌పూర్‌ను ఇస్తుందా..?
జిన్నాహౌస్‌ను ఇస్తే కర్తార్‌పూర్‌ను భారత్‌కు ఇస్తారా అన్న ప్రశ్నకు ఫైజల్ బదులిస్తూ అలా ఎప్పటికీ జరగదన్నారు. సిక్కుల కోరిక మేరకు కర్తార్‌పూర్‌కు వీసా లేకుండా వెళ్లివచ్చే అవకాశం కల్పించామని, ఈ నిర్ణయంలో భారత్‌కు కూడా భాగముందని వివరించారు. జిన్నాహౌస్పై తనకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ జిన్నా కుమార్తె దినా వాడియా 2007 ఆగస్టులో ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. జిన్నా ఏకైక వారసురాలిని తానే కాబట్టి తనకు ఆ ఇల్లు అప్పగించాలని కోరారు. ఆమె మరణించడంతో ఆమె కుమారుడు నస్లీవాడియా ఈ కేసును నడిపిస్తున్నారు.
ఐరోపా శిల్పశైలికి ప్రతీక
పాక్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా 1936లో జిన్నా హౌస్‌ను నిర్మించుకున్నారు. ముంబై మలబార్ హిల్‌లో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవంతికి ప్రముఖ ఐరోపా ఆర్కిటెక్చర్ క్లాడ్ బాట్లే ఐరోపా శిల్పశైలిలో అద్భుతంగా రూపకల్పన చేశారు. దేశ విభజన జరిగి పాకిస్తాన్ (కరాచి)వెళ్లే వరకు జిన్నా ఈ ఇంట్లోనే ఉన్నారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చయింది. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ భవంతి నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయిని వాడారు. 1944 సెప్టెంబర్‌లో దేశ విభజనపై గాంధీ, జిన్నాల మధ్య చర్చలు ఈ ఇంట్లోనే జరిగాయి. 1946 ఆగస్టు 15న నెహ్రూ, జిన్నాలు ఇక్కడే చర్చలు జరిపారు.