యోగాకు గిన్నిస్!
రాజ్‌పథ్ వద్ద 35,985 మంది ఆసనాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం యోగాకు మరో గౌరవం దక్కింది. ఒకే వేదికపై నుంచి అత్యధిక మంది యోగాసనాలు వేయడంతో పాటు, ఒకేచోట అత్యధిక దేశాల వారు యోగాసనాలు వేసిన నేపథ్యంలో గిన్నిస్ బుక్ వారు రెండు ప్రపంచ రికార్డులు కట్టబెట్టారు. ఆదివారం ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు వేశారు. అదేవిధంగా 84 దేశాలకు చెందిన వారు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాసనాల రికార్డును క ట్టబెట్టేందుకు టికెట్లు, వీడియో రికార్డింగులు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు రాజ్‌పథ్ వద్ద యోగా వేడుకల్లో పాల్గొన్న గిన్నిస్ బుక్ ప్రతినిధి వెల్లడించారు.
ఒకే రోజు యోగాకు రెండు రికార్డులు దక్కడం పట్ల ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీపాద నాయక్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రికార్డు కూడా దక్కేందుకు తోడ్పడిన అందరికీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కాగా, ఇంతకుముందు 2005లో గ్వాలియర్‌కు చెందిన వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో 29,973 మంది విద్యార్థులు యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆదివారం రాజ్‌పథ్ వద్ద జరిగిన యోగా కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనికోసం రాజ్‌పథ్ వద్ద 24 అత్యాధునిక కెమెరాలను, 200 మంది సాంకేతిక నిపుణులను ఆ చానెల్ వినియోగించింది.