వాహనాలకు బ్రేకులు
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్ ఓ మోస్తరు అమ్మకాలతో.. ప్యాసింజర్ వాహనాల కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదు. గతేడాది అక్టోబర్‌తో 2,89,677 వాహనాల విక్రయాలతో పోలిస్తే.. ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 2,79,837కి పరిమితమయ్యాయి. కంపెనీలన్నీ నిల్వలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉండటమే ఇందుకు కారణం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
కార్ల అమ్మకాలు గత అక్టోబర్‌లో 1,95,036 యూనిట్లతో పోలిస్తే ఈసారి 5.32 శాతం క్షీణించి 1,84,666 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో నమోదైన 11.24 శాతం తగ్గుదల అనంతరం.. మళ్లీ క్షీణత నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. ‘పండుగ సీజన్ ఇంకా కాస్త మెరుగ్గా ఉండేదేమో.. అయితే ప్రస్తుత పరిస్థితి మార్కెట్ సెంటిమెంటును ప్రతిబింబిస్తుందని అనుకోవడానికి లేదు. ఇది తాత్కాలికమైన తగ్గుదల మాత్రమే.
తయారీ సంస్థలు తమ దగ్గరున్న స్టాక్‌ను సర్దుబాటు చేసుకుంటూ ఉండటమే అమ్మకాలు తగ్గడానికి కారణం‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ చెప్పారు. జూలై నుంచి సెప్టెంబర్ దాకా పండుగల సీజన్ కోసం తయారీ కంపెనీలు.. డీలర్ల దగ్గర స్టాకును గణనీయంగా ఉంచిన నేపథ్యంలో అక్టోబర్‌లో వాహనాల డిస్పాచ్‌ను తగ్గించాయన్నారు.
తగ్గిన మొత్తం విక్రయాలు..
మిగతా కేటగిరీల్లో సైతం అమ్మకాలు తగ్గడంతో మొత్తం విక్రయాలు 22,01,489 యూనిట్ల నుంచి 21,62,164 యూనిట్లకు పడిపోయింది. ఇది 1.79 శాతం క్షీణత. ఈ ఏడాది జనవరి తర్వాత అన్ని వాహనాల అమ్మకాలు క్షీణించడం ఇదే ప్రథమం. అక్టోబర్‌లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 3.5 శాతం క్షీణించి 11,44,512 నుంచి 11,04,498కి తగ్గాయి. వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాలు మాత్రం 6 శాతం పెరిగి 69,793 యూనిట్లుగా నమోదయ్యాయి.