Indian elections
-
Russia: మా జోక్యం లేదు
వాషింగ్టన్: భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వ జోక్యం ఎంతమాత్రం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టంచేశారు. భారత అంశాల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగా తలదూర్చుతోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన నేపథ్యంలో అమెరికా అధికార ప్రతినిధి శుక్రవారం స్పందించారు. ‘‘ భారత్‌లోనేకాదు ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలు, దేశ పాలనా విధానాల్లో అమెరికా కలగజేసుకోదు. ఎన్నికల నిర్ణయాలన్నీ భారతీయ ప్రజలే తీసుకుంటారు’’ అని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ గత ఏడాది భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి, మరో భారతీయుడు కలిసి చంపేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జఖారోవా ఆరోపించారు. ఈ విషయాన్ని మిల్లర్ వద్ద మీడియా ప్రస్తావించగా.. ‘‘ అవన్నీ నిరాధార ఆరోపణలు. ప్రస్తుతం ఆ ఆరోపణలన్నీ జ్యూరీ వద్ద విచారణలో ఉన్నాయి. చట్టసంబంధ ఇలాంటి విషయంపై నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. అందుకే ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నా’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. రష్యా ఆరోపణలను భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సైతం ఖండించారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికాలో ఇటీవల ఒక నివేదిక వెలువడటం, దానిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన తరుణంలో గార్సెట్టి శుక్రవారం భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం గమనార్హం. ‘‘ఢిల్లీలో బంధాన్ని అమెరికా వందశాతం విశ్వసిస్తోంది. 21వ శతాబ్దిలో చక్కటి సత్సంబంధాల్లో ఒకటిగా భారత్–అమెరికా బంధం నిలుస్తుంది. అమెరికాలో రెండు కిలోమీటర్లు నడచివెళ్లి ఓటేయడానికి బద్దకిస్తారు. కానీ భారత్‌లో ఎక్కడో కొండల్లో ఉండే మతాధికారి సైతం రెండు రోజులు కాలినడకన వెళ్లి మరీ ఓటు వేస్తారు. ట్రక్కుల్లో అనధికార నగదు తరలింపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఇలాంటి అంశాల్లో అమెరికా కంటే భారత్ మెరుగ్గా పనిచేస్తోంది. కేంద్రప్రభుత్వం లాగే అక్కడి విపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలూ శక్తివంతమైనవే. భారత చరిత్ర చూస్తే అక్కడి అందరి హక్కులకు గౌరవం దక్కుతుంది. మనల్ని మనం ఇష్టపడేకంటే భారతీయులే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఇది నిజంగా అరుదైన విషయం’ అని భారత్‌ను ప్రశంసించారు. -
కంగ్రాట్స్... ఇండియా!!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో.. ముందుగానే అమెరికా అభినందనలు తెలిపింది. ఎన్నికలు విజయవంతంగా ముగించారని, దేశంలో కొత్త ప్రభుత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామని సందేశం పంపింది. ''భారతదేశ ప్రజలు కొత్తగా ఎన్నుకున్న నాయకులతో కలిసి పనిచేయడానికి మేం ఎదురు చూస్తున్నాం. కీలకమైన భాగస్వామ్యంతో అద్భుతమైన జెండా ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నాం'' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకీ విలేకరులతో అన్నారు. అత్యంత స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగడం, వాటిలో అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో భారతదేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. కోట్లాది మంది ఓటర్లు ఆరు వారాల పాటు చాలా ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని, అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ఓట్లు వేశారని, ఇది అద్భుతమని అమెరికా ప్రతినిధి అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించబోతోందని ఆమె జోస్యం చెప్పారు. అయితే బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీయే ప్రధాని కాబోతున్నారంటూ ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. భారత్ లేదా వేరే ఏ దేశంలోనైనా అంతర్గతంగా జరిగే విషయాల్లో తాము వేలు పెట్టబోమని వ్యాఖ్యానించారు. -
భారత్‌లో ఎన్నికలపై అమెరికా ఆసక్తి
మన దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అప్పుడే మన కంటే అమెరికాకు ఎక్కువ తొందరగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత దేవంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే, వాళ్లతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికార యంత్రాంగం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖకు గానీ, అమెరికా ప్రభుత్వానికి గానీ పక్షపాతం ఏమాత్రం లేదని, ఎవరు విజేతలైతే వాళ్లతోనే కలిసి పనిచేస్తాం తప్ప.. ఈసారి ఎవరు విజేతలు కావాలన్న విషయాన్ని తాము పట్టించుకోబోమని చెప్పింది. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, వాళ్లతో కలిసి తాము పనిచేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారీ హార్ఫ్ తెలిపారు.