అ'టెన్షన్' టూర్: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ!
కరాచి: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ ను తూర్పారాపట్టిన కొద్ది గంటలకే.. దాయాది దేశంలో ఆయన పర్యటించనున్నారన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ లో జరగనున్న సార్క్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు అవుతారని పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలే వెల్లడించారు. పాక్ ప్రముఖ మీడియా సంస్థలు మంగళవారం ఈ వార్తలను ప్రచురించాయి. సోమవారం కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత హైకమిషనర్ మోదీ పాక్ పర్యటన సహా పలు అంశాలపై మాట్లాడినట్లు పేర్కొన్నాయి.
'భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను ఊహించలేను. కానీ ప్రస్తుతం మాత్రం ప్రధాని మోదీ ఇస్లామాబాద్ వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పగలను' అని గౌతమ్ వ్యాఖ్యానించారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో కొనసాగుతోన్న ఆందోళనలను, ఆగస్టు 15న ఎర్రకోట పై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత హైకమిషనర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ- ఇస్లామాబాద్ సంబంధాలపై సానుకూల ప్రకటన చేస్తూనే బంబావాలే తన ప్రసంగంలో పాకిస్థాన్ కు చురకలంటించారు.
'అద్దాల మేడల్లో ఉండేవాళ్లు అవతలి వాళ్లపై రాళ్లు విసరకూడదు. ఇరు పక్కలా సమస్యలు ఉండొచ్చు, అయితే పక్కదేశాల గొడవల్లో తల దూర్చడం కంటే పాకిస్థాన్ తనను చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది' అని గౌతమ్ అన్నట్లు పాక్ మీడియా తెలిపింది. కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారత అంతర్గత విషయమని ఆయన నొక్కివక్కాణించినట్లు పేర్కొంది. ఇక బలూచిస్థాన్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన గౌతమ్.. బలూచిస్తానీలు భారత ప్రధానికి రాసిన లేఖల్లోని అంశాలను మాత్రమే మోదీ తన ఆగస్టు 15 ప్రసంగంలో ప్రస్తావించారని చెప్పారు. భారత్- పాకిస్థాన్ ల మధ్య వ్యాపార వాణిజ్యాలు మరింత బలోపేతం కావాల్సిఉన్నదన్న హైకమిషనర్.. పాక్ వ్యాపారవేత్తల బృందం భారత్ లో పర్యటించాలని కోరారు.
భారత ప్రధానమంత్రి కార్యాలయం కూడా హైకమిషర్ గౌతమ్ బంబావాలే వ్యాఖ్యలను ఖండించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి ఆ అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పీఎంఓకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోదీ ఆదివారం చేసిన ప్రసంగంలో పాక్ ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్నదని ఆరోపించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఉద్రికత్తతల మధ్య కిందటి నెలలో ఇస్లామాబాద్ వెళ్లిన భారత హోం మంత్రి రాజ్ నాథ్ అక్కడ నిరసన వ్యక్తం చేసిన సంగతి విదితమే. కశ్మీర్ లో శాంతిని పునరుద్ధరించే దిశగా శని, ఆదివారాల్లో అఖిలపక్ష బృందం జమ్ముకశ్మీర్ లో పర్యటించి పలువురితో చర్చలు జరిపింది. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 70 మంది చనిపోగా, 10వేల మంది గాయపడ్డారు.