Indian National Movement
-
అప్పుడలా! ఇప్పుడు ఎందుకిలా?
భారత జాతీయోద్యమంలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన మహిళలను మగవాళ్లు తమతో సమానంగా గౌరవించారు. ‘మీరు మహిళలు, బలహీనులు, ఉద్యమంలో పోరాడడానికి మీ శక్తిసామర్థ్యాలు సరిపోవు, ఆ బాధ్యత మాకొదిలేయండి’ అన్న మగవాళ్లు లేరు. మహిళాశక్తిని గుర్తించారు అప్పటి వాళ్లు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పనలో మహిళలను సమాన స్థాయిలో గౌరవించారు. సామాజికంగానూ, ఆర్థికంగానూ, రాజకీయంగానూ మహిళలకు సమాన ప్రతిపత్తిని కల్పించారు. అవకాశాలను అందిపుచ్చుకునే దగ్గరకు వచ్చేటప్పటికి మహిళలు ఇంటిపట్టునే ఉండాలన్నది సగటు మేల్ సొసైటీ. క్రమంగా... నిర్ణయాధికారానికి అవసరమైన మేధ మహిళలకు ఉండదనే భావన మగవాళ్ల మాటల్లో వ్యక్తమవసాగింది. మహిళలకు ఉద్యోగాలెందుకు అనే ప్రశ్న నుంచి టీచర్, డాక్టర్ వంటి ఉద్యోగాలైతే మేలన్నారు. ఇంజనీర్లుగా ఆడవాళ్లా? అని పెదవి విరిచారు. పత్రికలలో పని చేస్తారా? రాత్రిళ్లు కూడా పని చేయాలి తెలుసా? అన్నారు. పోలీస్ ఉద్యోగాలు చేయాలంటే యూనిఫామ్ వేసుకోవాలిగా అన్నారు. రక్షణ రంగంలో అడుగుపెట్టాలంటే... తుపాకీ మోస్తారా అన్నట్లు చూశారు. చట్టసభల్లోకి వస్తారా? చట్టం చేయడమంటే పచ్చడి రుబ్బడం కాదంటున్నారు. అటకెక్కిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడానికి ఎవరికీ నోరు పెగలడం లేదు. ఎందుకిలా? ఎందుకిలా? అలనాడు ఏడు దశాబ్దాల కిందట ఉద్యమాలు... యుద్ధాలలో లేని వివక్ష, అసమానత్వం... ఇంత పురోగతి సాధించాక ఇప్పుడు ఎందుకిలా? – మంజీర -
గుర్తుకొస్తున్నాడా! అబ్దుల్ గఫర్ ఖాన్....
సాక్షి, న్యూఢిల్లీ : ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్.... ఈ పేరును ఎప్పుడో, ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఎక్కువ మందికి అనిపించవచ్చు. సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అంటే ‘అవును గదా!’ అని కొద్ది మందికి గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్ రాష్ట్రంలో పంఖ్తూన్ లేదా పఠాన్‌గా పుట్టి జాతిపిత మహాత్మా గాంధీ నిర్దేశించిన అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు మన సరిహద్దు గాంధీ. ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్ కన్నా అహింసా మార్గమే ఆయుధంగా ధరించిన పఠాన్ యమ డేంజర్ అని బ్రిటీష్ పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లో అహింసామార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణచివేసిన, హింసించిన వ్యక్తులను కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతతో ‘కుదాయ్ కిద్మత్ గర్’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు సరిహద్దు గాంధీ. భారత్, పాకిస్థాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సరిహద్దు గాంధీ విభజన సందర్భంగా పంఖ్తూన్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో ముస్లింల దాడుల నుంచి ఎంతో మంది హిందువులు, సిక్కుల మాన ప్రాణాలను కాపాడారు. ఈ విషయంలో ఆయనకు కుదాయ్ కిద్మత్ గర్ సేన కూడా ఎంతో సహాయపడింది. అల్లర్లను ఆపేందుకు ఆయన మహాత్మాగాంధీతో కలసి బీహార్‌కు వెళ్లి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌ను తగులబెడితే హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరం దగ్ధం అవుతామని హెచ్చరించారు. అల్లర్లు, హింసతో ఏమీ సాధించలేమని, అలా సాధించుకున్నది శాశ్వతంగా నిలబడదని కూడా ఆయన ప్రజలకు హితవుచెప్పారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో సంపాదించకున్నది శాశ్వతంగా మిగిలిపోతుందని పిలుపునిచ్చారు. ఇటు బ్రిటీష్ ఇండియాలో, అటూ పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన సరిహద్దు గాంధీ అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం గడిపారు. తుది శ్వాస విడిచేంత వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి జీవించిన గఫర్ ఖాన్ కన్నుమూసి నేటికి సరిగ్గా 30 ఏళ్లు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1988, జనవరి 20వ తేదీన ఆయన మరణించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన ఉట్మంజాయ్ నుంచి పెషావర్ వెళుతుండగా అరెస్ట్ చేశారు. ఇది తెలిసి కుదాయ్ కిద్మత్ గర్ సేన సహా లక్షలాది ప్రజలు పోలీసు స్టేషన్‌ను, పరిసరాలను చుట్టుముట్టారు. వారిపై కాల్పులు జరపాల్సిందిగా బ్రిటీష్ అధికారులు ఉత్తర్వులిచ్చినా ‘కాల్పులు జరిపినా ఫర్వాలేదు. ప్రాణాలిస్తాం.’ అంటూ శాంతియుత నినాదాలతో సమన్వయం పాటించిన ప్రజలపై కాల్పులు జరిపేందుకు సైనికులు నిరాకరించారట. అదే సమయంలో అరెస్టయిన మహాత్మాగాంధీని, ఇతరులను 1931, జనవరి నెలలో విడుదల చేసిన బ్రిటిష్ పాలకులు ఖాన్‌ను విడుదల చేయలేదు. చివరకు ఆయన్ని గాంధీయే విడిపించారు. అప్పటికి విడిచిపెట్టిన బ్రిటీష్ అధికారులు ఆయన్ని మళీ అరెస్ట్ చేసి నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో కుదాయ్ కిద్మత్ గర్‌కు ప్రజల్లో ఎంత ఆదరణ ఉండేదంటే, 1946లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్యానర్ కింద పోటీ చేసిన కిద్మత్ గర్ సేనకు 30 సీట్లు రాగా, ముస్లిం లీగ్‌కు కేవలం 17 సీట్లు వచ్చాయి. అంతకుముందు ఒక్క సీటును కూడా దక్కించుకోని ముస్లిం లీగ్ పాకిస్థాన్ విభజన తీర్మానం ద్వారా ఆ మాత్రం సీట్లను దక్కించుకుంది. మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఖాన్ చివరకు నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకే వదిలేశారు. ఆ సమావేశం అత్యధిక మెజారిటీతో దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశంలో గఫర్ ఖాన్‌తో పాటు మహాత్మాగాంధీ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్‌లు పాల్గొనలేదు. ‘మీకు అండగా నిలబడ్డాం. మీతో పాటు పఠాన్లు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరకు మీరు మమ్మల్ని నక్కల పాలు చేశారు’ అని సీడబ్ల్యూసీను ఉద్దేశించి ఖాన్ వ్యాఖ్యానించారట. ‘పాక్‌లో ఉంటారా, భారత్‌లో ఉంటారా? అని తేల్చుకోమన్నారనే గానీ స్వతంత్య్ర భారతదేశంలో ఉంటారా? అంటూ మాకు మరో ఆప్షన్ ఇవ్వలేదు’ అని ఖాన్ తన బాధను వ్యక్తం చేస్తూ దేశ విభజన అనంతరం పెషావర్‌కే పరిమితం అయ్యారు. అక్కడి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. 1960వ దశకంలో జైలు నుంచి విడుదలయ్యాక అఫ్ఘాన్‌కు ప్రవాసం వెళ్లారు. 1969లో మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గఫర్ ఖాన్ భారత్‌కు వచ్చారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అహ్మదాబాద్‌తోపాటు దేశంలోని పలు చోట్ల హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఆయన సరాసరి అహ్మదాబాద్ వెళ్లి అక్కడ అల్లర్లను ఆపేందుకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అల్లర్ల అనంతరం హిందూ ప్రాంతాల్లో, హిందువులు, ముస్లిం ప్రాంతాల్లో ముస్లింలు సహాయక చర్యల్లో పాల్గొనడం చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి అంతర్జాతీయ అవగాహన కింద ఇచ్చే ‘జవహర్ లాల్ నెహ్రూ అవార్డు’ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఈ దేశంలో ఉండాలంటే అంటరాని వారిగా అణగిమణగి ఉండండి లేదా పాకిస్థాన్ వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని ఓ ముస్లిం బాలిక చెప్పడం బాధేసింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు మరచిపోతున్న మన సరిహద్దు గాంధీని కూడా గుర్తు చేద్దామనే ఈ వార్తా కథనం. (గమనిక: ‘గఫర్ ఖాన్: నాన్ వాయలెంట్ బాద్షా ఆఫ్ పంఖ్తూన్’ పేరిట రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
ఉద్యమ నాయిక!
స్ఫూర్తి రాజ్‌కుమారి అమృత్ కౌర్ రాజ్‌కుమారి అమృత్ కౌర్... భారత జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళల్లో ఒకరు. ఆమె 1822లో లక్నోలో పుట్టారు. వారిది కపుర్తల రాజకుటుంబం. ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు, సాంఘిక సంస్కర్త. గాంధీ బాటలో హరిజన ఉద్ధరణకు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. జలియన్‌వాలాబాగ్ దురంతం రాజ్‌కుమారిని కలచివేసింది. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై స్వాతంత్య్రోద్యమంలో చొరవగా పాల్గొన్నారామె. దండి సత్యాగ్రహం సందర్భంగా 1930లో ఆమెను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. ఆ తర్వాత ఏడేళ్లకు ఆయుధాలు రవాణా చేస్తున్నారనే నెపం మోపి ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు. అప్పుడామె మూడేళ్ల కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమంలో భాగంగా రాజ్‌కుమారి దేశమంతటా పర్యటించారు. అంటరానితన నిర్మూలన అవసరాన్ని వివరించారు. ఆమె వెళ్లిన ప్రతిచోటా మహిళలతో ఓ చిన్న సమూహాన్ని ఏర్పరిచి చదువకు బీజాలు వేశారు. రాజకుటుంబంలో పుట్టిన యువరాణి సామాన్యుల కోసం ఉద్యమించడం, సామాన్యులతో కలిసి పని చేయడం వల్ల ఆమె స్ఫూర్తితో అనేకమంది ఉద్యమబాటపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్‌కుమారి కౌర్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఉన్న అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్) ఆమె చొరవతోనే ఏర్పాటైంది. -
‘సమాచార దర్పణ్’ ఎవరి కాలంలో ప్రచురితమైంది?
భారత జాతీయోద్యంలో పత్రికల పాత్ర పత్రికలు భారత జాతీయోద్యమంలో కీలక పాత్రను పోషించాయి. మొగలుల కాలంలో ‘అక్బరాత్’, ‘వఖియనివాస్’ అనే పత్రికల ద్వారా వార్తా కథనాలను చక్రవర్తికి అందించేవారు. 1557లో పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫెన్సో కాలంలో గోవాలో పత్రికా ముద్రణను ప్రవేశపెట్టారు. మొదట్లో పాలకుల అభిప్రాయ వేదికలుగా గుర్తింపు పొందిన పత్రికలు ఆ తర్వాత సంఘ సంస్కరణ, సమాజహితం, నవభావన వేదికలుగా, అభ్యుదయ భావ వీచికలుగా, మితవాద, అతివాద, విప్లవవాద, గాంధీ సత్యాగ్రహం ఆలోచనా దీప్తులుగా పనిచేశాయి. సామాన్య ప్రజల్లో ఆలోచనా పరిజ్ఞానాన్ని మేల్కోలిపాయి. 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఆంగ్లేయుడు ‘బెంగాల్ గెజిట్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. తర్వాత కలకత్తా సమీపంలోని ‘శేరంపూర్’లోని క్రైస్తవ మిషన ‘దిగ్దర్శన’(మాసపత్రిక), ‘సమాచార దర్శన’ అనే బెంగాలీ పత్రికలను స్థాపించింది. 1816లో ‘గంగాధర భట్టాచార్య’ ‘బెంగాల్ గెజిట్’ అనే పత్రికను ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీ స్థాపించిన ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’ 1869లో సామ్యూల్ క్లర్క ప్రారంభించిన ‘స్టేట్స్‌మెన్’ అనే పత్రికలో విలీనమైంది. తర్వాత సామాజిక సంస్కరణలే ధ్యేయంగా రాజా రామ్మోహన్రాయ్ 1821లో ‘సంవాద కౌముది’ అనే వారపత్రికను స్థాపించి, సతీ సహగమన నిషేధం, బాల్య వివాహాల రద్దు, ఏకేశ్వరోపాసనల గురించి ప్రముఖంగా ప్రచారం చేశారు. రాయ్ ఆధునిక భావాలను వ్యతిరేకిస్తూ పోటీగా ‘రాధాకాంత్ దేవ్’ సనాతన సాంప్రదాయ వాదుల మద్దతుతో ‘సమాచార చంద్రిక’ను స్థాపించారు. దాంతో రాయ్ ద్వారకానాథ్ ఠాగూర్ సహాయంతో ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, పారశీక భాషల్లో, ఆధునిక భావాల ప్రచారం కోసం ‘వంగదూత’, ‘మిరాతుల్ అక్బర్’, ‘కువ్వత్ - ఉల్ - మువాహిద్దీన్’ లాంటి పత్రికలను ప్రారంభించారు. వీటిని పోలిన ‘జ్ఞానాన్వేషి’ అనే పత్రిక సమాజంలో విశేష ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ అధికారుల అవినీతి కార్యకలాపాలను విమర్శిస్తూ యువతరం పత్రిక ‘ఎన్‌క్వైరర్’ అభ్యుదయ భావాలను ప్రచారం చేసింది. ‘సంవాద పూర్ణ చంద్రోదయం’ అనే పత్రికలో సనాతన వాదులు మత విషయాలను చర్చించేవారు. తర్వాత దీనినే రాజకీయ దినపత్రికగా ప్రారంభించారు. బంకించంద్ర చటోపాధ్యాయ ‘నీలిదర్పణ్’ పత్రికను ప్రారంభించారు. దీనికి ‘దీనబంధుమిత్ర’ ఎడిటర్‌గా వ్యవహరించారు. నీలిమందు రైతుల సమస్యలను ఈ పత్రికలో వ్యాసాల రూపంలో ప్రముఖంగా ప్రస్తా వించేవారు. 1826లో కాన్పూర్ నుంచి వెలువడిన ‘ఉదాంత మార్తాండం’ అనే తొలి హిందీ పత్రిక పరిసర ప్రాంతాల ప్రజల సమస్యలను బ్రిటిష్ పాలకుల దృష్టికి తీసుకొచ్చింది. బొంబాయి రాష్ర్టంలో 1822లో దాదాభాయ్ నౌరోజీ నాయకత్వంలో ‘రస్త్గఫ్తార్’ అనే పత్రిక గుజరాతీ భాషలో వెలువడింది. 1832లో మరాఠీ భాషలో వెలువడిన ‘బొంబాయి దర్పణ్’ పత్రికలో ఆంగ్లభాష విశిష్టత, బ్రిటిషర్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను బాలశాస్త్రి జంబేకర్ చర్చించారు. బాలశాస్త్రి అనుచరుడు ఛాల్ మహాజన్ ‘ప్రభువర్’ అనే పత్రికను స్థాపించి సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 1842లో పుణే నుంచి క్రైస్తవ మిషనరీలు ‘జ్ఞానోదయం’ అనే పత్రికను ప్రారంభించాయి. 1848లో పుణే నుంచే వెలువడిన ‘జ్ఞానప్రకాశీ’ తొలి మరాఠీ పత్రికగా ప్రసిద్ధి చెందింది. తిలక్, వాసుదేవ అగార్కర్‌లు కలిసి పుణే నుంచి 1881 లో ‘మరాఠీ’ (ఆంగ్లపత్రిక), ‘కేసరి’(మరాఠీ) పత్రికలను నిర్వహించి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించడమే కాకుండా, విప్లవ వాదులను సమర్థించినందుకు 1897లో 18 నెలలు జైలుశిక్ష అనుభవించారు. మద్రాస్ రాష్ర్టంలో గాజుల లక్ష్మీనరసుశెట్టి ‘క్రీసెంట్’ అనే పక్ష పత్రికలో బ్రిటిషర్ల దమన నీతిని విమర్శించారు. తర్వాత తెలుగులో వెలువడిన ‘వృత్తాంతిని’ (1838-51), ‘వర్తమాన’, ‘తరంగిణి’ (1848-52) పత్రికలు సామాజిక సమస్యలపై పోరాడాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1830లో బళ్లారి క్రైస్తవ మిషనరీ ‘సత్యదూత’ అనే తొలి తెలుగు పత్రికను ప్రారంభించింది. 1875 లో సుబ్రమణ్య అయ్యర్, కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో వెలువడిన ‘ది హిందూ’ పత్రిక భారత జాతిని స్వాతంత్య్ర సమరానికి సన్నద్ధ్దం చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెలు వడిన తొలి తెలుగు రాజకీయ పత్రిక ‘ఆంధ్రప్రకాశిక’, ‘స్వదేశీ మిత్రన్’ పత్రి కలు కూడా అదే బాటలో పయనించాయి. బిటిషర్ల పరిపాలనను సుస్థిరం చేయ డానికి అధికారేతర బ్రిటిషర్లు కొన్ని పత్రికలు స్థాపించారు. అలాంటి వాటిలో ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’, ‘సర్కార్’, ‘బాంబేటైమ్స్’, ‘మద్రాస్ యునెటైడ్ సర్వీస్ గెజిట్’, ‘లాహోర్ క్రానికల్’, ‘సిటీగడో’, ‘మద్రాస్ స్పెక్టేటర్’లు ముఖ్య మైనవి. ఈ పత్రికలు బ్రిటిష్ పాలనకు అనుకూల వాతావరణాన్ని కల్పించేలా భారతీయ సమాజాన్ని ఉత్తేజ పరుస్తూ రచనలు సాగించాయి. ఈ పద్ధతిని ‘పత్రికా స్వేచ్ఛపిత’గా ప్రసిద్ది చెందిన మెట్కాఫ్ నిరసించాడంటే వాటి ధోరణిని అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికలు బ్రిటిష్ సామ్రాజ్య తత్వాన్ని ప్రచారం చేశాయి. 1861లో బొంబాయి నుంచి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, 1865లో అలహాబాద్ నుంచి ‘పయనీర్’, 1868లో మద్రాస్ నుంచి ‘మద్రాస్ మెయిల్’ (ఇది దేశంలో తొలి సాయంకాలం పత్రిక), లాహోర్ నుంచి ‘సివిల్ మిలటరీ గెజిట్’లు ఈ కాలంలో వచ్చిన మరికొన్ని ముఖ్యమైన పత్రికలు. తర్వాత కాలంలో బెంగాల్ నుంచి నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో వెలువడిన ‘ఇండియన్ మిర్రర్’ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, భారతీయుల రాజకీయ హక్కుల కోసం పోరాటం సాగించింది. 1868లో శిశిర్‌కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో ‘అమృతబజార్ ’ , ‘సమాచార దర్పణ్’ పత్రికలు బ్రిటిషర్ల ఆర్థిక దోపిడీని విమర్శించాయి. ‘సంధ్య, యుగాంతర్, బందీ జీవన్, ఘదర్’ లాంటి పత్రికలు బ్రిటిష్ సామ్రాజ్య సౌధాలను పునాదులతో సహా పెకిలించాలని, అందుకు సాయుధ తిరుగుబాటుకుభారతీయులు సన్నద్ధం కావాలని ప్రేరేపించాయి. పార్శీ, ఉర్దూ పత్రికలైన ‘మహెఆలం’, ‘అఫ్రోజ్’, గోఖలే ఆధ్వర్యంలో వెలువడిన ‘సుధాకర్’ పత్రికలు ప్రజా హక్కుల పరిరక్షణ, మితవాద ధోరణిని ప్రతిబింబించగా ‘ఇండియన్ మిర్రర్’, ‘వాయిస్ ఆఫ్ ఇండియా’; అరబిందో ఘోష్, రాస్ బిహారీ ఘోష్‌ల పెట్రియాట్, హిందూప్రకాష్, సోంప్రకాష్ పత్రికలు జాతీయతను రగిలించాయి. 1878లో లార్డ లిట్టన్ ప్రాంతీయ భాష పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టి స్వేచ్ఛను హరించాడు. 1882లో రిప్పన్ దేశీయభాషా చట్టాన్ని రద్దు చేసి పత్రికలకు స్వేచ్ఛ కలిగించాడు. ఉర్దూలో షంగుల్ అక్బర్, జుంబాల్ ఉల్ అక్బర్, సిరాజ్ - ఉల్ అక్బర్, ఢిల్లీ అక్బర్, సయ్యద్ అక్బర్ పత్రికలు సాంఘిక, మత పునరుజ్జీవానికి కృషి చేశాయి. మిరాతుల్ అక్బర్, జియ జహనామా పత్రికలు హిందూ - ముస్లింల సమైక్యతకు కృషి చేశాయి. తెలుగులో కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని, సత్య సంవర్ధిని, సతీహిత బోధిని’ పత్రికలను ప్రారంభించి ‘ఆధునిక ఆంధ్రదేశపిత’గా పేరు గాంచారు. రాయస వేంకటశివుడి ‘జనానా, ‘సుజన మనోవిలాసిని’, అమృతబోధిని’ పత్రికలు సాంఘిక దురాచారాలపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాలు. తెలంగాణలో ‘గోల్కొండ’ (సురవరం ప్రతాపరెడ్డి ఎడిటర్), ‘మిజాన్’, ‘నీలగిరి’ , షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ పత్రికలు నాటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాయి. భారతీయ పత్రికలు 1823లో ఆడమ్స్ ఆంక్షల నుంచి లిట్టన్ ప్రతిబంధకాల వరకు సమస్యలన్నింటినీ అధిగమించి భారత స్వాతంత్య్ర సాధనలో బహుముఖ పాత్రను పోషించాయి. మాదిరి ప్రశ్నలు 1. వీటిలో సరికానిది? (2002 సివిల్స్) 1) సమాచర దర్పణ్ - మార్సమన్ 2) మిరాతుల్ అక్బర్- రామ్మోహన్ రాయ్ 3) స్వదేశీ మిత్రన్ - సుబ్రమణ్యం 4) నీల్ దర్పణ్ - శిశిర్ కుమార్ ఘోష్ 2. భారతదేశంలో పత్రికా ముద్రణాయం త్రాన్ని ప్రవేశపెట్టినవారు? 1) బ్రిటిషర్లు 2) పోర్చుగీస్ 3) డచ్చి 4) ఫ్రెంచివారు 3. దేశంలో తొలి ‘సాయంకాలపు పత్రిక’ ఏది? 1) బొంబాయి క్రానికల్ 2) మద్రాస్ క్రానికల్ 3) మద్రాస్ మెయిల్ 4) బెంగాల్ గెజిట్ 4. ‘ది హిందూ’ (1875) పత్రిక ఎడిటర్లుగా పనిచేసిన వారు? 1) సుబ్రమణ్యం అయ్యర్, పద్మనాభన్ పిళ్లై 2) కస్తూరీ రంగన్ - సుబ్రమణ్యం 3) కస్తూరీ రంగన్ - పద్మనాభన్ 4) పద్మనాభన్ - రాజమార్తాండ 5. ‘బెంగాలీ విభజనను’ తొలిసారిగా ప్రచురించిన పత్రిక ఏది? 1) బెంగాల్ గెజిట్ 2) నీల్ దర్పణ్ 3) ఇండియన్ హెరాల్డ్ 4) అమృతబజార్ 6. ‘సమాచార దర్పణ్’ పత్రిక ఎవరి కాలంలో ప్రచురితమైంది? 1) లార్డ కర్జన్ 2) విలియం బెంటింగ్ 3) లార్డమింటో 4) వారన్ హేస్టింగ్స 7. కిందివాటిలో సరైన జత? 1) దీన్ మిత్ర - ముకుంద్‌రావు పాటిల్ 2) సత్య దూత - గంగాధర భట్టాచార్య 3) సమాచార చంద్రిక - రాజా రామ్మోహన్ రాయ్ 4) బొంబాయి దర్పణ్ - చాల్మహాజన్ 8. నీలిమందు రైతుల సమస్యలను వివరించిన పత్రిక ఏది? 1) నీల్ దర్పణ్ 2) ఉదాంత మార్తాండం 3) జ్ఞానోదయం 4) పైవన్నీ సమాధానాలు 1) 4; 2) 2; 3) 3; 4) 2; 5) 4; 6) 4; 7) 1; 8) 1.