‘సమాచార దర్పణ్’ ఎవరి కాలంలో ప్రచురితమైంది?
భారత జాతీయోద్యంలో పత్రికల పాత్ర
పత్రికలు భారత జాతీయోద్యమంలో కీలక పాత్రను పోషించాయి. మొగలుల కాలంలో ‘అక్బరాత్’, ‘వఖియనివాస్’ అనే పత్రికల ద్వారా వార్తా కథనాలను చక్రవర్తికి అందించేవారు. 1557లో పోర్చుగీస్ గవర్నర్ ఆల్‌ఫెన్సో కాలంలో గోవాలో పత్రికా ముద్రణను ప్రవేశపెట్టారు. మొదట్లో పాలకుల అభిప్రాయ వేదికలుగా గుర్తింపు పొందిన పత్రికలు ఆ తర్వాత సంఘ సంస్కరణ, సమాజహితం, నవభావన వేదికలుగా, అభ్యుదయ భావ వీచికలుగా, మితవాద, అతివాద, విప్లవవాద, గాంధీ సత్యాగ్రహం ఆలోచనా దీప్తులుగా పనిచేశాయి. సామాన్య ప్రజల్లో ఆలోచనా పరిజ్ఞానాన్ని మేల్కోలిపాయి. 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఆంగ్లేయుడు ‘బెంగాల్ గెజిట్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. తర్వాత కలకత్తా సమీపంలోని ‘శేరంపూర్’లోని క్రైస్తవ మిషన ‘దిగ్దర్శన’(మాసపత్రిక), ‘సమాచార దర్శన’ అనే బెంగాలీ పత్రికలను స్థాపించింది.
1816లో ‘గంగాధర భట్టాచార్య’ ‘బెంగాల్ గెజిట్’ అనే పత్రికను ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీ స్థాపించిన ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’ 1869లో సామ్యూల్ క్లర్‌క ప్రారంభించిన ‘స్టేట్స్‌మెన్’ అనే పత్రికలో విలీనమైంది. తర్వాత సామాజిక సంస్కరణలే ధ్యేయంగా రాజా రామ్మోహన్‌రాయ్ 1821లో ‘సంవాద కౌముది’ అనే వారపత్రికను స్థాపించి, సతీ సహగమన నిషేధం, బాల్య వివాహాల రద్దు, ఏకేశ్వరోపాసనల గురించి ప్రముఖంగా ప్రచారం చేశారు. రాయ్ ఆధునిక భావాలను వ్యతిరేకిస్తూ పోటీగా ‘రాధాకాంత్ దేవ్’ సనాతన సాంప్రదాయ వాదుల మద్దతుతో ‘సమాచార చంద్రిక’ను స్థాపించారు.
దాంతో రాయ్ ద్వారకానాథ్ ఠాగూర్ సహాయంతో ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, పారశీక భాషల్లో, ఆధునిక భావాల ప్రచారం కోసం ‘వంగదూత’, ‘మిరాతుల్ అక్బర్’, ‘కువ్వత్ - ఉల్ - మువాహిద్దీన్’ లాంటి పత్రికలను ప్రారంభించారు. వీటిని పోలిన ‘జ్ఞానాన్వేషి’ అనే పత్రిక సమాజంలో విశేష ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ అధికారుల అవినీతి కార్యకలాపాలను విమర్శిస్తూ యువతరం పత్రిక ‘ఎన్‌క్వైరర్’ అభ్యుదయ భావాలను ప్రచారం చేసింది. ‘సంవాద పూర్ణ చంద్రోదయం’ అనే పత్రికలో సనాతన వాదులు మత విషయాలను చర్చించేవారు. తర్వాత దీనినే రాజకీయ దినపత్రికగా ప్రారంభించారు.
బంకించంద్ర చటోపాధ్యాయ ‘నీలిదర్పణ్’ పత్రికను ప్రారంభించారు. దీనికి ‘దీనబంధుమిత్ర’ ఎడిటర్‌గా వ్యవహరించారు. నీలిమందు రైతుల సమస్యలను ఈ పత్రికలో వ్యాసాల రూపంలో ప్రముఖంగా ప్రస్తా వించేవారు. 1826లో కాన్పూర్ నుంచి వెలువడిన ‘ఉదాంత మార్తాండం’ అనే తొలి హిందీ పత్రిక పరిసర ప్రాంతాల ప్రజల సమస్యలను బ్రిటిష్ పాలకుల దృష్టికి తీసుకొచ్చింది.
బొంబాయి రాష్ర్టంలో 1822లో దాదాభాయ్ నౌరోజీ నాయకత్వంలో ‘రస్త్‌గఫ్తార్’ అనే పత్రిక గుజరాతీ భాషలో వెలువడింది. 1832లో మరాఠీ భాషలో వెలువడిన ‘బొంబాయి దర్పణ్’ పత్రికలో ఆంగ్లభాష విశిష్టత, బ్రిటిషర్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను బాలశాస్త్రి జంబేకర్ చర్చించారు.
బాలశాస్త్రి అనుచరుడు ఛాల్ మహాజన్ ‘ప్రభువర్’ అనే పత్రికను స్థాపించి సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 1842లో పుణే నుంచి క్రైస్తవ మిషనరీలు ‘జ్ఞానోదయం’ అనే పత్రికను ప్రారంభించాయి. 1848లో పుణే నుంచే వెలువడిన ‘జ్ఞానప్రకాశీ’ తొలి మరాఠీ పత్రికగా ప్రసిద్ధి చెందింది. తిలక్, వాసుదేవ అగార్కర్‌లు కలిసి పుణే నుంచి 1881 లో ‘మరాఠీ’ (ఆంగ్లపత్రిక), ‘కేసరి’(మరాఠీ) పత్రికలను నిర్వహించి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించడమే కాకుండా, విప్లవ వాదులను సమర్థించినందుకు 1897లో 18 నెలలు జైలుశిక్ష అనుభవించారు.
మద్రాస్ రాష్ర్టంలో గాజుల లక్ష్మీనరసుశెట్టి ‘క్రీసెంట్’ అనే పక్ష పత్రికలో బ్రిటిషర్ల దమన నీతిని విమర్శించారు. తర్వాత తెలుగులో వెలువడిన ‘వృత్తాంతిని’ (1838-51), ‘వర్తమాన’, ‘తరంగిణి’ (1848-52) పత్రికలు సామాజిక సమస్యలపై పోరాడాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1830లో బళ్లారి క్రైస్తవ మిషనరీ ‘సత్యదూత’ అనే తొలి తెలుగు పత్రికను ప్రారంభించింది. 1875 లో సుబ్రమణ్య అయ్యర్, కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో వెలువడిన ‘ది హిందూ’ పత్రిక భారత జాతిని స్వాతంత్య్ర సమరానికి సన్నద్ధ్దం చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెలు వడిన తొలి తెలుగు రాజకీయ పత్రిక ‘ఆంధ్రప్రకాశిక’, ‘స్వదేశీ మిత్రన్’ పత్రి కలు కూడా అదే బాటలో పయనించాయి.
బిటిషర్ల పరిపాలనను సుస్థిరం చేయ డానికి అధికారేతర బ్రిటిషర్లు కొన్ని పత్రికలు స్థాపించారు. అలాంటి వాటిలో ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’, ‘సర్కార్’, ‘బాంబేటైమ్స్’, ‘మద్రాస్ యునెటైడ్ సర్వీస్ గెజిట్’, ‘లాహోర్ క్రానికల్’, ‘సిటీగడో’, ‘మద్రాస్ స్పెక్టేటర్’లు ముఖ్య మైనవి. ఈ పత్రికలు బ్రిటిష్ పాలనకు అనుకూల వాతావరణాన్ని కల్పించేలా భారతీయ సమాజాన్ని ఉత్తేజ పరుస్తూ రచనలు సాగించాయి. ఈ పద్ధతిని ‘పత్రికా స్వేచ్ఛపిత’గా ప్రసిద్ది చెందిన మెట్‌కాఫ్ నిరసించాడంటే వాటి ధోరణిని అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికలు బ్రిటిష్ సామ్రాజ్య తత్వాన్ని ప్రచారం చేశాయి. 1861లో బొంబాయి నుంచి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, 1865లో అలహాబాద్ నుంచి ‘పయనీర్’, 1868లో మద్రాస్ నుంచి ‘మద్రాస్ మెయిల్’ (ఇది దేశంలో తొలి సాయంకాలం పత్రిక), లాహోర్ నుంచి ‘సివిల్ మిలటరీ గెజిట్’లు ఈ కాలంలో వచ్చిన మరికొన్ని ముఖ్యమైన పత్రికలు.
తర్వాత కాలంలో బెంగాల్ నుంచి నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో వెలువడిన ‘ఇండియన్ మిర్రర్’ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, భారతీయుల రాజకీయ హక్కుల కోసం పోరాటం సాగించింది. 1868లో శిశిర్‌కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో ‘అమృతబజార్ ’ , ‘సమాచార దర్పణ్’ పత్రికలు బ్రిటిషర్ల ఆర్థిక దోపిడీని విమర్శించాయి. ‘సంధ్య, యుగాంతర్, బందీ జీవన్, ఘదర్’ లాంటి పత్రికలు బ్రిటిష్ సామ్రాజ్య సౌధాలను పునాదులతో సహా పెకిలించాలని, అందుకు సాయుధ తిరుగుబాటుకుభారతీయులు సన్నద్ధం కావాలని ప్రేరేపించాయి.
పార్శీ, ఉర్దూ పత్రికలైన ‘మహెఆలం’, ‘అఫ్రోజ్’, గోఖలే ఆధ్వర్యంలో వెలువడిన ‘సుధాకర్’ పత్రికలు ప్రజా హక్కుల పరిరక్షణ, మితవాద ధోరణిని ప్రతిబింబించగా ‘ఇండియన్ మిర్రర్’, ‘వాయిస్ ఆఫ్ ఇండియా’; అరబిందో ఘోష్, రాస్ బిహారీ ఘోష్‌ల పెట్రియాట్, హిందూప్రకాష్, సోంప్రకాష్ పత్రికలు జాతీయతను రగిలించాయి. 1878లో లార్‌డ లిట్టన్ ప్రాంతీయ భాష పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టి స్వేచ్ఛను హరించాడు. 1882లో రిప్పన్ దేశీయభాషా చట్టాన్ని రద్దు చేసి పత్రికలకు స్వేచ్ఛ కలిగించాడు.
ఉర్దూలో షంగుల్ అక్బర్, జుంబాల్ ఉల్ అక్బర్, సిరాజ్ - ఉల్ అక్బర్, ఢిల్లీ అక్బర్, సయ్యద్ అక్బర్ పత్రికలు సాంఘిక, మత పునరుజ్జీవానికి కృషి చేశాయి. మిరాతుల్ అక్బర్, జియ జహనామా పత్రికలు హిందూ - ముస్లింల సమైక్యతకు కృషి చేశాయి.
తెలుగులో కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని, సత్య సంవర్ధిని, సతీహిత బోధిని’ పత్రికలను ప్రారంభించి ‘ఆధునిక ఆంధ్రదేశపిత’గా పేరు గాంచారు. రాయస వేంకటశివుడి ‘జనానా, ‘సుజన మనోవిలాసిని’, అమృతబోధిని’ పత్రికలు సాంఘిక దురాచారాలపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాలు.
తెలంగాణలో ‘గోల్కొండ’ (సురవరం ప్రతాపరెడ్డి ఎడిటర్), ‘మిజాన్’, ‘నీలగిరి’ , షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ పత్రికలు నాటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాయి. భారతీయ పత్రికలు 1823లో ఆడమ్స్ ఆంక్షల నుంచి లిట్టన్ ప్రతిబంధకాల వరకు సమస్యలన్నింటినీ అధిగమించి భారత స్వాతంత్య్ర సాధనలో బహుముఖ పాత్రను పోషించాయి.
మాదిరి ప్రశ్నలు
1. వీటిలో సరికానిది? (2002 సివిల్స్)
1) సమాచర దర్పణ్ - మార్‌సమన్
2) మిరాతుల్ అక్బర్- రామ్మోహన్ రాయ్
3) స్వదేశీ మిత్రన్ - సుబ్రమణ్యం
4) నీల్ దర్పణ్ - శిశిర్ కుమార్ ఘోష్
2. భారతదేశంలో పత్రికా ముద్రణాయం త్రాన్ని ప్రవేశపెట్టినవారు?
1) బ్రిటిషర్లు 2) పోర్చుగీస్
3) డచ్చి 4) ఫ్రెంచివారు
3. దేశంలో తొలి ‘సాయంకాలపు పత్రిక’ ఏది?
1) బొంబాయి క్రానికల్
2) మద్రాస్ క్రానికల్
3) మద్రాస్ మెయిల్ 4) బెంగాల్ గెజిట్
4. ‘ది హిందూ’ (1875) పత్రిక ఎడిటర్లుగా పనిచేసిన వారు?
1) సుబ్రమణ్యం అయ్యర్, పద్మనాభన్ పిళ్లై
2) కస్తూరీ రంగన్ - సుబ్రమణ్యం
3) కస్తూరీ రంగన్ - పద్మనాభన్
4) పద్మనాభన్ - రాజమార్తాండ
5. ‘బెంగాలీ విభజనను’ తొలిసారిగా ప్రచురించిన పత్రిక ఏది?
1) బెంగాల్ గెజిట్ 2) నీల్ దర్పణ్
3) ఇండియన్ హెరాల్డ్
4) అమృతబజార్
6. ‘సమాచార దర్పణ్’ పత్రిక ఎవరి కాలంలో ప్రచురితమైంది?
1) లార్‌డ కర్జన్ 2) విలియం బెంటింగ్
3) లార్‌డమింటో 4) వారన్ హేస్టింగ్‌స
7. కిందివాటిలో సరైన జత?
1) దీన్ మిత్ర - ముకుంద్‌రావు పాటిల్
2) సత్య దూత - గంగాధర భట్టాచార్య
3) సమాచార చంద్రిక - రాజా రామ్మోహన్ రాయ్
4) బొంబాయి దర్పణ్ - చాల్‌మహాజన్
8. నీలిమందు రైతుల సమస్యలను వివరించిన పత్రిక ఏది?
1) నీల్ దర్పణ్ 2) ఉదాంత మార్తాండం
3) జ్ఞానోదయం 4) పైవన్నీ
సమాధానాలు
1) 4; 2) 2; 3) 3; 4) 2;
5) 4; 6) 4; 7) 1; 8) 1.