విజయవాడ సిటీ : బాలల హక్కుల పరిరక్షణపై విస్తృత ప్రచారం కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం కమిషన్ సభ్యులు విద్య, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పోలీసు, కార్మిక, వికలాంగ శాఖలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా సంస్థ, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కమిషన్ సభ్యులు ఎం.డి. రహిముద్దీన్ , ఎం. సుమిత్ర, ఎస్.మురళీధర్‌రెడ్డి, డాక్టర్ మమత, రఘువీర్, ఎస్.బాలరాజు సమీక్షా సమావేశంలో పాల్గొని బాలల హక్కుల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ బాలల పరిరక్షణలో భాగంగా విముక్తి కల్పించిన బాలలు తమ స్వశక్తితో నిలబడే వరకూ సంరక్షణా బాధ్యతలను తప్పక తీసుకోవాలన్నారు.
దేశ జనాభాలో 40 శాతం ఉన్న బాలల హక్కులను కాపాడాల్సిన బృహత్తర బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. బాలలకు విద్యా హక్కు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, బాలల లైంగిక వేధింపులు, తదితర అంశాలపై సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. మరుగదొడ్లు లేని పాఠశాలల్లో వెంటనే నిర్మించాలని సూచించారు.
ప్రతీ నెల సంబంధిత శాఖల అధికారులు సమావేశాలు నిర్వహించి బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వారు సూచించారు. వసతి గృహాలలో తప్పనిసరిగా బాలల హక్కులను తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని, వారికి కలిగే ఇబ్బందులపై ఎవరికి ఫిర్యాదు చేయాలో ఆ బోర్డులపై సూచించాలని చెప్పారు. సమీక్షా సమావేశానికి హాజరైన విజయవాడ సబ్‌కలెక్టర్ డి. హరిచందన మాట్లాడుతూ బాలల హక్కులపై అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంతోపాటు కమిషనర్ సూచనలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నామన్నారు.
బాలల హక్కుల పరిరక్షణలో జిల్లా అధికారులు, సిబ్బంది నిర్లక్ష ధోరణి ప్రదర్శిస్తే పరిపాలనాపరమైన చర్యలకు వెనుకాడబోమని కమిషన్ సభ్యులకు సబ్‌కలెక్టర్ వెల్లడించారు. జిల్లా విద్యాశాఖాధికారి డి. దేవానందరెడ్డి మాట్లాడతూ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారిణి జె. సరసజాక్షి పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయాన్ని, భ్రూణ హత్యల నివారణకు జిల్లాలో 14 క్లస్టర్ అధికారులను నియమించి స్కానింగ్ సెంటర్ల తనిఖీకి తీసుకున్న చర్యలు వివరించారు.
నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు డైరక్టర్ డి. ఆంజనేయరెడ్డి, జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ నగేష్ మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాల కార్మిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో 121 బాల్య వివాహాలను నిరోధించటంతోపాటు, బాల కార్మికులను రక్షించి యజమానుల నుంచి జరిమానాలు వసూలు చేశామన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ బి.డి.వి. సాగర్ మాట్లాడుతూ బాలల హక్కుల సంరక్షణకు తమ శాఖ అన్ని వేళలా సహాయ సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో ఏలూరు రీజియన్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సూయిజ్, వాసవ్య మహిళామండలి చైర్‌పర్సన్ డాక్టర్ రష్మి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారిణి కె. కృష్ణకుమారి, వికలాం గుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.వి.వి.ఎస్.నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులపై విస్తృత ప్రచారం చేయాలి
Published Thu, Jun 19 2014 1:31 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement