Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన.
‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి.
నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది...
దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది.
‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది.
2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.
యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు.
పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది.
అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత.
సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ.
‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత.
ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి.
‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది.
తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా.
అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది.