‘ఆసియా’లో అసలు పరీక్ష
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. అయితే ఈ పోటీల్లో ప్రమాణాల స్థాయిని బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతం వచ్చిన పతకాలు కాస్త నిరాశనే కలిగించాయి. ఎందుకంటే భారత క్రీడాకారులకు అసలు సవాల్ వచ్చే నెలలో జరిగే ఆసియాగేమ్స్‌లో ఎదురుకానుంది. కామన్వెల్త్‌తో పోలిస్తే అక్కడ పోటీ, ప్రమాణాలు చాలా ఎక్కువ. కాబట్టి కామన్వెల్త్లో ఏం తప్పులు చేశామనేది వెంటనే సమీక్షించుకోవాలి. లేదంటే ఆసియా క్రీడల్లో భంగపడే ప్రమాదం ఉంది.
కామన్వెల్త్ గేమ్స్ జోరును కొనసాగించాలి
- టాప్-5లో నిలవాలి
- అగ్రశ్రేణి ఆటగాళ్లు కీలకం
అంచనాలను అందుకొని గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సంతృప్తికర ప్రదర్శన కనబరిచారు. వరుసగా నాలుగోసారి పతకాల సంఖ్యను 50 దాటించారు. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ గేమ్స్‌లో భారత్ 101 పతకాలు సాధించినా... నాటి ప్రదర్శనను తాజా గేమ్స్‌తో పోల్చడం సబబుకాదు. న్యూఢిల్లీలో భారత్ పతకాలు నెగ్గిన పలు ఈవెంట్స్‌ను గ్లాస్గోలో నిర్వహించలేదు. ఆర్చరీ, టెన్నిస్ క్రీడాంశాలను పూర్తిగా తప్పించగా... రెజ్లింగ్‌లో గ్రీకో రోమన్ విభాగాన్ని... షూటింగ్లో 18 ఈవెంట్స్‌ను తొలగించి కుదించిన అంశాల్లో పోటీలను నిర్వహించారు.
అయినప్పటికీ భారత క్రీడాకారులు స్థాయికి తగ్గ ఆటతీరుతో 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 64 పతకాలు నెగ్గి ఐదో స్థానాన్ని సంపాదించారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ ప్రదర్శనతో భారత క్రీడాకారులు మురిసిపోకుండా ఇదే జోరును వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడల్లో కొనసాగించాల్సిన అవసరం ఉంది.
17వ ఆసియా క్రీడలకు ఈసారి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా ఖండానికి చెందిన 45 దేశాలు పాల్గొనే ఈ క్రీడల్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్ తదితర దేశాలతో భారత్‌కు గట్టిపోటీ ఎదురవడం ఖాయం. గ్లాస్గోలో నెగ్గిన మాదిరిగా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడం అంత సులువేంకాదు.
63 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా క్రీడల్లో పతకాలపరంగా భారత్ ఇప్పటివరకు 2010 గ్వాంగ్జూ క్రీడల్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ క్రీడల్లో భారత్ 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలతో కలిపి మొత్తం 65 పతకాలు సాధించింది.
1986 సియోల్ క్రీడల తర్వాత భారత్ పతకాల పట్టికలో టాప్-5లో నిలువలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి భారత్‌ను టాప్-5లో మళ్లీ చూసే అవకాశముంది. ఇంచియాన్ గేమ్స్‌లో మొత్తం 36 క్రీడాంశాలు మెడల్ ఈవెంట్స్‌గా ఉన్నాయి. ఇందులో 28 ఒలింపిక్ క్రీడాంశాలు కాగా, మిగతా ఎనిమిది నాన్ ఒలింపిక్ క్రీడాంశాలు. గ్వాంగ్జూ క్రీడల్లో ఉన్న చెస్, క్యూ స్పోర్ట్స్, సాఫ్ట్‌బాల్, రోలర్ స్పోర్ట్స్, డాన్స్ స్పోర్ట్, డ్రాగన్ బోట్ అంశాలను ఈసారి తొలగించారు. కొన్ని క్రీడాంశాలను తొలగించినా... ఈసారి భారత్‌కు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, కబడ్డీ, రోయింగ్, షూటింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు క్రీడాంశాల్లో పతకాలు నెగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఆసియా క్రీడల్లో అందలం ఎక్కాలంటే భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఆర్చరీలో దీపిక కుమారి, జయంత తాలుక్దార్... అథ్లెటిక్స్‌లో వికాస్ గౌడ... బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, సింధు, పారుపల్లి కశ్యప్, గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... టెన్నిస్‌లో లియాండర్ పేస్, సానియా మీర్జా, రోహన్ బోపన్న... షూటింగ్లో అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్, జీతూ రాయ్, హీనా సిద్ధూ, రాహీ సర్నోబాత్... రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్, గీత పోగట్, బబిత కుమారి... స్క్వాష్‌లో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్ప తదితరులు ‘పసిడి’ వెలుగులు విరజిమ్మితే భారత్ ఆసియాలో క్రీడాశక్తిగా ఎదిగేదిశగా మరో అడుగు ముందుకేస్తుంది.
- సాక్షి క్రీడావిభాగం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలు
ఏడాది స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
2010 38 27 36 101
2014 15 30 19 64