Indian revolutionary movement
-
జైహింద్ స్పెషల్: వాంటెడ్ సూర్యసేన్
బ్రిటిషర్ల దాష్టీకాలపై దండెత్తిన బెంగాల్ విప్లవ వీరుడు సూర్యసేన్! చిట్టగాంగ్ ప్రాంతంలో బ్రిటిషర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారాయన. ఉపాధ్యాయుడైన సేన్ విప్లవబాటలో అడుగుపెట్టాక ‘మాస్టర్ దా’ గా ప్రజల్లో మన్నన పొందారు. ఒక దశలో జాతీయ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన సేన్ తర్వాతి కాలంలో సాయుధ బాట పట్టారు. ఆయుధం పట్టినంత మాత్రాన మానవత విలువలు వదిలిపెట్టాల్సిన అవసరం లేదని, ‘మానవతావాదం విప్లవకారుల ప్రత్యేక ధర్మం’ అని చాటి చెప్పారు! 1920– 30 కాలంలో యువతను విశేషంగా ఆకర్షించి స్వాతంత్య్ర పోరాటంవైపు నడిపించి మాస్టర్‌దా పేరును సేన్ సార్థకం చేసుకున్నారు. మరణంలో కూడా భారత మాత స్వేచ్ఛ గురించి ఆయన తపించేవారనేందుకు ఆయన చివరిలేఖలో రాసిన ‘మరణం నా తలుపు తట్టింది. నా మనస్సు శాశ్వతత్వం వైపు ఎగిరిపోతోంది. ఈ గంభీర సమయంలో మీకు నేను చెప్పేది ఒక్కటే.. అది నాకల, బంగారు కల, స్వేచ్ఛా భారతావని కల’’ అన్న వాక్యాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఉపాధ్యాయ కుటుంబం సూర్యసేన్ 1894 మార్చి 22న చిట్టగాంగ్‌లోని నోపరాలో జన్మించారు. సేన్ తండ్రి రామనిరంజన్ సేన్ ఉపాధ్యాయుడు. 1916లో ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్ కళాశాలలో సేన్ బి. ఏ చదివారు. ఆ దశలోనే సేన్‌కు భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి సతీశ్ చంద్ర చక్రవర్తి అనే ఉపాధ్యాయుడి ద్వారా తెలిసింది. చదువు పూర్తయిన తర్వాత 1918లో చిట్టగాంగ్‌కు తిరిగి వచ్చి నందన్ కనన్లోని నేషనల్ స్కూల్లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం భారత జాతీయ కాంగ్రెస్ చిట్టగాంగ్ శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాలంలో ఆయన విప్లవాత్మక ఆదర్శాల వైపు ఆకర్షితుడయ్యారు. విప్లవ సంస్థ అనుశీలన్ సమితిలో కీలకంగా వ్యవహరించారు. ఒకపక్క విప్లవ భావజాలంవైపు ఆకర్షితులైనా, కాంగ్రెస్ చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆయన మద్దతు పలికారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊపునిచ్చేందుకు ఆయన అస్సాం– బెంగాల్ రైల్వే ట్రెజరీని కొల్లగొట్టారు. ఇందుకు 1926–28లో సేన్‌తో పాటు సహచరుడు అంబికా చక్రవర్తికి ప్రభుత్వం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. చిట్టగాంగ్ దాడి జైలు నుంచి విడుదలైన అనంతరం అనంత్ సింగ్, గణేశ్ ఘోష్ తదితర యువతతో సేన్ ‘ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ’ పేరిట సాయుధ సేనను ఏర్పాటు చేశారు. 1930 ఏప్రిల్ 18న సేన్ నేతృత్వంలో 65మంది విప్లవకారులు చిట్టగాంగ్ ఆయుధ డిపోపై దాడి చేశారు. డిపో నుంచి ఆయుధాలు సంగ్రహించడం, నగర కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసి బ్రిటిష్ రాజ్ నుంచి సంబంధాలు తెంపివేయడమనే లక్ష్యాలతో ఈ దాడి చేశారు. విప్లవ బృందానికి ఆయుధాలు దొరికినా, తగిన మందుగుండు దొరకలేదు. ఆయుధ డిపోపై విప్లవకారులు భారత జాతీయ పతాకం ఆవిష్కరించి తప్పించుకున్నారు. ఈ దాడి బెంగాల్ ప్రాంత ప్రజల్లో తీవ్రమైన జాతీయ భావనలను రేకెత్తించిందని బ్రిటిష్ అధికారి సామ్యూల్ హోర్ స్వయంగా పేర్కొన్నాడు. సేన్ దాడికి ప్రతిగా ఏప్రిల్ 22న వేలాది బ్రిటిష్ సైనికులు విప్లవకారులను చుట్టుముట్టారు. ఈ దాడిలో 80మంది సైనికులు, 12 మంది విప్లవకారులు మరణించారు. సేన్ బృందం చేతిలో తీవ్రమైన ఎదురుదెబ్బ తగలడంతో బ్రిటిష్ ప్రభుత్వానికి దిక్కుతోచలేదు. దాడి తర్వాత రోజుల్లో సేన్, ఆయన సహచరులు విడిపోయి సమీప గ్రామాల్లో తలదాచుకొని బ్రిటిష్ ఆస్తులపై, వ్యక్తులపై గెరిల్లా దాడులు కొనసాగించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రీతిలతా తదితరులు విప్లవ కార్యాచరణ కొనసాగించారు. నమ్మకద్రోహానికి బలి అజ్ఞాతంలో పలుమార్లు బ్రిటిషర్ల కన్నుగప్పిన సూర్యసేన్ పై అప్పటి ప్రభుత్వం పదివేల రూపాయల నజరానా ప్రకటించింది. దీనికి ఆశపడ్డ సూర్యసేన్ సొంత బంధువు నేత్రా సేన్ నమ్మకద్రోహం చేయడంతో సూర్యసేన్ 1933లో బ్రిటిషర్లకు చిక్కారు. అయితే నేత్రాసేన్కు బ్రిటిషర్ల బహుమతి లభించకముందే కిరణ్మయి సేన్ అనే మరో విప్లవకారుడు నేత్రాసేన్ను ఇంట్లోనే హత్యచేశాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినప్పటికీ సూర్యసేన్‌కు మద్దతుదారు కావడంతో నేత్రాసేన్ భార్య హంతకుడి వివరాలను వెల్లడించలేదు. సూర్యసేన్‌ను జైలునుంచి తప్పించాలని తారకేశ్వర్ అనే విప్లవకారుడు ప్రయత్నించి బ్రిటిషర్లకు చిక్కాడు. వీరిద్దరినీ కలిపి 1934 జనవరి 12న బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. అయితే మరణ శిక్షకుముందు ‘వందేమాతరం’ అని పలకలేని విధంగా సేన్ దంతాలు విరగకొట్టడంతో పాటు ఆయన గోళ్లను జైలర్ పీకేసి చిత్రహింసలకు గురిచే శాడు. సేన్ మరణానంతరం ఆయన బృంద సభ్యుల్లో చాలామంది బ్రిటిషర్లకు చిక్కారు. సేన్ తన పోరాటంలో విజయం సాధించలేకపోయినా, భారతీయుల గుండెల్లో విప్లవాగ్నిని, జాతీయ భావనను పెంచేందుకు కారణమయ్యారు. ‘‘భారతదేశం యొక్క స్వేచ్ఛా బలిపీఠం వద్ద ప్రాణాలను అర్పించిన దేశభక్తుల పేర్లు మీ గుండెల్లో రాయండి’’ అని ఆయన భారతీయులను కోరారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
జనం కోసమే జీవించిన వాడు
భారతదేశంలోని అణగారిన ప్రజానీకం, భారత విప్లవోద్యమం 2015 ఆగస్టు 18వ తేదీన ఒక ప్రతి భావంతమైన మేధావి, ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నాయకుణ్ణి కోల్పోయాయి. ఆయనే విప్లవ శిబి రంలో విష్ణు, విజయ్‌గా పరిచయమైన శ్రీధర్ శ్రీనివాసన్. ఆయన ఏ విప్లవ ఆదర్శాల కోసం జీవించి తన ప్రాణాలు అర్పించారో ఆ విప్లవాశయాలను కొనసాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావో యిస్టు) కేంద్ర కమిటీ ప్రతిజ్ఞ చేస్తోంది. విప్లవకారునిగా ఆయన ప్రయాణం: 1978- 79లో బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ యువ ఆర్ట్స్ విద్యార్థిగా శ్రీధర్ విప్లవ రాజకీయాల పట్ల ఆక ర్షితుడై దేశంలోని అణగారిన ప్రజానీకం కోసం పని చేయడానికి తన కాలేజీ చదువులను వదిలిపెట్టాడు. ఆ తరువాత 36 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో, ప్రజ లకు సేవ చేయాలనే పట్టుదలతో కొనసాగాడు. బొంబాయిలో విద్యార్థి ప్రగతి సంఘటన (వీపీ ఎస్) బ్యానర్ కింద శ్రీధర్ విద్యార్థులను సమీక రించి ఆందోళనలు నడిపాడు. 1979లో పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా బొంబాయి విశ్వవిద్యాల యాన్ని విద్యార్థులు స్వాధీనం చేసుకున్న చారిత్రక ఘటనకి నాయకత్వం వహించిన వారిలో ఆయన ఒకరు. యువజనులలోకి ఉద్యమం విస్త రించిన సమయంలో తిరిగి ఆయన వారిని నౌ జవాన్ భారత సభ (ఎన్బీ ఎస్) బ్యానర్ కింద సమీకరించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన సిటీ కమిటీ సభ్యుడు అయిన తర్వాత ఉద్యమం, బొంబయి శివార్లలోని కార్మికవాడలు, థానే, భివాం డి, సూరత్ వరకు కూడా విస్తరించింది. 1990లో పార్టీ నిర్ణయం మేరకు ఆయన విదర్భ ప్రాంతానికి బదిలీ అయ్యాడు. అక్కడ ఆయన చంద్రపూర్, వని లలోని బొగ్గు గని కార్మికులను సంఘటితం చేశాడు. 2007 వరకూ రెండు దశాబ్దాల పాటు ఆయన మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా చాలా సమర్ధ వంతంగా పార్టీకి నాయకత్వం వహించాడు. 2001 లో ఐక్యతా కాంగ్రెస్ (9వ కాంగ్రెస్) సందర్భంగా కేంద్ర కమిటీకి తిరిగి ఎన్నికయ్యాడు. ఉద్యమం ఆటుపోట్లకు గురైన అన్ని సందర్భాలలోనూ పార్టీ పంధాని సమర్థిస్తూ దృఢంగా నిలబడ్డాడు. పార్టీ అప్పగించిన బాధ్యతలని నెరవేర్చే విషయంలో ఏ తటపటాయింపుకూ గురికాకుండా ఒక మూలస్తంభంలా నిలిచాడు. అరెస్టు, జైలు జీవితం: 2007 ఆగ స్టులో శ్రీధర్ అరెస్టయ్యాడు. విచారణ పేరుతో రోజుల తరబడి, మానసిక చిత్ర హింసలను అనుభవించినప్పటికీ శత్రు వు ముందు తలవంచలేదు. ఆయనపై 60 కేసులకు పైగా పెట్టడం ద్వారా రాజ్యం ఆయనను సుదీర్ఘంగా జైలులో ఉంచే ప్రయ త్నం చేసి ఒక ఆరున్నరేళ్ల శిక్ష విధించడంలో సఫలం అయింది. తన విడుదల కోసం ఎదురుచూస్తూనే జైలులోని తన సహచర రాజకీయ ఖైదీలను చైతన్య వంతం చేసి ప్రభావితం చేశాడు. ఆ కాలమంతా జాతీయ, అంతర్జాతీయ పరిస్థితిని అధ్యయనం చేస్తూ అవిశ్రాంతంగా గడిపాడు. ఇస్లాం కార్యకర్త లతో చర్చిస్తూ వారి ఉద్యమాన్ని అర్థం చేసుకోవడా నికి ప్రయత్నం చేశాడు. 2013 ఆగస్టులో ఆయన విడుదలయ్యాడు. జైలు జీవితం ఆయన స్ఫూర్తిని దెబ్బతీయలేకపో యినా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. విడుదలైన తర్వా త తన కుటుంబంతో ఉంటూ ఆ కాలాన్ని విప్ల వోద్యమ ప్రచారంలో గడిపాడు. తన సహచరులను తిరిగి కలవడానికి ఎదురుచూసి, వారిని కలిసే క్రమంలోనే అమరుడయ్యాడు. శ్రీధర్ అమరత్వం విప్లవోద్యమానికి తీవ్రమైన దెబ్బ. చివరిశ్వాస వర కు హృదయంలో శ్రామికవర్గ, విప్లవోద్యమ ప్రయో జనాలను నింపుకొని వారికోసం నిస్వార్థంగా పని చేసిన ఉత్తమ పుత్రులలో ఒకరిని ఈ దేశ శ్రామిక వర్గం, కష్టజీవులూ కోల్పోయారు. పార్టీ శ్రేణులు, ప్రజానీకం హృదయాల్లో శ్రీధర్ జీవించే ఉంటారు. ఆయన ఆదర్శాలను పార్టీ ఎత్తిపడుతుంది, ఆయన ఆశయాలను కొనసాగించడానికి అవిశ్రాంతంగా పోరాడతామని ప్రతినబూనుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్రకమిటీ (మావోయిస్టు) ఆయనకు వినమ్రంగా విప్లవ జోహార్లు ఆర్పిస్తోంది. వారి కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖాన్ని పంచుకుంటోంది. శ్రీధర్ తన జీవి తాన్ని అర్పించిన ఆ గొప్ప ఆదర్శాలకు పునరం కితమవుదామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం. అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ, సీపీఐ (మావోయిస్టు) - శ్రీధర్ శ్రీనివాసన్