బ్రిటిషర్ల దాష్టీకాలపై దండెత్తిన బెంగాల్ విప్లవ వీరుడు సూర్యసేన్! చిట్టగాంగ్ ప్రాంతంలో బ్రిటిషర్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేశారాయన. ఉపాధ్యాయుడైన సేన్ విప్లవబాటలో అడుగుపెట్టాక ‘మాస్టర్ దా’ గా ప్రజల్లో మన్నన పొందారు. ఒక దశలో జాతీయ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన సేన్ తర్వాతి కాలంలో సాయుధ బాట పట్టారు. ఆయుధం పట్టినంత మాత్రాన మానవత విలువలు వదిలిపెట్టాల్సిన అవసరం లేదని, ‘మానవతావాదం విప్లవకారుల ప్రత్యేక ధర్మం’ అని చాటి చెప్పారు!
1920– 30 కాలంలో యువతను విశేషంగా ఆకర్షించి స్వాతంత్య్ర పోరాటంవైపు నడిపించి మాస్టర్‌దా పేరును సేన్ సార్థకం చేసుకున్నారు. మరణంలో కూడా భారత మాత స్వేచ్ఛ గురించి ఆయన తపించేవారనేందుకు ఆయన చివరిలేఖలో రాసిన ‘మరణం నా తలుపు తట్టింది. నా మనస్సు శాశ్వతత్వం వైపు ఎగిరిపోతోంది. ఈ గంభీర సమయంలో మీకు నేను చెప్పేది ఒక్కటే.. అది నాకల, బంగారు కల, స్వేచ్ఛా భారతావని కల’’ అన్న వాక్యాలు నిదర్శనంగా నిలుస్తాయి.
ఉపాధ్యాయ కుటుంబం
సూర్యసేన్ 1894 మార్చి 22న చిట్టగాంగ్‌లోని నోపరాలో జన్మించారు. సేన్ తండ్రి రామనిరంజన్ సేన్ ఉపాధ్యాయుడు. 1916లో ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్ కళాశాలలో సేన్ బి. ఏ చదివారు. ఆ దశలోనే సేన్‌కు భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి సతీశ్ చంద్ర చక్రవర్తి అనే ఉపాధ్యాయుడి ద్వారా తెలిసింది. చదువు పూర్తయిన తర్వాత 1918లో చిట్టగాంగ్‌కు తిరిగి వచ్చి నందన్ కనన్‌లోని నేషనల్ స్కూల్‌లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరారు. అనంతరం భారత జాతీయ కాంగ్రెస్ చిట్టగాంగ్ శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాలంలో ఆయన విప్లవాత్మక ఆదర్శాల వైపు ఆకర్షితుడయ్యారు. విప్లవ సంస్థ అనుశీలన్ సమితిలో కీలకంగా వ్యవహరించారు. ఒకపక్క విప్లవ భావజాలంవైపు ఆకర్షితులైనా, కాంగ్రెస్ చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆయన మద్దతు పలికారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊపునిచ్చేందుకు ఆయన అస్సాం– బెంగాల్ రైల్వే ట్రెజరీని కొల్లగొట్టారు. ఇందుకు 1926–28లో సేన్‌తో పాటు సహచరుడు అంబికా చక్రవర్తికి ప్రభుత్వం రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
చిట్టగాంగ్ దాడి
జైలు నుంచి విడుదలైన అనంతరం అనంత్ సింగ్, గణేశ్ ఘోష్ తదితర యువతతో సేన్ ‘ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ’ పేరిట సాయుధ సేనను ఏర్పాటు చేశారు. 1930 ఏప్రిల్ 18న సేన్ నేతృత్వంలో 65మంది విప్లవకారులు చిట్టగాంగ్ ఆయుధ డిపోపై దాడి చేశారు. డిపో నుంచి ఆయుధాలు సంగ్రహించడం, నగర కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసి బ్రిటిష్ రాజ్ నుంచి సంబంధాలు తెంపివేయడమనే లక్ష్యాలతో ఈ దాడి చేశారు. విప్లవ బృందానికి ఆయుధాలు దొరికినా, తగిన మందుగుండు దొరకలేదు. ఆయుధ డిపోపై విప్లవకారులు భారత జాతీయ పతాకం ఆవిష్కరించి తప్పించుకున్నారు. ఈ దాడి బెంగాల్ ప్రాంత ప్రజల్లో తీవ్రమైన జాతీయ భావనలను రేకెత్తించిందని బ్రిటిష్ అధికారి సామ్యూల్ హోర్ స్వయంగా పేర్కొన్నాడు. సేన్ దాడికి ప్రతిగా ఏప్రిల్ 22న వేలాది బ్రిటిష్ సైనికులు విప్లవకారులను చుట్టుముట్టారు. ఈ దాడిలో 80మంది సైనికులు, 12 మంది విప్లవకారులు మరణించారు. సేన్ బృందం చేతిలో తీవ్రమైన ఎదురుదెబ్బ తగలడంతో బ్రిటిష్ ప్రభుత్వానికి దిక్కుతోచలేదు. దాడి తర్వాత రోజుల్లో సేన్, ఆయన సహచరులు విడిపోయి సమీప గ్రామాల్లో తలదాచుకొని బ్రిటిష్ ఆస్తులపై, వ్యక్తులపై గెరిల్లా దాడులు కొనసాగించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రీతిలతా తదితరులు విప్లవ కార్యాచరణ కొనసాగించారు.
నమ్మకద్రోహానికి బలి
అజ్ఞాతంలో పలుమార్లు బ్రిటిషర్ల కన్నుగప్పిన సూర్యసేన్ పై అప్పటి ప్రభుత్వం పదివేల రూపాయల నజరానా ప్రకటించింది. దీనికి ఆశపడ్డ సూర్యసేన్ సొంత బంధువు నేత్రా సేన్ నమ్మకద్రోహం చేయడంతో సూర్యసేన్ 1933లో బ్రిటిషర్లకు చిక్కారు. అయితే నేత్రాసేన్‌కు బ్రిటిషర్ల బహుమతి లభించకముందే కిరణ్మయి సేన్ అనే మరో విప్లవకారుడు నేత్రాసేన్‌ను ఇంట్లోనే హత్యచేశాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినప్పటికీ సూర్యసేన్‌కు మద్దతుదారు కావడంతో నేత్రాసేన్ భార్య హంతకుడి వివరాలను వెల్లడించలేదు. సూర్యసేన్‌ను జైలునుంచి తప్పించాలని తారకేశ్వర్ అనే విప్లవకారుడు ప్రయత్నించి బ్రిటిషర్లకు చిక్కాడు. వీరిద్దరినీ కలిపి 1934 జనవరి 12న బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. అయితే మరణ శిక్షకుముందు ‘వందేమాతరం’ అని పలకలేని విధంగా సేన్ దంతాలు విరగకొట్టడంతో పాటు ఆయన గోళ్లను జైలర్ పీకేసి చిత్రహింసలకు గురిచే శాడు. సేన్ మరణానంతరం ఆయన బృంద సభ్యుల్లో చాలామంది బ్రిటిషర్లకు చిక్కారు. సేన్ తన పోరాటంలో విజయం సాధించలేకపోయినా, భారతీయుల గుండెల్లో విప్లవాగ్నిని, జాతీయ భావనను పెంచేందుకు కారణమయ్యారు. ‘‘భారతదేశం యొక్క స్వేచ్ఛా బలిపీఠం వద్ద ప్రాణాలను అర్పించిన దేశభక్తుల పేర్లు మీ గుండెల్లో రాయండి’’ అని ఆయన భారతీయులను కోరారు.
– దుర్గరాజు శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment