Indian Sugar Mill Association
-
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్‌ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
‘ఇథనాల్’ ప్రచారంలో టయోటా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్‌తో (ఇస్మా) చేతులు కలిపింది. భారత్‌లో స్థిర జీవ ఇంధనంగా ఇథనాల్‌ను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడానికి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పర్యావరణ అనుకూల సాంకేతికతతో పాటు ఇంధన స్వావలంబనను ప్రోత్సహించే వివిధ అధునాతన పవర్ట్రెయిన్ల కోసం నిరంతరం అధ్యయనం చేస్తున్నట్టు టయోటా తెలిపింది. ఇథనాల్‌ను జీవ ఇంధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2025–2026 నాటికి 8.6 కోట్ల బ్యారెల్స్ పెట్రోల్ స్థానంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం ద్వారా భారత్‌కు రూ.30,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అంచనా. -
ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రెసిడెంట్ ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం హెచ్ఎంఎస్ఐ సీఈవో ఒగాటా దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు. -
చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మార్కెటింగ్ సంవత్సరంలో 71–72 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు సరఫరా అయింది. మార్కెట్ నివేదికలు, నౌకాశ్రయాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 80 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందం జరిగింది. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్య ఇప్పటికే 57.17 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు చేరింది. అంత క్రితం మార్కెటింగ్ సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 31.85 లక్షల టన్నులకు పరిమితం అయింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఎగుమతి అయిన పరిమాణంలో 44 శాతం ఇండోనేషియా, బంగ్లాదేశ్ కైవసం చేసుకున్నాయి. అంత క్రితం ఏడాదిలో ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్లు 48 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. 2021–22లో 350 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. ఇందులో ఇప్పటికే మిల్లులు 330 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి. దేశీయంగా 272 లక్షల టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఎగుమతులు, దేశీయ వినియోగం పోను సెప్టెంబర్ నాటికి మిగులు 68 లక్షల టన్నులు ఉంటుంది. -
నెమ్మదించిన చక్కెర మిల్లుల ఎగుమతి ఒప్పందాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరల పతనం నేపథ్యంలో దేశంలో చక్కెర మిల్లుల తాజా ఎగుమతి ఒప్పందాలు నెమ్మదించాయిని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) పేర్కొంది. అయితే ఒప్పందాలకు సమయం మించిపోలేదని, ఇందుకు సంబంధించి సమయం ఇంకా మిగిలే ఉందని కూడా స్పష్టం చేసింది. చక్కెర మిల్లుల సంఘం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకూ సీజన్‌కాగా, ఇందులో తొలి రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) చక్కెర మిల్లుల నుంచి 6.5 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన ఎగుమతులు 3 లక్షల టన్నులు. ► ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ 37 లక్షల టన్నుల ఎగుమతులకు చక్కెర మిల్లులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, ఈ ఒప్పందాలు చాలా వరకు అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరలు పౌండ్‌కు (0.453 గ్రాములు) 20–21 సెంట్ల శ్రేణిలో (100 సెంట్లు ఒక డాలర్) ఉన్నప్పుడు జరిగాయి. కనిష్టంగా ఈ ధర 19 సెంట్స్‌కు పడిపోయింది. ప్రస్తుతం 19.6 సెంట్స్ స్థాయిలో ఉంది. అయితే ఈ ధర వద్ద భారత్ చక్కెర ఎగుమతులకు తగిన ధర లభించని పరిస్థితి ఉంది. ► ప్రస్తుత సీజన్లో ఇంకా తొమ్మిది నెలలకు పైగా సమయం మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో చక్కెర మిల్లులు ఎగుమతి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలమైన క్షణం కోసం వేచి ఉండటానికి తగినంత సమయం ఉందని సాధారణ అభిప్రాయం నెలకొంది. ► భారత చక్కెర మిల్లులు రాబోయే 7–8 నెలల్లో మరో రెండు మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయాలని ప్రపంచం కోరుకుంటే, ప్రపంచ (చక్కెర) ధరలు ప్రస్తుత స్థాయిల నుండి పెరగాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ► ప్రస్తుతం కొనసాగుతున్న 2021–22 సీజన్లో డిసెంబర్ 15 వరకు దేశంలో చక్కెర ఉత్పత్తి 77.91 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది గత సీజన్ ఇదే కాలంలో పోల్చితే (73.34 లక్షల టన్నులు) ఎక్కువ. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో చెరకు క్రషింగ్‌ను ముందుగా ప్రారంభించినందున ఈ సీజన్లో ఉత్పత్తి కొంచెం ఎక్కువగా ఉంది. ► అయితే దేశంలో చక్కెర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 15 వరకు 19.83 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. గత సీజన్లో ఇదే కాలంతో పోల్చిచూస్తే (22.60 లక్షల టన్నులు) ఇది తక్కువ. ► దేశంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉత్పత్తి 26.96 లక్షల టన్నుల నుంచి 31.92 లక్షల టన్నులకు పెరిగింది. క్రషింగ్ కార్యకలాపాలు ముందుగా ప్రారంభం కావడం, ప్రస్తుత సీజన్లో చెరకు ఎక్కువగా లభ్యం కావడం వంటి అంశాలు మహారాష్ట్రలో ఉత్పత్తి పెరుగుదలకు కారణం. ► దేశంలోని మూడో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన కర్ణాటకలో ఈ సీజన్లో డిసెంబర్ 15 వరకు ఉత్పత్తి 18.41 లక్షల టన్నులకు చేరుకుంది. క్రితం ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది (16.65 లక్షల టన్నులు) ఇది ఎక్కువ. లక్ష్యం దిశగా ఇథనాల్ సరఫరా.... ఐఎస్ఎంఏ ప్రకటన ప్రకారం, ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం దిశగా వెళుతోంది. నవంబర్‌తో ముగిసిన 2020–21 సీజన్లో 302.30 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా జరిగిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ తెలిపింది. దీనితో పెట్రోల్‌లో దీని మిశ్రమం అఖిల భారత స్థాయిలో 8.1 శాతానికి చేరింది. 2019–20లో ఈ మిశ్రమం కేవలం 5 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో (2021 డిసెంబర్–2022 నవంబర్) 10 శాతం మిశ్రమం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకు 459 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. మొదటి రెండు ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియల (ఈఓఐ) అనంతరం చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇప్పటివరకు మొత్తం 366 కోట్ల లీటర్లను కేటాయించడం జరిగింది. తదుపరి ఈఓఐల ద్వారా మిగిలిన లీటర్ల కేటాయింపులు జరుగుతాయని భావిస్తున్నట్లు ఐఎస్ఎంఏ పేర్కొంది. -
పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో చక్కెర ఉత్పత్తి రెండు రెట్లు పెరిగి 42.9 లక్షల టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఉత్పత్తి 20.72 లక్షల టన్నులుగా ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. ఈ సీజన్లో షుగర్‌కేన్ క్రషింగ్ త్వరగా ప్రారంభం కావటమే ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణమని ఐఎస్ఎంఏ పేర్కొంది. 2018–19 సంవత్సరంలోనూ ప్రొడక్షన్స్ ఇదే తీరులో జరిగిందని.. ఆ సమయంలో 418 షుగర్ మిల్లుల నుంచి 40.69 లక్షల టన్నులు చక్కెర ఉత్పత్తి జరిగింది. ఈ సీజన్లో ఉత్తర ప్రదేశ్ అత్యధికంగా చక్కెర ఉత్పత్తి జరిగింది. గతేడాది 11.46 లక్షల టన్నులుండగా.. ప్రస్తుతమిది 12.65 లక్షల టన్నులకు పెరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 15.72 లక్షల టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 1.38 లక్షల టన్నులుగా ఉంది. కర్నాటకలో 5.62 లక్షల టన్నుల నుంచి 11.11 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో ప్రధాన రాష్ట్రాల్లో సగటు షుగర్ మిల్ చక్కెర ధరలు తగ్గినట్లు ఇస్మా గుర్తించింది. -
ఏపీ, తెలంగాణ లలో స్వల్పంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: 2014-15లో (అక్టోబర్-జనవరి) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చక్కెర ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. గతేడాది 5.08 లక్షల టన్నులుగా ఉన్న చక్కెర ఉత్పత్తి ఈ ఏడాది 5.61 లక్షల టన్నులకు పెరిగిందని ఇండియన్ షుగర్ మిల్ అసోషియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర 30 శాతం వృద్ధితో (54 లక్షల టన్నులు) దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత 21 శాతం వృద్ధి (33.8 లక్షల టన్నులు)తో యూపీ రెండో స్థానంలో నిలిచింది. 22.7 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తితో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి తగ్గింది.