
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్‌తో (ఇస్మా) చేతులు కలిపింది. భారత్‌లో స్థిర జీవ ఇంధనంగా ఇథనాల్‌ను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడానికి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
పర్యావరణ అనుకూల సాంకేతికతతో పాటు ఇంధన స్వావలంబనను ప్రోత్సహించే వివిధ అధునాతన పవర్‌ట్రెయిన్‌ల కోసం నిరంతరం అధ్యయనం చేస్తున్నట్టు టయోటా తెలిపింది. ఇథనాల్‌ను జీవ ఇంధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.
2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2025–2026 నాటికి 8.6 కోట్ల బ్యారెల్స్ పెట్రోల్ స్థానంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం ద్వారా భారత్‌కు రూ.30,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అంచనా.