టెక్ కంపెనీలా.. మజాకా
న్యూఢిల్లీ : టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అక్కడ పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ, ఆ కంపెనీలు అందించే సౌకర్యాలు, ప్రయోజనాలు అలానే ఉంటాయి. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల ఉన్నప్పటికీ, ఆ కంపెనీలకున్న క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. తాజాగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ దేశీయ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు మరింత పాపులారిటీ పెరిగిందట. దేశీయ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే ఎంప్లాయిర్స్ జాబితాలో దేశీయ టెక్ కంపెనీల వార్షిక ర్యాంకింగ్స్‌ను పెంచుకున్నాయట. ఈ ర్యాంకులను యూనివర్సమ్స్ యాన్యువల్ సర్వే ఆధారితంగా రూపొందించారు. 50 దేశాల నుంచి 1.3 మిలియన్ పైగా అభ్యర్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. గతేడాది తొలిసారి టాప్ 10 ర్యాంక్ కోల్పోయిన ఇన్ఫోసిస్, తాజాగా మళ్లీ తన ర్యాంకును పునరుద్ధరించుకుని టాప్ 9వ ర్యాంక్‌ను సంపాదించుకుంది. దేశీయ అతిపెద్ద అవుట్సోర్సింగ్ సంస్థ టీసీఎస్, బెంగళూరుకు చెందిన విప్రోలు ఐదు స్థానాలను పెంచుకుని, 13, 20వ ర్యాంకుల్లో నిలిచాయి.
మరోవైపు అంతర్జాతీయ ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్లు ఈ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్నాయి. వారికి కూడా భారత మార్కెటే అత్యంత కీలకమైనదిగా ఉంది. దేశంలో మరిన్ని వ్యాపారాలను ఏర్పాటుచేయడానికి గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలు మరిన్ని చర్యలను తీసుకుంటున్నాయని రిపోర్టు తెలిపింది. ఇంటర్నేషనల్ కెరీర్ అత్యంత ముఖ్యమైన కెరీర్ లక్ష్యంగా ఉన్నప్పటికీ, గతేడాది నుంచి అది తగ్గిపోతుందని ఆసియా పసిఫిక్ రీజన్‌లోని యూనివర్సమ్ అడ్వయిజరీ హెడ్ ప్రతీక్ సభర్వాల్ అన్నారు. కేవలం పెద్ద అవుట్సోర్సింగ్ సంస్థలే కాకుండా.. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు కూడా దేశీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఫ్లిప్‌కార్ట్ 9 స్థానాలు ఎగబాకగా.. రిలయన్స్ 34వ ర్యాంక్ నుంచి 12వ ర్యాంక్‌కు పెరిగింది. బిజినెస్ స్టూడెంట్స్‌కు గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలు టాప్ 10 ర్యాంకింగ్స్‌లో ఉన్నాయని, వాటి అనంతరం బిజినెస్ విద్యార్థులఇండియన్ ఎంప్లాయిర్స్గా కేవలం దేశీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐలు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు తాజా సర్వే రిపోర్టు తెలిపింది.