Indian Venture Capital Fund
-
యూనికార్న్‌ల భారత్
ముంబై: యూనికార్న్‌ల విషయంలో భారత్ చైనా కంటే ముందు నిలిచింది. 2022లో మన దేశంలో 23 యూనికార్న్‌లు అవతరించాయి. చైనా మనలో సగం అంటే కేవలం 11 యూనికార్న్‌లకు పరిమితం అయింది. బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా గుర్తిస్తారు. మన దేశంలో మొత్తం యూనికార్న్‌లు 2022 చివరికి 96కు చేరాయి. అంతకుముందు ఏడాది చివరికి ఇవి 73గా ఉన్నాయి. బెయిన్ అండ్ కో, భారత్‌కు చెందిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) భాగస్వామ్యంతో ఒక నివేదికను రూపొందించి విడుదల చేసింది. భారత్‌లో 2021లో 44 యూనికార్న్‌లు అవతరించగా, దీంతో పోలిస్తే గతేడాది సగానికి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక గతేడాది కొత్తగా ఏర్పడిన 23 యూనికార్న్‌లలో 9 టాప్–3 మెట్రోలకు వెలుపల అవతరించినవి. భౌగోళికంగా స్టార్టప్‌లకు పెట్టుబడుల మద్దతు మరిన్ని ప్రాంతాలకు చేరుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. నాన్ మెట్రోల్లోని స్టార్టప్‌లకు గతేడాది 18 శాతం అధికంగా నిధులు లభించాయి. సాస్ ఆధారిత ఫిన్‌టెక్ సంస్థలు అధిక నిధులు రాబడితే, కన్జ్యూమర్ టెక్నాలజీ స్టార్టప్‌ల నిధుల సమీకరణ తగ్గింది. 2022లో స్థూల ఆర్థిక అంశాల పరంగా అనిశ్చితి, మాంద్యం భయాలు వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులపై ప్రభావం చూపించాయి. పెట్టుబడుల్లోనూ తగ్గుదల 2021తో పోలిస్తే 2022లో యూనికార్న్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. స్టార్టప్‌ల నిధుల సమీకరణ కూడా తగ్గింది. 2021లో 38.5 బిలియన్ డాలర్లు స్టార్టప్‌ల్లోకి వచ్చాయి. గతేడాది కేవలం 25.7 బిలియన్ డాలర్ల నిధులే వచ్చాయి. ఆర్థిక అనిశ్చితులు పెరగడంతో ముఖ్యంగా గతేడాది ద్వితీయ భాగంలో పెట్టుబడుల డీల్స్ తగ్గాయి. అయితే, ఆరంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రం నిధుల ప్రవాహం మెరుగ్గానే ఉంది. 2022లో 1,600 వెంచర్ క్యాపిటల్ పెట్టుబడి లావాదేవీలు నమోదయ్యాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో మార్పు.. బెయిన్ అండ్ కో పార్ట్నర్ అర్పణ్సేత్ స్పందిస్తూ. వెంచర్ క్యాపిటల్ సంస్థల ధోరనిలో మార్పు వచ్చిందని, అవి యూనిట్ లాభదాయకతపై దృష్టి సారించాని చెప్పారు. స్టార్టప్‌లు నియంత్రణపరమైన సవాళ్లను చూవిచూశాయని, ఉద్యోగుల తొలగింపులు, కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు తలెత్తినట్టు, ఇవన్నీ గతేడాది స్టార్టప్‌ల ఫండింగ్పై ప్రభావం చూపించినట్టు వివరించారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ సాస్ ఆధారిత స్టార్టప్‌లకు ఫండింగ్ 2021లో మాదిరే ఉండడం ఆశావహమన్నారు. రానున్న రోజుల్లోనూ స్థూల ఆర్థిక అనిశ్చితుల ప్రభావం స్టార్టప్‌ల ఫండింగ్పై ఉంటుందన్నారు. 2022లో ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు అసాధారణ స్థాయిలో సవాళ్లను చూశాయని ఐవీసీఏ ప్రెసిడెంట్ రాజన్ టాండన్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో నమ్మకం ఉందన్నారు. ‘‘స్టార్టప్‌ల దీర్ఘకాల వృద్ధి అవకాశాల పట్ల ఎంతో ఆశాభావంతో ఉన్నాం. అనిశ్చితులను అధిగమించే, అవకాశాలను గుర్తించే సామర్థ్యాలు వాటికి ఉన్నాయి’’అని టాండన్ చెప్పారు. -
ప్రణాళిక ఉంటే ఫండింగ్
వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం ఫౌండర్ స్వామి విజ్ఞానానంద పెట్టుబడులతో హిందూ పారిశ్రామికవేత్తలు చక్కని వ్యాపార ప్రణాళికైతే నిధులు సభ్యుల అనుసంధానానికి వెబ్సైట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందూ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు వస్తున్నాయి. ఫండ్ ఏర్పాటుకు ప్రపంచ దేశాల్లోని హిందూ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే సుముఖంగా ఉన్నారు. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఫండ్ స్థాపించే పనిలో నిమగ్నమయ్యామని వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద తెలిపారు. హిందూ ఉమెన్ ఫోరం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2015 డిసెంబర్‌కల్లా ఫండ్ కార్యరూపంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆయనింకా ఏమన్నారంటే.. బ్యాంకుల్లో వాటా.. హిందూ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే పెట్టుబడి అవసరం. వీసీ ఫండ్ ఏర్పాటు చేసి ఔత్సాహికులకు నిధులు సమకూర్చాలన్నది సభ్యుల ఆలోచన. హిందూ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఉండాలని కూడా కొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే లెసైన్సు పొందడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో నిధుల లేమితో ఉన్న బ్యాంకులో పెట్టుబడి పెట్టాలన్న ప్రతిపాదన కూడా సభ్యుల నుంచి వస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే మేము వాటా పొందే బ్యాంకు ఆరోగ్యకరమైన బ్యాంకుగా కార్యకలాపాలు సాగించగలదు. ఫండ్ రూపు రేఖలు, బ్యాంకులో పెట్టుబడి అంశాలపై మార్చికల్లా స్పష్టత వస్తుంది. సభ్యుల్లో 40 శాతం మంది రెడీ.. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరంలో 4,000 మందికిపైగా సభ్యులున్నారు. వీరిలో 40 శాతంపైగా సభ్యులు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. స్టార్టప్ కంపెనీలు ఉన్నత స్థితికి చేరాలి. చక్కని వ్యాపార ప్రణాళిక ఉంటే చాలు. ప్రణాళికను వ్యాపారంగా మలుస్తామని సభ్యులు అంటున్నారు. ఇక్కడి వ్యాపారవేత్తలు ప్రపంచ దేశాలకు విస్తరించాలన్నది ఫోరం ఆశయం. యువతను వ్యాపారాల వైపు నడిపిస్తాం. ఉత్పత్తుల మార్కెటింగ్తోపాటు వీరికి శిక్షణ ఇవ్వడానికి, వెన్నంటి నడిపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ప్రపంచ జీడీపీలో హిందూ సమాజం వాటా ప్రస్తుతం 3-4 శాతం లోపే ఉంది. దీనిని 20-25 ఏళ్లలో 16 శాతానికి చేర్చాలన్నది మా లక్ష్యం. అనుసంధానానికి వెబ్సైట్.. సభ్యుల అనుసంధానానికి వెబ్సైట్ ఒకదానిని రూపొందిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా సభ్యులతో భాగస్వామ్యానికి వెబ్సైట్ చక్కని వేదిక కానుంది. ఏ రంగంలో ప్రవేశించాలన్నా ఫోరం ద్వారా సూచనలు చేస్తాం. భవిష్యత్‌లో అవకాశాలు మెరుగ్గా ఉన్న విభాగాల పై దృష్టిసారించాలని సభ్యులకు చెబుతున్నాం. ఇప్పటికే సభ్యుల మధ్య సంయుక్త భాగస్వామ్య కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఎన్నో విజయవంతమయ్యాయి కూడా. నవంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన ఫోరం అంతర్జాతీయ సదస్సు విజయవంతమైంది. అనూహ్యంగా 53 దేశాల నుంచి 1,800 పైగా సభ్యులు హాజరు కావడంతో ఫోరం మరింత ఉత్సాహంగా ఉంది. ఢిల్లీలో కార్యాలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాం.