![India added 23 new unicorns in 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/4/UNICORNS.jpg.webp?itok=dUFwvfu_)
ముంబై: యూనికార్న్‌ల విషయంలో భారత్ చైనా కంటే ముందు నిలిచింది. 2022లో మన దేశంలో 23 యూనికార్న్‌లు అవతరించాయి. చైనా మనలో సగం అంటే కేవలం 11 యూనికార్న్‌లకు పరిమితం అయింది. బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా గుర్తిస్తారు. మన దేశంలో మొత్తం యూనికార్న్‌లు 2022 చివరికి 96కు చేరాయి. అంతకుముందు ఏడాది చివరికి ఇవి 73గా ఉన్నాయి.
బెయిన్ అండ్ కో, భారత్‌కు చెందిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) భాగస్వామ్యంతో ఒక నివేదికను రూపొందించి విడుదల చేసింది. భారత్‌లో 2021లో 44 యూనికార్న్‌లు అవతరించగా, దీంతో పోలిస్తే గతేడాది సగానికి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక గతేడాది కొత్తగా ఏర్పడిన 23 యూనికార్న్‌లలో 9 టాప్–3 మెట్రోలకు వెలుపల అవతరించినవి.
భౌగోళికంగా స్టార్టప్‌లకు పెట్టుబడుల మద్దతు మరిన్ని ప్రాంతాలకు చేరుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. నాన్ మెట్రోల్లోని స్టార్టప్‌లకు గతేడాది 18 శాతం అధికంగా నిధులు లభించాయి. సాస్ ఆధారిత ఫిన్‌టెక్ సంస్థలు అధిక నిధులు రాబడితే, కన్జ్యూమర్ టెక్నాలజీ స్టార్టప్‌ల నిధుల సమీకరణ తగ్గింది.
2022లో స్థూల ఆర్థిక అంశాల పరంగా అనిశ్చితి, మాంద్యం భయాలు వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులపై ప్రభావం చూపించాయి.
పెట్టుబడుల్లోనూ తగ్గుదల
2021తో పోలిస్తే 2022లో యూనికార్న్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. స్టార్టప్‌ల నిధుల సమీకరణ కూడా తగ్గింది. 2021లో 38.5 బిలియన్ డాలర్లు స్టార్టప్‌ల్లోకి వచ్చాయి. గతేడాది కేవలం 25.7 బిలియన్ డాలర్ల నిధులే వచ్చాయి. ఆర్థిక అనిశ్చితులు పెరగడంతో ముఖ్యంగా గతేడాది ద్వితీయ భాగంలో పెట్టుబడుల డీల్స్ తగ్గాయి. అయితే, ఆరంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రం నిధుల ప్రవాహం మెరుగ్గానే ఉంది. 2022లో 1,600 వెంచర్ క్యాపిటల్ పెట్టుబడి లావాదేవీలు నమోదయ్యాయి.
వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో మార్పు..
బెయిన్ అండ్ కో పార్ట్‌నర్ అర్పణ్‌సేత్ స్పందిస్తూ. వెంచర్ క్యాపిటల్ సంస్థల ధోరనిలో మార్పు వచ్చిందని, అవి యూనిట్ లాభదాయకతపై దృష్టి సారించాని చెప్పారు. స్టార్టప్‌లు నియంత్రణపరమైన సవాళ్లను చూవిచూశాయని, ఉద్యోగుల తొలగింపులు, కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు తలెత్తినట్టు, ఇవన్నీ గతేడాది స్టార్టప్‌ల ఫండింగ్‌పై ప్రభావం చూపించినట్టు వివరించారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ సాస్ ఆధారిత స్టార్టప్‌లకు ఫండింగ్ 2021లో మాదిరే ఉండడం ఆశావహమన్నారు.
రానున్న రోజుల్లోనూ స్థూల ఆర్థిక అనిశ్చితుల ప్రభావం స్టార్టప్‌ల ఫండింగ్‌పై ఉంటుందన్నారు. 2022లో ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు అసాధారణ స్థాయిలో సవాళ్లను చూశాయని ఐవీసీఏ ప్రెసిడెంట్ రాజన్ టాండన్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో నమ్మకం ఉందన్నారు. ‘‘స్టార్టప్‌ల దీర్ఘకాల వృద్ధి అవకాశాల పట్ల ఎంతో ఆశాభావంతో ఉన్నాం. అనిశ్చితులను అధిగమించే, అవకాశాలను గుర్తించే సామర్థ్యాలు వాటికి ఉన్నాయి’’అని టాండన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment