సౌదీలో భారతీయుల బతుకు ఎంత కష్టం...ఎంత కష్టం..
రియాద్: ఆర్థిక వ్యవస్థ కునారిల్లినప్పుడు, మానవత్వం మరచిన ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నప్పుడు, లాభార్జనే పరమాపేక్షగా పనిచేసే కంపెనీ యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తీసేసినప్పుడు.....కార్మికులు రోడ్డు మీదకు వస్తారు. ఆకలి మంటలతో అలమటిస్తారు. సౌదీ అరేబియాలో భారతీయులకు ఇప్పుడు అదే జరుగుతోంది. గత మూడు రోజులుగా తిండీ తిప్పలులేకుండా అలమటిస్తున్న దాదాపు పదివేల మంది భారతీయ కార్మికులను ఆదుకునేందుకు రియాద్‌లో భారత్ అంబసీ ఆదివారం నాడు జోక్యం చేసుకొంది.
భారత విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలో భారతీయ కార్మికులకు తాత్కాలికంగా షెల్టరును కల్పించేందుకు భారత ఎంబసీ ఐదు శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లోని భారతీయులకు ఒక్క ఆదివారం నాడే 15,000 కిలోల బియ్యాన్ని వండి ఆహారాన్ని అందించామని ఎంబసీ అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకునేందుకు అక్కడికి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ను పంపిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా ప్రకటించారు. మరో జూనియర్ మంత్రి ఎంజే అక్బర్ కూడా సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు.
ఎవ రెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ కార్మికులకు ఎగ్జిట్ వీసాలను ఇప్పించి వెనక్కి తీసుకరావడం మినహా భారత ప్రభుత్వం ప్రస్తుతం చేయగలిగిందీ ఏమీ లేదు. విదేశీ కార్మికులను దోచుకు తినేందుకు సౌదీలో ఆటవిక చట్టాలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. వాటిలో మార్పులు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వాలు ఎన్నడూ చిత్తశుద్ధితో కృషి చేయలేదు. సౌదీలోని చమురు కంపెనీలు ఊహించని లాభాలు గడిస్తుండడం, అక్కడి ప్రవాస భారతీయులు భారత్‌లో పెట్టుబడులు పెడుతుండడంతోనే ప్రభుత్వాలు సంతృప్తి చెందుతూ వచ్చాయి. అక్కడి కంపెనీల్లో పని ఒత్తిడి భరించలేకపోతే ఆత్మహత్య చేసుకోవాలే తప్ప భారత్‌కు పారిపోయి వచ్చే అవకాశమే అక్కడి చట్టాలు ఇవ్వడం లేదు.
యాజమాన్యం అంగీకరించి భారతీయ కార్మికుడికి ఎగ్జిట్ వీసాను మంజూరు చేస్తే తప్ప సౌదీ అధికారులు భారతీయ కార్మికులను దేశం విడిచి వెళ్లనీయరు. ఇప్పుడు పలువురు చమురు కంపెనీలు మూతపడడం, కార్మికులకు లేఆఫ్‌లు ప్రకటించడం వల్ల ఇప్పుడు భారతీయ కార్మికులకు సులభంగానే ఎగ్జిట్ వీసాలు ఇస్తారు. కానీ కొన్ని నెలలుగా రావాల్సిన బకాయిలను తీసుకోకుండా ఏ మొఖం పెట్టుకొని ఖాళీ చేబులతో భారత్‌కు వెళుతామని వారు ప్రశ్నిస్తున్నారు. సౌదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి బకాయిలను భారత ప్రభుత్వం ఇప్పించగలిగితే అంతకుమించి సాయం వారు ఆశించరు.
సౌదీ, కువైట్, బయిరెన్, ఓమన్‌లలో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారిలో 30 లక్షల మంది ఇప్పుడు రోడ్లపైకి వచ్చారు. సౌదీ శిబిరాల్లో తలదాచుకుంటున్న పదివేల మంది కార్మికలంత క్షుద్బాధను వారు అనుభవించక పోతుండకపోవచ్చుగానీ 30 లక్షల మంది భారతీయులు దుర్భర పరిస్థితుల్లోనే బతుకుతున్నారు.
సౌదీలో రెండు లక్షల మంది ఉద్యోగులను కలిగిన అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ‘బిన్ లాడెన్ గ్రూప్’ ఇటీవల ఒకేసారి 50 వేల మందిని ఉద్యోగాలను తీసివేసింది. వారిలో భారతీయులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా వారు మక్కాకు శాంతి ప్రదర్శన జరిపారు. బిన్ లాడెన్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. బస్సులను దగ్ధం చేశారు. అయినా సౌదీ ప్రభుత్వం వారి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత ప్రభుత్వం కూడా స్పందించలేదు.
అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పడిపోతుండడం వల్ల చమురు కంపెనీలపాటు అనుబంధ కంపెనీలు కూడా గల్ఫ్‌లో గత కొన్నేళ్లుగా మూతపడుతూ వస్తున్నాయి. మరో కొన్నేళ్లపాటు ఏటా 12 శాతం ద్రవ్యలోటు కొనసాగనుందని గల్ఫ్ దేశాలు అంచనావేశాయి. ఒక్క సౌదీ అరేబియాలోనే గతేడాది చమురు కంపెనీలు 9,800 కోట్ల డాలర్ల నష్టపోయాయని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. ఏటా 330 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి.