‘ట్రిపుల్ తలాక్’ను పునఃపరిశీలించండి
సుప్రీం కోర్టుకు కేంద్రం వినతి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారిగా, ముస్లింలు పాటించే మూడుసార్ల తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వం విధానాలను కేంద్రం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. లింగ సమానత్వం, లౌకికత్వాల ప్రాతిపదికన వీటిని పునఃపరిశీలించాలంది. ఇస్లాం దేశాల్లోని మతాచారాలు, వివాహ చట్టాలను న్యాయ శాఖ.. కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో ప్రస్తావించింది. మన దేశంలోనూ మూడుసార్లు తలాక్, బహుభార్యత్వాల చెల్లుబాటును ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సరిచూడాలంది.
ఒక లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం మహిళలందరికీ సమాన హోదా, గౌరవం, కల్పించకుండా ఉండేందుకు మతం కారణమవుతుందో లేదో తెలపాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లకు ముస్లిం మతంలో ఉన్న కొన్ని పద్ధతులు విరుద్ధమంది. ఐక్యరాజ్యసమితి స్థాపన సమయం నుంచి భారత్ సభ్య దేశ మనీ, అంతర్జాతీయ ఒడంబడికలతోపాటు ఐరాస శాసనపత్రం ప్రకారం మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలంది. కాగా, మూడుసార్లు తలాక్తోపాటు ఉమ్మడి పౌరస్మృతి గురించి అభిప్రాయాలు తెలపాల్సిందిగా జాతీయ న్యాయ కమిషన్ ప్రజలను కోరింది.