సెమీస్‌లో శ్రీకాంత్
* సింధుకు చుక్కెదురు
* ఇండోనేసియా ఓపెన్ టోర్నీ
మలాంగ్: గత ఏడు నెలల్లో తాను పాల్గొన్న 15 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఎట్టకేలకు దానిని అధిగమించాడు. ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-10, 21-5తో 15వ సీడ్ టెక్ జీ సూ (మలేసియా)పై అలవోకగా గెలిచాడు.
కేవలం 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్, ఇండోనేసియా రైజింగ్ స్టార్ జిన్‌టింగ్ ఆంథోనీతో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0-1తో వెనుకబడ్డాడు.
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-23, 13-21తో ప్రపంచ 67వ ర్యాంకర్ హీ బింగ్జియావో (చైనా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో గేమ్ పాయింట్‌ను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు కోలుకోలేకపోయింది.