సీక్రెట్ సబ్ మెరైన్‌లో యుద్ధవిన్యాసాలు
ఆ సబ్‌మెరైన్ సముద్ర జలాల్లో గుమ్మనంగా దాగి ఉన్నప్పుడు.. అత్యాధునికమైన నౌకాదళాలు కూడా గుర్తించకపోయేవి. అరేబియా, బంగాళాఖాతం సముద్ర జలాల్లో రహస్యంగా పొంచి ఉండి, యుద్ధనౌకల ప్రయాణాన్ని పర్యవేక్షించడం, వాటి అనుపానులను తెలుసుకోవడంలో దానికి తిరుగులేదు. 'నీటిలో కన్నం'గా పిలుచుకునే ఆ సబ్‌మెరైనే 'కిలో'. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ నేవీ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా, రహస్య సబ్మెరైన్గా ఉన్న ఈ 'కిలో'పై భారత్.. అమెరికా, జపాన్‌లతో కలిసి యుద్ధక్రీడలు నిర్వహించనుంది.
చాలా ఏళ్లుగా రష్యా డిజైన్ చేసిన 'కిలో' క్లాస్ సబ్‌మెరైన్‌కు సంబంధించి విదేశీ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ నేవీ తిరస్కరిస్తూ వచ్చింది. ఇలా శిక్షణ ఇవ్వడం వల్ల వారికి ఈ సబ్‌మెరైన్ చేసే విశిష్టమైన శబ్దం, దీని విలువైన సమాచారం తెలిసిపోతుందనే భయంతో ఇందుకు నిరాకరించింది. సముద్ర జలాల్లో రహస్యంగా నక్కి ఉండే ఈ సబ్‌మైరెన్ చేసే ధ్వనిని.. విదేశీ నేవీలు గుర్తిస్తే.. దీని ఉనికి గురించిన సమాచారం వారికి ఇట్టే తెలిసిపోతుంది. అందుకే చాలాకాలంగా దీని ఉనికి గురించి విదేశీ నౌకాదళాలకు తెలియజేసేందుకు నిరాకరిస్తూ వచ్చిన భారత్ తొలిసారిగా అమెరికా, జపాన్ నేవీలతో యుద్ధ క్రీడలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న మలబార్ సిరీస్ ఎక్సర్సైజ్లో భాగంగా ఈ సబ్‌మెరైన్‌పై యుద్ధవిన్యాసాలకు ముందుకొచ్చింది.
అమెరికా, జపాన్‌తో భారత్ నెరుపుతున్న వ్యూహాత్మక దౌత్యం, పరస్పర విశ్వాసానికి ప్రతీకగా భారత్ ఇందుకు సిద్ధపడింది. ప్రస్తుతం భారత్ వద్ద 9 'కిలో' క్లాస్ సబ్మెరైన్లు ఉన్నాయి. తీరప్రాంత భద్రత, నౌకాదళాల విషయంలో ఈ మూడు దేశాలకు సవాలుగా మారిన చైనా దగ్గర 'కిలో' క్లాస్ సబ్మెరైన్లు 12 ఉన్నాయి. ఇందులో పది సబ్మెరైన్లు భారత్ దగ్గరున్న 1987 నాటి మోడల్స్ కన్నా అత్యాధునికమైనవి.