ఎమర్జెన్సీ అంటే సిక్కు అల్లర్లా!
ఎమర్జెన్సీ అంటే సిక్కుల అల్లర్లకు సంబంధించిన అంశం. అల్లర్లు అదుపు తప్పడంతో వాటిని అదుపు చేసేందుకు బ్లూస్టార్ ఆపరేషన్‌కు ఎమర్జెన్సీ సహకరించినది.... ఎమర్జెన్సీ అంటే ఏమిటన్న ప్రశ్నకు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీకి చెందిన 'వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్' కళాశాలకు చెందిన దేవంగ్ అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం.
-నాకు సరిగ్గా తెలియదు. అది స్వర్ణ దేవాలయానికి సంబంధించిన అంశం కావొచ్చు...ఇది శుభాంగి అనే ఓ విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం.
-ఢిల్లీలో టెర్రరిస్టుల దాడులకు సంబంధించినది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన విధించారు...ఇది ఎస్పీఎం కాలేజీకి చెందిన శచి అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం.
-గత కొన్ని రోజులుగా పత్రికల్లో, టీవీల్లో దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్లకు సంబంధించి ఇంధిరాగాంధీ తీసుకున్న ఓ నిర్ణయం...ఇది ఆసియన్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హరిత్ అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం.
-రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తుంది. నాకు గుర్తున్నంతవరకు దేశంలో 367 అధికరణ కింద ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు...అని ఏఆర్ఎస్డీ కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువున్న స్వాతి అనే విద్యార్థిని సమాధానం ఇచ్చారు.
-ఇందిరాగాంధీ హయాంలో 1975 నుంచి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నియంత్రించారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను బలవంతంగా అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై అణచివేతకు దిగింది... శ్రీ వేంకటేశ్వర కాలేజీలో ఇంగ్లీషులో మాస్టర్ డిగ్రీ చేస్తున్న దేబయు చటర్జీ అనే విద్యార్థి మాత్రం సరైన సమాధానం ఇచ్చారు.
(దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్ 25వ తేదీకి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ఢిల్లీ నగరంలోని వివిధ కళాలలో చదువుతున్న విద్యార్థులను ఎమర్జెన్సీ గురించి ప్రశ్నించగా ఇలాంటి సమాధానాలు వచ్చాయి. 1990లలో జన్మించిన విద్యార్థుల్లో 99 శాతం మందికి ఎమర్జెన్సీ గురించి తెలియదని దీంతో తేటతెల్లమైంది).