indo pak series
-
ఇండో-పాక్ సిరీస్ లేనట్టేనా ?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని, కాల్పులను విరమిస్తేనే ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుందని స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాలపై పార్లమెంట్ సంప్రదింపుల కమిటీ భేటీ సందర్భంగా సుష్మా ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య తటస్ధ వేదికలపై క్రికెట్ సిరీస్‌కు సంబంధించి సుష్మా స్పందిస్తూ పాక్ ఉగ్ర కార్యకలాపాలు, సరిహద్దుల్లో కాల్పులను నిలిపివేయకపోతే క్రికెట్ మ్యాచ్‌లు జరగబోవని సంకేతాలు పంపారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడవని మంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు భారత్‌లో పాక్ రాయబారితో ఇటీవల తాను భేటీ అయిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను సుష్మా ఈ భేటీలో వివరించారు. ఇరు దేశాల జైళ్లలో మగ్గుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, మానసిక పరిస్థితి సరిగా లేని ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయాలనే ప్రతిపాదనపై తాము చర్చించామని చెప్పారు. -
ఇండో పాక్ సిరీస్‌కు సర్కారు ఓకే!
ఇరు దేశాలు ఎప్పుడు ఎక్కడ తలపడినా అది సంచలనమే. ఏ స్థాయి మ్యాచ్ అయినా అది అట్టహాసంగా జరగాల్సిందే. అభిమానుల మధ్య దాదాపు యుద్ధవాతావరణమే నెలకొంటుంది. సోషల్ మీడియాలో కూడా అది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అదే.. ఇండో- పాక్ క్రికెట్ మ్యాచ్. అవును.. ఈ రెండు దాయాది దేశాల మధ్య త్వరలోనే మరో సిరీస్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2008లో ముంబై దాడుల నేపథ్యంలో నిలిచిపోయిన ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ పునరుద్ధరణకు భారత, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు దాదాపు ఓ అంగీకారానికి వచ్చాయి. దీనికి భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది కూడా. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నవంబర్, డిసెంబర్లో అబుదాబిలో ఈ సిరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సర్వసాధారణంగానే భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ పోటీ ఉందంటే.. అది మ్యాచ్ కాదు, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోందా అన్నంతగా భావోద్వేగాలు చెలరేగుతాయి. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ పోటీలలో మొట్టమొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనే మనవాళ్లు పాక్‌ను చిత్తుగా ఓడించినప్పుడు కప్ రాకపోయినా పర్వాలేదు.. పాక్ మీద నెగ్గాం చాలని అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అసలు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, లష్కరే తాయిబా నాయకుడు లఖ్వీకి బెయిల్ ఇచ్చి స్వేచ్ఛగా తమ దేశంలో తిరగనిస్తోందని, అందువల్ల వాళ్లను మనతో క్రికెట్ ఆడనివ్వొద్దని కూడా కొంతమంది ఎంపీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే.. రెండు దేశాల్లో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఉద్రిక్తతలు తారస్థాయికి వెళ్తాయనే ఉద్దేశంతో తటస్థ వేదికను ఎంచుకుని అక్కడే సిరీస్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.