సాక్షి, న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని, కాల్పులను విరమిస్తేనే ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుందని స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాలపై పార్లమెంట్ సంప్రదింపుల కమిటీ భేటీ సందర్భంగా సుష్మా ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇరు దేశాల మధ్య తటస్ధ వేదికలపై క్రికెట్ సిరీస్‌కు సంబంధించి సుష్మా స‍్పందిస్తూ పాక్ ఉగ్ర కార్యకలాపాలు, సరిహద్దుల్లో కాల్పులను నిలిపివేయకపోతే క్రికెట్ మ్యాచ్‌లు జరగబోవని సంకేతాలు పంపారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడవని మంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది.
మరోవైపు భారత్‌లో పాక్ రాయబారితో ఇటీవల తాను భేటీ అయిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను సుష్మా ఈ భేటీలో వివరించారు. ఇరు దేశాల జైళ్లలో మగ్గుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, మానసిక పరిస్థితి సరిగా లేని ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయాలనే ప్రతిపాదనపై తాము చర్చించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment