నవ శకానికి నాంది
కెన్నెడి హత్య తరువాత భారత్ పట్ల అమెరికా వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు మొదలైన భారత్ వ్యతిరేక వైఖరి 1971లో పరాకాష్టకు చేరుకుంది. అప్పుడు జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాక్‌ను అమెరికా బాహాటంగానే సమర్థించింది.
ప్రపంచ రాజకీయ దృశ్యం నిశితంగా, క్లిష్టంగా మారిన కాలంలో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఒకప్పుడు వీసా తిరస్కరించిన దేశమే ఇప్పుడు ఎర్ర తివాచీ పరిచి ఆ వ్యక్తికే స్వాగత సత్కారాలు చేయడానికి సిద్ధం కావడం మారిన పరిస్థితులనే సూచిస్తోం ది. కమ్యూనిస్టు వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఆశించి భంగపడిన అమెరికా, ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదం మీద జరిపే పోరులో భారత్ కలసి రావడం వరంగానే భావిస్తోంది. 2009లో బరాక్ ఒబామా అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం అమెరికా చరిత్ర లోనే కొత్త అధ్యాయం. అయితే భారత్‌తో సంబంధాల విషయంలో ఆయన మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారన్న వాదన ఉంది. అంతకుముందు జార్జి బుష్ (జూనియర్) సాధించిన విజయాలను కూడా ఆయన నిలబెట్టలేదన్న విమర్శ వినిపిస్తుంది. వాణిజ్య, వ్యూహాత్మక అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, అంతర్జాతీయ ఉగ్రవాదం మీద రాజీలేని వైఖరిని ప్రదర్శి స్తున్న మోదీ ఇప్పుడు అమెరికా పర్యటనను ప్రారంభిం చడం ఆసక్తికి కారణమవుతోంది.
ఓ అచ్చుయంత్రం కొని, చేతులు కాల్చుకున్న అమె రికా హాస్య, వ్యంగ్య రచయిత మార్క్‌ట్వైన్ 1896లో ఆసి యాలో పర్యటించాడు. కొంత నిధి సేకరించి, కష్టాల నుంచి బయటపడడం ఆయన ఉద్దేశం. అప్పుడే భారత దేశం వచ్చి ఇక్కడి వైవిధ్యానికి మురిసిపోయాడు. మన సాంస్కృతిక సంపదనీ, లేమినీ కూడా చూశాడు. దాదాపు 120 సంవత్సరాల తరువాత ఇప్పుడు అమెరికా హఠాత్తుగా భారత్ పట్ల విశేషమైన ఆసక్తిని ప్రదర్శించడం,మైత్రికి తహతహలాడుతున్నట్టు కనిపించడం వెనుక ఇలాంటి కారణమే కనిపిస్తుంది. ఉగ్రవాదం విషయంలో చేతులు కాల్చుకున్న ఆ అగ్రరాజ్యం భారత్ వంటి ఒక ‘విశ్వసనీయ’ మిత్రుడి కోసం అన్వేషిస్తున్న మాట నిజం. 1776 ముందు నాటి అమెరికా స్వాతంత్య్ర పోరాటం నుంచి భారత స్వాతంత్య్రోద్యమం ప్రేరణను కూడా పొందింది. ఆ విధంగా భారత్ మీద అమెరికాకు కొంత సానుభూతి ఉంది. కానీ ఈ సానుకూల దృక్పథం 1947 తరు వాత భారత్-అమెరికా సంబంధాలలో ఒకే రీతిన కొనసాగక పోవడమే పెద్ద వైచిత్రి. మారిన ప్రపంచ రాజకీయ దృశ్యం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధం, కమ్యూనిజం, సోవియెట్ రష్యా పతనం, అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం, అంతర్జాతీయ ఉగ్రవాదం మీద పోరు - ఇవన్నీ మన రెండు దేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆయా కాలాలను బట్టి ఒక్కొక్కసారి కౌగిలింతలకూ, ఒక్కొక్కసారి కత్తులు దూసుకోవడానికి కారణమైనాయి.
నేటి ప్రధాని మోదీ తొలి అమెరికా అధికారిక పర్యటన ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతోంది. అయితే మన ప్రథమ ప్రధాని నెహ్రూ అక్టోబర్ 11, 1949 నుంచి నవం బర్ 7, 1949 వరకు పర్యటించారు. సహజంగా సామ్య వాద ప్రియుడైన నెహ్రూ సోవియెట్ రష్యా వైపు మొగ్గుతూ ఉండేవారు. అలీన విధానంతో అటు రష్యాకూ, ఇటు తమకూ అందకుండా ఉనికిని నిలుపుకుంటున్నందుకు భారత్ మీద అమెరికా ఒకింత అలకతో ఉండేది. కాశ్మీర్ సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికాకు అవకాశం ఇవ్వరాదని 1948 నుంచి భారత్ విధానం నిర్ణయం చేసుకుంది. కానీ 1962 నాటి చైనా దురాక్రమణ విషయంలో భారత్ వాదనను సంపూర్ణంగా సమర్థించిన దేశం అమెరికాయే. కొంత ఆయుధ సంపత్తిని కూడా అమెరికా భారత్‌కు సరఫరా చేసింది. మరో యుద్ధమే జరిగితే చైనాపై అణ్వాయుధం ప్రయోగించాలని అమెరికా భావించిన విషయం తరువాత బయటపడింది. నిజానికి చైనా రిపబ్లిక్‌ను గుర్తించవద్దంటూ అమెరికా చేసిన సూచనను భారత్ ఆదిలో నిరాకరించింది. కానీ 1963లో జాన్ ఎఫ్ కెన్నెడి హత్య తరువాత భారత్ పట్ల అమెరికా వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు మొద లైన భారత్ వ్యతిరేక వైఖరి 1971లో పరాకాష్టకు చేరు కుంది. అప్పుడు జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాక్‌ను అమెరికా బాహాటంగానే సమర్థించింది. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్థాన్‌కు ఆయుధాలను సమకూర్చాడు. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పోఖ్రాన్-1 అణుపరీక్ష జరపడంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బల హీనపడ్డాయి. భారత్ తన అలీన విధానం నుంచి కొంచెం పక్కకు జరిగి సోవియెట్ రష్యాతో స్నేహ, సహకార ఒప్పం దం మీద సంతకాలు చేసింది కూడా అప్పుడే.
మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభు త్వం వచ్చే వరకు మన రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. జనతా ప్రభుత్వం సోవియెట్ రష్యా వ్యతిరేఖ వైఖరిని అవలంబించినట్టు విశ్లేషకులు చెబుతారు. జనతా హయాంలోనే అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారత్‌లో పర్యటించారు. అయినప్పటికీ ఇండియాకు అణు పదార్థాల ఎగుమతి మీద ఉన్న నిషేధాన్ని అమెరికా తొలగించలేదు. మళ్లీ 1980లో అధికారంలోకి వచ్చిన ఇందిర రష్యాను వ్యతిరేకించక తప్పని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో రష్యా జోక్యాన్ని ఇందిర నిరసించి, పరోక్షంగా అమెరికాకు సన్నిహితమయ్యారు. అయితే భోపాల్ విషవాయువు కేసులో ప్రధాన నిందితుడు ఆండర్సన్‌ను అప్పగించే విషయంలో రెండు దేశాలకు మధ్య సంబంధాలలో మరోసారి ఒడిదుడుకులు వచ్చాయి.
సోవియెట్ రష్యా పతనం తరువాత ప్రపంచ రాజ కీయ దృశ్యం సంపూర్ణంగా మారింది. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహించే అవకాశం మొదటిసారి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి పీవీ నరసింహారావుకు దక్కింది. డాక్టర్ మన్మోహన్ సహ కారంతో పీవీ ఆర్థిక సంస్కరణలను తెచ్చారు. సరళీకరణ విధానాలతో భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తం అమెరికాతో ఆర్థిక సంబంధాలను నెరపవలసి వచ్చింది. 1998, మేలో ఎన్డీయే ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పోఖ్రాన్ -2 అణుపరీక్ష జరపడంతో చరిత్రలో ఎన్నడూ లేని అథమ స్థాయికి అమెరికా-భారత్ సంబం ధాలు చేరుకున్నాయి. పోఖ్రాన్-2కు జవాబు అన్నట్టు పాకిస్థాన్ అదే నెలలో అణు పరీక్ష జరిపింది. ఉపఖండానికి అణు బెడదను ఊహించి అమెరికా, జపాన్ సహా పలు దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో అమెరికా రాయబారిని వెనక్కి పిలిపించారు. అమెరికా ఆంక్షలు భారత్‌ను ఏమీ చేయలేకపోవడం, మారిన పరిస్థితులను బట్టి క్లింటన్ 2000 సంవత్సరంలో భారత్‌లో పర్యటించి, సం బంధా లకు మళ్లీ ఊపిరి పోశారు. చిత్రం ఏమిటంటే, 1962 యుద్ధంలో చైనాను అభిశంసించినట్టే, ఈ మధ్యలో జరిగిన కార్గిల్ ఘర్షణలో ఇండియా శత్రుదేశమైన పాకిస్థాన్‌ను అమెరికా తప్పుపట్టింది. అధీన రేఖ వెంబడి ఉన్న పాక్ సేన లను ఉపసంహరించాలని ఆ దేశం మీద ఒత్తిడి తెచ్చింది.
సెప్టెంబర్ 11, 2001నాటి డబ్ల్యూటీసీపై దాడులు, భారత పార్లమెంటు మీద దాడి ఘటనలతో ఇరు దేశాలు మరింత సన్నిహితమైనాయి. మన్మోహన్ సింగ్ హయాంలో ఇవి జరిగాయి.అంతర్జాతీయ ఉగ్రవాదం మీద తాము ఆరంభించిన పోరులో భారత్‌ను ఒక విశ్వసనీయ మిత్రు నిగా భావిస్తున్నట్టు జార్జిబుష్ ప్రకటించారు. 2005లోనే రక్షణ ఒప్పందాలను చేసుకున్నాయి. ఆ సంవత్సరంలోనే ఇరు దేశాలు పౌర అణు సహాయ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. దీనితో అణు సంబంధ ఎగుమతులకు సంబంధిం చి భారత్ మీద ఉన్న అన్ని నిషేధాలు తొలగిపోయాయి.
ఒబామా తన పదవీ స్వీకారం సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్సింగ్ను తొలి అంతర్జాతీయ అతిథిగా విందుకు ఆహ్వానించారు కూడా. అయినా ఆ ఆతిథ్యం ఫలి తాలను ఇవ్వలేకపోయింది. తన హయాంలో పటిష్టమైన బంధం, తన కళ్ల ఎదుటే నీరుగారుతున్న దృశ్యాన్ని మన్మో హన్ చూడవలసి వచ్చింది. హెచ్ 1బీ వీసాల వివాదం, దేవయాని ఖోబ్రాగడే అరెస్టు వంటివి ద్వైపాక్షిక సంబం ధాల మీద గట్టి ప్రభావాన్నే చూపించాయి. 21వ శతాబ్దం లో భారత్ ఒక ఆర్థికశక్తిగా ఆవిర్భవించబోతున్నది. ఆసి యాలో ఇదే స్థాయి ఆర్థిక శక్తి చైనా. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను మోదీ తన గ్రామానికి తీసుకువెళ్లడం ద్వారా తన మనోగ తాన్ని మోదీ వ్యక్తీకరించారు. ఇదే అమెరికాను తొందరపెట్టి ఉండవచ్చు. ఏమైనా, ప్రస్తుతం మోదీ యాత్ర పట్ల అమెరికా చూపుతున్న ఆసక్తి ఇక్కట్లతో బల హీనపడుతున్న ఒక పెద్ద రాజ్యం, బలపడుతున్న ఒక ఆర్థిక శక్తితో వ్యవహరించవలసిన తీరునే తలపిస్తున్నది.
-డాక్టర్ గోపరాజు నారాయణరావు